డీఎస్ కు ఆరంభంలోనే భారీ షాక్

Update: 2015-07-05 04:03 GMT
ధర్మపురి శ్రీనివాస్. ఇలా పూర్తి పేరుకంటే..డీఎస్ పేరుతోనే రాష్ర్ట రాజకీయాల్లో ఆయన సుపరిచితుడు. శాసనమండలి ప్రతిపక్ష నేత వంటి రాజ్యాంగబద్దమైన కీలకపదవులతో పాటు పీసీసీ అధ్యక్షుడు వంటి పార్టీ ఉన్నత పదవులను సైతం డీఎస్ నిర్వహించారు. తన సత్తాతో కాంగ్రెస్ మార్క్ రాజకీయాల్లో ఆ క్రమంలో ముందుకు సాగారు. అయితే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు మొండిచేయి చూపింది. ఎమ్మెల్సీ టిక్కెట్టు కోసం డీఎస్ ఎంత ప్రయత్నించినా....ఆయనకు నో అంటూ డీఎస్ జిల్లాకే చెందిన మహిళకు అవకాశం కల్పించింది. దీంతో కినుక వహించిన డీఎస్ కొద్దిరోజులు స్తబ్దుగా ఉన్నారు.

తాజాగా తాను టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు టీఆర్ఎస్ ద్వారా ఆయనకు రాజ్యసభ సభ్యత్వం దక్కుతుందనే ప్రచారం సాగుతోంది. అయితే తానేమీ పదవి ఆశించడం లేదని డీఎస్ చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలో రాష్ర్టస్థాయిలో కాంగ్రెస్ కీలక నేతల్లో ఒకరిగా పేరున్న డీఎస్ పార్టీ మారే క్రమంలోనే భారీ షాక్ తగిలిందని సమాచారం.

డీఎస్ గులాబీ కండువా కప్పుకుంటున్నప్పటికీ ఆయన వెంట తాము నడిచేది లేదని నిజామాబాద్ జిల్లాకు చెందిన మెజార్టీ కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, భారీ నీటిపారుదల శాఖా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత(ఈమె డీఎస్ అనుచరురాలు)తో సహా ఆ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, కాంగ్రెస్ కు చెందిన పార్టీ మండలాధ్యక్షులు తాము హస్తం పార్టీలోనే కొనసాగనున్నట్లు కుండబద్దలు కొట్టారు. డీఎస్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మాజీ ఎంపీ మధు యాష్కీ సైతం తను పార్టీ మారను అన్నవిధంగా సంకేతాలు ఇచ్చారు.

దీంతో డీఎస్ చేరికతో నిజమాబాద్ లో కాంగ్రెస్ ఖాళీ, డీఎస్ వెంట పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు రానున్నారు అనే ప్రచారం వాస్తవం కాదని తేలినట్లయింది. ఈ విషయాన్ని గ్రహించిన డీఎస్ సైతం లైక్యంగా స్పందించారు. తన వెంట రావాలని ఎవ్వరినీ కోరలేదని చెప్పారు.
Tags:    

Similar News