మ‌ళ్లీ..ఏటీఎంల‌లో నో క్యాష్ బోర్డులు!

Update: 2018-01-12 04:19 GMT
ఏ ముహుర్తంలో పెద్ద‌నోట్ల ర‌ద్దు ప్ర‌క‌ట‌న వెలువ‌డిందో.. ఆ రోజు నుంచి ఏటీఎం క‌ష్టాలు దేశ ప్ర‌జ‌ల‌కు మొద‌ల‌య్యాయి. ఇప్ప‌టికే ఉన్న బాధ‌లు స‌రిపోన‌ట్లు కొత్త క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. డిజిట‌ల్ మ‌నీకి ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్న కేంద్ర స‌ర్కారు తీరుతో.. న‌గ‌దు ల‌భ్య‌త అంత‌కంత‌కూ త‌గ్గుతోంది.

గ‌డిచిన నాలుగైదు రోజులుగా చూస్తే.. హైద‌రాబాద్ స‌హా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఏటీఎంల‌లో నో క్యాష్ బోర్డులు అంత‌కంత‌కూ పెరిగిపోతున్నాయి. మిగిలిన రోజుల‌తో పోలిస్తే.. సంక్రాంతి పండ‌గ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు ఖ‌ర్చు పెట్టేది కాస్త ఎక్కువ‌గా ఉంటుంది. సంక్రాంతి సంద‌ర్భంగా ఎక్కువ‌మంది సొంతూళ్ల‌కు వెళ్లి రావ‌టం కనిపిస్తుంది.

దీంతో.. ఎవ‌రికి వారు ఏటీఎంల‌ను ఆశ్ర‌యిస్తున్న పరిస్థితి. ఇదిలా ఉంటే.. ఏటీఎంల‌లో నో క్యాష్.. ఏటీఎం అవుటాఫ్ స‌ర్వీస్ అన్న బోర్డులు ఇప్పుడు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. కొన్నిచోట్ల అయితే.. ఏకంగా ఏటీఎం షెట్ట‌ర్లు మూసేస్తున్న ప‌రిస్థితి.

ఏటీఎంల‌లో క్యాష్ ల‌భ్య‌త అంత‌కంత‌కూ త‌గ్గిపోతున్న వేళ‌.. బ్యాంకుల్లో విత్ డ్రాయిల్స్ పెరుగుతున్నాయి. విత్ డ్రా చేసుకునేందుకు బ్యాంకుల‌కు వెళుతున్న వారికి భారీ క్యూలు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. మ‌రో రోజు వ్య‌వ‌ధిలో వ‌రుస‌గా మూడు రోజులు బ్యాంకులు ప‌ని చేయ‌ని ప‌రిస్థితి. దీంతో.. ఏటీఎం క‌ష్టాలు మ‌రింత పెర‌గ‌టం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది.

పెద్ద నోట్ల ర‌ద్దు సంద‌ర్భంగా.. పాత నోట్ల‌ను బ్యాంకులు తీసుకునే వేళ‌లో ఎలా అయితే ఆంక్ష‌లు విధించారో.. ఇప్పుడు అప్ర‌క‌టితంగా ఆంక్ష‌లు విధిస్తున్న వైనం అంత‌కంత‌కూ పెరుగుతోంది. ఏటీఎంలు మూసి ఉండ‌టంతో.. డ‌బ్బు అవ‌స‌రం ఉన్న వారు బ్యాంకుల వ‌ద్ద బారులు తీరుతున్నాయి. అయితే.. పెద్ద మొత్తాల్ని చాలా బ్యాంకులు ఇవ్వటం లేదు. ఎందుకిలా అంటే.. న‌గ‌దు ల‌భ్య‌త త‌క్కువ‌గా ఉంద‌న్న మాట‌ను లోగుట్టుగా చెబుతున్నారు.

ల‌క్ష రూపాయిలు అవ‌స‌రం ఉన్న వారు బ్యాంకు వెళ్లి.. త‌మ ఖాతాలోని డ‌బ్బుగురించి అడిగితే.. న‌గ‌దు ల‌భ్య‌త లేద‌ని.. రూ.10వేలు మాత్ర‌మే ఇస్తాన‌ని చెబుతున్నారు. బ్యాంకుల‌తో మంచి సంబంధాలు ఉన్న వారికి మాత్రం కొంత మేర న‌గ‌దు ల‌భిస్తోన్న ప‌రిస్థితి. ఇలాంటి వారు చాలా త‌క్కువ మంది ఉన్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇక‌.. మ‌హిళా సంఘాల వారు.. పింఛ‌న్ల కోసం వ‌చ్చే వారితో పాటు న‌గ‌దు ల‌భ్య‌త లేని కార‌ణంగా బ్యాంకుల‌కు వ‌స్తున్న‌ ఖాతాదారుల కార‌ణంగా బ్యాంక్ సిబ్బంది మీద భారీగా భారం ప‌డుతోంది. హైద‌రాబాద్ న‌గ‌రంలో చాలా బ్యాంకుల ఏటీఎంలు డ‌బ్బు లేక‌.. నో క్యాష్ బోర్డులు పెట్టేస్తున్నారు. హైద‌రాబాద్ తో స‌హా.. ప‌ట్ట‌ణాలు.. గ్రామీణ ప్రాంతాల్లోని ఏటీఎంల‌లో న‌గ‌దు కొర‌త‌ను ఎదుర్కొంటున్నాయి. దీంతో.. ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందుల‌కు గురి అవుతున్నారు.

ఉన్న‌ట్లుండి మ‌ళ్లీ న‌గ‌దు కొర‌త ఎందుకు వ‌చ్చింది? ఏటీఎంల‌లో  నో క్యాష్ బోర్డులు పెట్ట‌టానికి కార‌ణం.. బ్యాంకుల‌కు స‌రిప‌డా న‌గ‌దును విడుద‌ల చేసే విష‌యంలో ఆర్ బీఐ ఆచితూచి వ్య‌వ‌హ‌రించ‌ట‌మే కార‌ణంగా చెబుతున్నారు. రిజ‌ర్వ్ బ్యాంక్ నుంచి సాధార‌ణ బ్యాంకుల‌కు పంపే న‌గ‌దు త‌క్కువ‌గా ఉండ‌టంతో తీవ్ర‌మైన న‌గ‌దు కొర‌త‌ను రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప‌లు ప్రాంతాల్లో చోటు చేసుకుంది. ఇదే అద‌నుగా.. క్రెడిట్‌.. డెబిట్ కార్డుల‌తో చెల్లింపులు చేయాలంటే.. కార్డును స్వైప్ చేస్తే.. 2 శాతం ఖ‌ర్చుల కింద క‌ట్ చేసుకుంటామ‌ని వ్యాపార వ‌ర్గాలు చెబుతుండ‌టంతో.. ప్ర‌జ‌లు ఇబ్బందుల‌కు గురి అవుతున్నారు. ఏటీఎంల‌లో న‌గ‌దుకొర‌త సామాన్యుడికి షాకింగ్ గా మార‌ట‌మే కాదు.. కొత్త ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. శుభ‌మా అని పండ‌క్కి ఎక్క‌డికి వెళుతున్నా.. జేబుల్లో కార్డులు పెట్టుకొని వెళ్లే క‌న్నా.. క్యాష్ వెంట తీసుకెళ్ల‌టం త‌ప్ప‌నిస‌రి అన్న విష‌యాన్ని మ‌ర్చిపోవ‌ద్దు.
Tags:    

Similar News