ప్రధాని ని తిట్టేసే ఆ సీఎం ఇప్పుడు మారారు

Update: 2016-11-17 03:32 GMT
ప్రత్యర్థి రాజకీయ నేతలు ప్రధానిపై కత్తి కడుతున్న వేళ.. ఆయనకు అనుకోని సాంత్వన లభించిందని చెప్పాలి. ఆయనే మాత్రం ఊహించని రీతిలో ఒక ముఖ్యమంత్రి నుంచి వచ్చిన పాజిటివ్ కామెంట్ మోడీలో మరింత ఆత్మవిశ్వాసం పెంచుతుందనే చెప్పాలి. ఇంతకీ ఆ ముఖ్యమంత్రి ఎవరంటారా? అక్కడికే వస్తున్నాం. సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీలో మోడీ పవనాలు బలంగా వీస్తున్న వేళ.. ఆయన్ను తీవ్రంగా తప్పు పట్టి.. ప్రధాని అభ్యర్థిగా మోడీని ప్రకటించటాన్ని విభేదించిన సీనియర్ నేత బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.

మోడీ కారణంగా బీజేపీతో తనకున్న అనుబంధాన్ని తెగ తెంపులు చేసుకొని ఎన్డీయే నుంచి వెళ్లిపోయిన నితీశ్.. ఏ మాత్రం అవకాశం చిక్కినా మోడీని ఏసుకునేందుకు ఏ మాత్రం వెనుకాడరు. అలాంటి ఆయన తాజాగా పెద్దనోట్ల రద్దుపై మాత్రం భిన్నంగా స్పందించారు.

నల్లకుబేరులకు చెక్ పెట్టేందుకు తీసుకున్న పెద్దనోట్ల రద్దుపై ఆయన పాజిటివ్ గా స్పందించారు. మిగిలిన వారు ఏమనుకున్నా.. తానుమాత్రం పెద్దనోట్ల రద్దు విషయంలో మాత్రం మోడీ నిర్ణయాన్ని పూర్తిగా సమర్థిస్తానని వ్యాఖ్యానించారు. నోట్ల రద్దుతో నకిలీ నోట్ల బెడద తప్పుతుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. నోట్ల రద్దుతోనే ఆగకుండా బినామీ ఆస్తులు ఉన్న వారిపై సాధ్యమైనంత త్వరగా దాడులు ఉదృతం చేయాలని ప్రధానిని కోరారు.

బీజేపీలోని నేతలు.. విపక్ష నేతలు పెద్ద ఎత్తున మోడీ తీసుకున్న రద్దు నిర్ణయాన్ని తప్పుపడుతున్న వేళ.. అందుకు భిన్నంగా ఎన్డీయేతర పక్షానికి చెందిన ముఖ్యమంత్రి ఒకరు ప్రధానికి అండగా నిలవటం ఆసక్తికర పరిణామంగా చెప్పాలి. చాలామంది ముఖ్యమంత్రులకు భిన్నంగా నితీశ్ కు క్లీన్ ఇమేజ్ ఉండటం మోడీకి లాభిస్తుందని చెప్పకతప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News