జడ్జిల మీద ఆ మాటలేంది గడ్కరీ

Update: 2016-05-11 07:26 GMT
చేతిలో పవర్ ఉంటే చాలు.. తమను తాము మర్చిపోతున్నట్లుగా వ్యవహరిస్తుంటారు కొందరు రాజకీయ నాయకులు. అత్యుత్తమ స్థానాల్లో ఉన్న వారికి కానీ పవర్ పొగరు తలకు ఎక్కితే వారి నోటి నుంచి వచ్చే మాటలు ఏ రీతిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మాటలు ఇదే రీతిలో ఉండటం గమనార్హం.

రాజకీయ నాయకులతో సహా.. ఏ వర్గం కూడా తొందరపడి న్యాయవ్యవస్థ మీదా.. న్యాయమూర్తుల మీద నోరు పారేసుకోవటం ఉండదు. చాలా అరుదైన సందర్భాల్లో వారు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు. అది కూడా మోతాదు మించకుండానే.కానీ.. అందుకు భిన్నంగా కేంద్రమంత్రి గడ్కరీ వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతున్నాయి. న్యాయమూర్తుల మీద గడ్కరీకి ఉన్నట్లుండి అంత ఆగ్రహం రావటానికి కారణం.. మహారాష్ట్రలో నిర్వహించాల్సిన ఐపీఎల్ మ్యాచ్ లను తరలించాలంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో న్యాయమూర్తులపై గడ్కరీ నోరు పారేసుకోవటం విశేషం.

ప్రభుత్వం చేయాల్సిన పనిని న్యాయమూర్తులు చేయాలని భావిస్తే.. ముందు వారు తమ పదవులకు రాజీనామా చేసి.. ఎమ్మెల్యేలుగా గెలిచి.. మంత్రి పదవులు పొందిన అప్పుడు చేయాలంటూ ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్య్వూలో ఆయన నోరుపారేసుకున్నారు. తమ దృష్టికి వచ్చిన అంశాలపై స్పందించటం న్యాయమూర్తుల వృత్తిధర్మం. దీనికి పెడార్థాలు తీయటమే కాదు.. రాజకీయ ప్రేరిత అంశాల మీద నోరు విప్పొద్దన్నట్లుగా ఉన్న గడ్కరీ వాదనలు పెనుదుమారం రేపేఅవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News