బెంగళూరులోని కాలేజీకి షార్ట్స్ లో అమ్మాయిలు?

Update: 2016-04-08 09:46 GMT
కాలేజీకి షార్ట్స్ తో రావటమా? అన్న ప్రశ్న అక్కర్లేదు. నిజంగానే.. బెంగళూరుకు చెందిన ఒక కాలేజీలో అమ్మాయిలు షార్ట్స్ వేసుకొని సంచలనం సృష్టించారు. ఇదంతా ఏదో ఫ్యాషన్ షో కోసం కాదు.. ఒక ప్రొఫెసర్ కు నిరసన తెలిపేందుకు అమ్మాయిలు షార్ట్స్ తో కాలేజీకి వచ్చారు. దీంతో.. ఈ అంశం కలకలం రేపింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ ఇష్యూ మీద అమ్మాయిలు యుద్ధం ప్రకటించిన ప్రొఫెసర్ కూడా వెనక్కి తగ్గకపోవటమే కాదు.. తాను లేవనెత్తిన అంశం మీద ఎలాంటి దర్యాప్తుకైనా సిద్ధమేనని సవాలు విసరటంతో ఈ ఇష్యూ రోజురోజుకీ ముదురుతోంది.

ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందన్న విషయంలోకి వెళితే.. బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా వర్సిటీలో ఒక అమ్మాయి షార్ట్స్ వేసుకొని వచ్చింది. అలాంటి దుస్తులు వేసుకొని రావటం ఏమిటంటూ ఆ అమ్మాయిని ఒక ప్రొఫెసర్ ప్రశ్నించారు. సరైన దుస్తులు వేసుకొని క్లాస్ కు రావాలంటూ మిగిలిన అమ్మాయిల ముందు మందలించాడు. దీన్ని ఆ విద్యార్థిని అవమానకరంగా భావించింది. మిగిలిన అమ్మాయిలకు తన వేదనను వ్యక్తం చేసింది. తాము వేసుకునే డ్రెస్సుల మీద ప్రొఫెసర్ తమకు చెప్పటం ఏమిటన్న వాదనను తెర మీద తీసుకురావటమే కాదు.. తమ దుస్తుల గురించి సదరు ప్రొఫెసర్ అభ్యంతరకర మాటలు మాట్లాడటం ఏమిటని ప్రశ్నిస్తోంది.

తన దుస్తుల మీద వ్యాఖ్య చేసిన ప్రొఫెసర్ కు తీరుకు నిరసనగా ఆ క్లాస్ అమ్మాయిలంతా షార్ట్స్ వేసుకు రావాలని నిర్ణయించారు. అదే విధంగా షార్ట్స్ తో క్లాస్ కి హాజరయ్యారు. తమను అవమానించిన ప్రొఫెసర్ మీద చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. విద్యార్థిని వేసుకున్న దుస్తుల మీద తాను అన్న మాటలపై  సదరు ఫ్రొఫెసర్ నిలబడి ఉండటమే కాదు.. ఈ విషయంలో ఎలాంటి దర్యాఫ్తుకైనా తాను సిద్ధమని తేల్చి చెబుతున్నారు. ప్రొఫెసర్ కు.. కాలేజీ విద్యార్థినులకు జరుగుతున్న మాటల యుద్ధం ఎక్కడి వరకూ వెళుతుందో..?
Tags:    

Similar News