అమ్మ ఒడీ వ‌ద్దు.. బ‌డుల విలీనం వ‌ద్దు: జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పేరెంట్స్ నిప్పులు!

Update: 2022-07-08 07:24 GMT
వేస‌వి సెల‌వుల అనంత‌రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జూలై 5 నుంచి పాఠ‌శాల‌లు తిరిగి పున‌: ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. అయితే జ‌గ‌న్ ప్ర‌భుత్వం నూత‌న జాతీయ విద్య విధానం ప్ర‌కారం అంటూ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను విలీనం చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో కొన్ని చోట్ల పాఠ‌శాల‌లు విద్యార్థుల‌కు చాలా దూరంగా మారాయి. ముఖ్యంగా అమ్మాయిలు అంత‌దూరం వెళ్ల‌లేక బ‌డి మానేస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను విలీనం చేయ‌డంపై విద్యార్థుల త‌ల్లిదండ్రుల్లోనూ ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది.

త‌మ‌కు అమ్మ ఒడీ వ‌ద్దు.. అలాగే పాఠ‌శాల‌ల విలీనమూ వ‌ద్ద‌ని త‌ల్లిదండ్రులు డిమాండ్ చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. ద‌య చేసి ప్రాథ‌మిక పాఠ‌శాల‌ల‌ను తీసేయ‌కండి అంటూ త‌ల్లిదండ్రులు ప్ర‌భుత్వాన్ని వేడుకుంటున్నారు. మ‌రికొంత‌మంది అస‌లు ఈ ప్ర‌భుత్వ‌మే త‌మ‌కొద్దు అంటూ జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ మేర‌కు టీడీపీ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ప‌లు వీడియోల‌ను పోస్టు చేసింది. ఈ వీడియోల్లో విద్యార్థుల త‌ల్లిదండ్రులు జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై నిప్పులు చెర‌గ‌డం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

ఇప్ప‌టికే ఉన్న ప్ర‌భుత్వ ప్రాథ‌మిక పాఠ‌శాల‌ల‌ను తీసేసి ఎక్క‌డో దూరంగా ఉన్న ఉన్న‌త పాఠ‌శాల‌ల్లో విలీనం చేస్తే.. అంత‌దూరం చిన్న‌పిల్ల‌లు వెలా వెళ‌తారు? మా పిల్ల‌ల్ని ఎవ‌రైనా అప‌హ‌రిస్తే ఎవ‌రు బాధ్య‌త వ‌హిస్తారంటూ శ్రీ‌కాకుళం జిల్లా ప‌లాస ఉద‌య‌పురంలోని ప్రాథ‌మిక పాఠ‌శాల విద్యార్థుల త‌ల్లిదండ్రులు జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎక్క‌డో దూరంగా ఉన్న పాఠ‌శాల‌ల‌కు అంత‌దూరం చిన్న‌పిల్ల‌లు వెళితే దారిలో వారినెవ‌రైనా కిడ్నాప్ చేస్తే, ఏదైనా ప్ర‌మాదం జ‌రిగితే ముఖ్య‌మంత్రి బాధ్య‌త వ‌హిస్తారా? అంటూ నిల‌దీయ‌డం గ‌మ‌నార్హం.

శ్రీకాకుళం జిల్లా ఉద‌య‌పురంలోని ఓ దేవాల‌యంలో పూజారిగా ప‌నిచేస్తున్న ఓ వ్య‌క్తి చిన్న పిల్ల‌ల‌ను వీడియోలో చూపిస్తూ.. వీళ్ల‌కు ఏమైనా లోక‌జ్ఞానం తెలుస్తుందా? ఎవ‌రిని అడిగి పాఠ‌శాల‌ల‌ను విలీనం చేస్తున్నారు? వీరికి ఏమైనా జ‌రిగితే బాధ్య‌త ఎవ‌రు వ‌హిస్తారంటూ జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. పాఠ‌శాల‌ల‌ను మార్చొద్దంటూ త‌ల్లిదండ్రులు చేసే పోరాటానికి ఉపాధ్యాయులంతా సంఘీభావం నిల‌వాల‌ని ఆయ‌న కోరారు.

ఈ సంద‌ర్భంగా త‌ల్లిదండ్రులంతా చేతులెత్తి మొక్కుతూ ప్రాథ‌మిక పాఠ‌శాల‌ల‌ను తీసేయొద్ద‌ని వేడుకున్నారు. మీ ప్ర‌భుత్వానికి శ‌త‌కోటి దండాలు.. మా పాఠ‌శాల‌లు మార్చొద్దు.. మ‌మ్మ‌ల్ని హింస‌పెట్టే ప్ర‌భుత్వం మాకొద్దు అంటూ నిప్పులు చెరిగారు. అమ్మ ఒడీ మాకొద్దు.. చేయూత మాకొద్దు.. పాఠ‌శాల‌ల విలీనం మాకొద్ద‌ని అన్నారు.

అలాగే పాడేరు మండ‌లం స‌లుగు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో త‌మ‌కు పాఠాలు చెప్ప‌డానికి ఎవ‌రూ లేర‌ని.. త‌మ‌కు ఉపాధ్యాయుల‌ను పంపాల‌ని చిన్నారులు ప్ర‌భుత్వాన్ని వేడుకుంటున్న వీడియోను కూడా నారా లోకేష్ విడుద‌ల చేశారు.




Full ViewFull View
Tags:    

Similar News