‘గ్రేటర్ రాయలసీమ’ ఉద్యమం పట్టాలెక్కుతుందా ?

Update: 2020-12-11 13:15 GMT
అంతన్నాడింతన్నాడే ముంతరాజు’’ అనే పాటలాగ తయారైంది గ్రేటర్ రాయలసీమ ఉద్యమకారుల వ్యవహారం. జగన్మోహన్ రెడ్డి మూడురాజధానుల ప్రతిపాదన తీసుకురాగానే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం అని కాదు కాదు గ్రేటర్ రాయలసీమ ఉద్యమం అంటు అప్పట్లో కొందరు మేథావులు పెద్ద పెద్ద ప్రకటనలే చేశారు. ఆ తర్వాత ఏమైందో ఎవరికీ తెలీదు కానీ ఇపుడా ఉద్యమం గురించి అనుకునేవాళ్ళే లేకుండాపోయారు.

తెలంగాణా ఉద్యమస్పూర్తితో తాము కూడా గ్రేటర్ రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు డిమాండ్ తో ముందుకెళతామంటూ అప్పట్లో కొందరు రాయలసీమ నేతలు చెప్పుకున్నారు. వాళ్ళ ప్రకటన చూసిన కొందరు నిజమేనేమో అనుకున్నారు. కర్నూలు నుండి మాజీ ఎంపి గంగుల ప్రతాపరెడ్డి, కడప జిల్లాలో మాజీ మంత్రి మైసూరారెడ్డి, నెల్లూరు జిల్లా నుండి మాజీ డీజీపీ దినేష్ రెడ్డి తదితరులు అప్పట్లో భారీ ప్రకటనలే ఇచ్చారు. కానీ తర్వాత ఏమైందో ఏమో ఎవరు చప్పుడు చేయటం లేదు.

ముందుగా రాయలసీమలోని నాలుగు జిల్లాలు కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకోసం ఉద్యమం చేయాలని అనుకున్నారు. అయితే ఉద్యమ ఏరియా మరీ చిన్నదైపోతుందేమో అని వాళ్ళకే అనిపించింది. అందుకనే కోస్తా జిల్లాలైన నెల్లూరు, ప్రకాశంను కూడా కలుపుకుని గ్రేటర్ రాయలసీమ అన్నారు. ప్రకటించటం వరకు బ్రహ్మాండంగానే ఉంది కానీ తర్వాత ప్రకటించిన వాళ్ళు తర్వాత ఏమైపోయారో ఎవరికీ అర్ధం కావటం లేదు.

చూస్తుంటే ఉద్యమం పేరుతో ప్రచారం అయిన వాళ్ళల్లో రాజకీయ నిరుద్యోగులే ఉన్నారన్న ఆరోపణలు పెరిగిపోయాయి. నిజానికి గంగులైనా, మైసూరా అయినా రాజకీయ నిరుద్యోగులే. దినేష్ రెడ్డి రిటైర్డ్ బ్యూరోక్రాటే కానీ రాజకీయ నేతేమీ కాదు. పైగా గ్రేటర్ ఉద్యమంలో ప్రచారం అయిన నేతల్లో యాక్టివ్ నేత ఒక్కళ్ళు కూడా లేరు. దాంతో జనాల ఆధరణ ఉండదన్న అనుమానంతోనే ఉద్యమాన్ని విరమించుకున్నారేమో తెలీటం లేదు. ఆమధ్య కర్నూలుకే చెందిన బైరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా రాయలసీమ ఉద్యమం అని హడావుడి చేసినా ఎవరు పట్టించుకోలేదు. అదే అనుభవం తమకు కూడా ఎదురవుతుందన్న అనుమానంతోనే ఉద్యమకారులు ఎవరు చప్పుడు చేయటం లేదా ? అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి.
Tags:    

Similar News