నో అస్యూరెన్స్ : రైల్వే జోన్ ఉన్న‌ట్టా ? లేన‌ట్టా ?

Update: 2022-07-27 05:09 GMT
విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి ఎప్ప‌టి నుంచో ఉన్న ప్ర‌తిపాద‌న‌లు ఇప్ప‌టికీ ప‌ట్టాలెక్క‌డం లేదు. తాజాగా వ‌స్తున్న స‌మాచారం ప్ర‌కారం దీనిపై ఇంకొంత స‌మ‌యం కాల‌యాప‌న చేసే అవ‌కాశాలే పుష్క‌లంగా ఉన్నాయి. అస‌లు రైల్వే జోన్ రాద‌ని కూడా తెలుస్తోంది. జోన్ ఇచ్చిన హామీని మోడీ స‌ర్కారు అమ‌లు చేసేందుకు ఎందుక‌నో ఆస‌క్తి చూప‌డం లేదు అన్న‌ది వాస్త‌వం. ఇందుకు త‌గ్గ విధంగానే ప‌రిణామాలు కూడా ఉన్నాయి.

 జోన్ ఏర్పాటుకు సుముఖంగానే ఉన్నామ‌ని గ‌తంలోనూ, ఇప్పుడూ చిల‌క‌ప‌లుకులు ప‌లుకుతున్న కేంద్రం దీనిపై దాట‌వేత ధోర‌ణినే అవ‌లంబిస్తోంది. ఆ విధంగా ఆంధ్రుల‌కు అన్యాయ‌మే చేస్తోంది.

స‌భాముఖంగా ఇచ్చిన హామీని ప‌క్క‌న పెట్టాల‌ని కేంద్రం భావిస్తోంది. దీనిపై అస్యూరెన్స్ క‌మిటీకి కూడా ఇదే విధంగా చెప్పాల‌ని చూసింది కానీ కేంద్రం చెప్పిన మాట‌ల‌ను అస్యూరెన్స్ క‌మిటీ తోసి పుచ్చింద‌ని ప్ర‌ధాన మీడియా వార్త‌లు ధ్రువీక‌రిస్తున్నాయి.

ఆ రోజు పార్ల‌మెంట్ లో చెప్పిన ప్ర‌కారం ద‌క్షిణ కోస్తా రైల్వే జోన్, రాయ‌గ‌డ డివిజ‌న్ ఏర్పాటుకు సంబంధించిన ప్ర‌క‌ట‌న ఇప్ప‌టికిప్పుడు అమల్లోకి రానే రాద‌ని కూడా తేలిపోయింది. ఇందుకు సంబంధించి డిపార్ట్మెంట‌ల్ ఇష్యూస్ కూడా తోడ‌యి ఉన్నాయ‌ని కేంద్రం అంటోంది. ముఖ్యంగా జోన్ ఏర్పాటుకు కానీ డివిజ‌న్ ఏర్పాటుకు కానీ సంబంధిత డీపీఆర్ ఎప్పుడో రైల్వే అధికారులు కేంద్రానికి పంపారు.

వీటిని అధ్య‌య‌నం చేసిన కేంద్రం సాధ్యాసాధ్యాలు సైతం ప‌రిశీలించింది కానీ జోన్ ప్ర‌క్రియ అన్న‌ది సిబ్బంది బ‌దిలీల‌తో పాటు మ‌రికొన్ని అంత‌ర్గ‌త స‌ర్దుబాట్ల‌పై ఆధార‌ప‌డి ఉంది.

మ‌రో ఆరేళ్లు లేదా మ‌రో ప‌దేళ్లు అయినా జోన్ ఏర్పాటుకు స‌మ‌యం ప‌ట్టినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌సరం లేదు అన్న‌ది ఓ ప్ర‌ధాన మీడియా క‌థ‌నం ఆధారంగా తెలుస్తోంది. గ‌తంలో జోన్ల పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ‌కు సంబంధించి ఇచ్చిన ప్ర‌క‌ట‌న‌కు త‌రువాత అమ‌లుకు మ‌ధ్య ఆరేళ్ల కాలం ఉంద‌ని, అదేవిధంగా ఇప్పుడు కూడా అంతే స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని  నిర్థార‌ణ అవుతోంది.
Tags:    

Similar News