ఓహో.. గులాబీ 'బాలా' .. కోహ్లి సెంచరీ కల తీరేదెలా? విరాట్ 23 ఔట్

Update: 2022-03-12 16:32 GMT
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి సెంచరీ కల మళ్లీ దూరమైంది. రెండు సంవత్సరాల మూడు నెలలుగా అందని ద్రాక్షలా ఊరిస్తున్న మూడంకెల స్కోరు మరోసారి చేజారింది. శ్రీలంకతో బెంగళూరులో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో కోహ్లి 23 పరుగులకే ఔటయ్యాడు. 48  బంతులాడి రెండు ఫోర్లతో 23 పరుగులు చేసిన విరాట్.. స్పిన్ ఆల్ రౌండర్ ధనంజయ డిసిల్వా బౌలింగ్ లో వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో అతడు ఈ టెస్టులోనైనా సెంచరీ చేస్తాడన్న అభిమానుల ఆశ నెరవేరలేదు.

అయితే, టీమిండియా రెండో ఇన్నింగ్స్ ఆడితే కోహ్లికి సెంచరీ చేసే అవకాశం ఉంటుంది. కానీ, పరిస్థితి అంతదాకా వస్తుందా? టీమిండియాకు లంక రెండో ఇన్నింగ్స్ ఆడేంత పోటీ ఇవ్వగలదా? అసలే గులాబీ బంతి.. ఆపై బుమ్రా, షమీ పేస్ బౌలింగ్.. దీనికిమించి స్పిన్నర్లు జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్. వీరిని ఎదుర్కొంటూ కనీసం టీమిండియా చేసిన తొలి ఇన్నింగ్స్ స్కోరును లంక రెండు ఇన్నింగ్స్ లో కలిపి చేసినా గొప్పే.

గులాబీ.. మళ్లీ అనుకుంటే

వాస్తవానికి కోహ్లి చివరిసారిగా సెంచరీ చేసినది 2019 నవంబరులో. కోల్ కతాలో బంగ్లాదేశ్ పై జరిగిన టెస్టులో కెప్టెన్ హోదాలో కోహ్లి శతకం బాదాడు. అప్పటినుంచి అతడి నుంచి మళ్లీ మూడంకెల స్కోరుకు చకోర పక్షిలా అభిమానులు ఎదురుచూస్తున్నారు. వాస్తవం ఇలా ఉంటే.. కోహ్లి చివరి సెంచరీ గులాబీ బంతి టెస్టులోనే.

 ఆ మ్యాచ్ లో కోహ్లి తప్ప అంతా విఫలమయ్యారు. కానీ విరాట్ నిలకడగా ఆడి సెంచరీ కొట్టాడు. అయితే, నాటి నుంచి మరే ఇన్నింగ్స్ లోనూ సెంచరీ కాదు కదా? కనీసం 80,90 ల్లోకి కూడా రాలేకపోతున్నాడు. దీంతో అతడి ఫామ్ తగ్గిందా? అనే అనుమానం వస్తోంది. కెప్టెన్సీ భారం లేదు.. గులాబీ బంతి అయినా.. నాటితో పోలిస్తే కోహ్లి ఇప్పుడు ఏ ఫార్మాట్ లోనూ కెప్టెన్ గా లేడు.

నాడు మూడు ఫార్మాట్ల లోనూ కెప్టెన్ గా ఉంటూ సెంచరీల మీద సెంచరీలు కొట్టిన కోహ్లినేనా? ఇతడు అని అనుమానించేలా ప్రస్తుతం అతడి స్కోర్లు ఉన్నాయి. లంకతో జరుగుతున్న రెండో టెస్టులో శనివారం కోహ్లి పదో ఓవర్లోపే క్రీజులోకి వచ్చాడు. నిలదొక్కుకున్నట్లే కనిపించాడు. కానీ, దానిని నిలుపుకోలేకపోయాడు.

చివరకు అంతగా ప్రతిభావంతుడు కానీ స్పిన్నర్ ధనంజయ డిసిల్వా బౌలింగ్ లో ఎల్బీ అయ్యాడు. వాస్తవానికి కోహ్లి ఇటీవల సాధారణ బౌలర్ కూ వికెటిస్తున్నాడు. అతడు ఆడిన కొన్ని ఇన్నింగ్స్ గమనిస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది. తాజాగా కోహ్లి ఈ సిరీస్ లో రెండోసారి కూడా స్పిన్నర్ కే వికెటిచ్చాడు.

ఏమైంది అతడికి?

కోహ్లి నుంచి సెంచరీ లేక రెండేళ్లు దాటిందంటే ఇది ఆలోచించాల్సిన విషయమే. విరాట్ స్థాయి ఆటగాడు పరుగుల కోసం 2011 సంవత్సరం తర్వాత ఇంతగా గతంలో ఎన్నడూ వెదుక్కోలేదు. అయితే, ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమంటే అతడి ఆలోచనా ధోరణి ఎలా ఉందన్నదే.

 మూడు ఫార్మాట్ల కెప్టెన్ గా దుమ్ము రేపిన విరాట్.. రెండు నెలలుగా ఎందులోనూ సారథ్యం మోయడం లేదు. కానీ,  ఆ బరువు ఇంకా కొనసాగిస్తున్న ఆటగాడిలా ఔట్ అవుతుండడం విచారకరం. అన్నిటికి మించి ఓ దశలో కోహ్లి వికెట్ తీయాలంటే ‘‘అది అత్యంత అత్యుత్తమ బంతి అయి ఉండాలి’’ అని అనిపించేది. కానీ, మధ్య స్థాయి, చాలా సాధారణ బంతికి కూడా అతడు ఇటీవల వికెట్ ఇచ్చేస్తున్నాడు.

ఇది అందరూ గమనించాల్సిన విషయం. ఇలాగైతే.. పుజారా, రహానే దారిలోనే..? ప్రస్తుతం టీమిండియా పునర్నిర్మాణ దశలో ఉంది. టెస్టు జట్టులో నుంచి ఇటీవలే మేటి బ్యాట్స్ మన్ అయిన చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే చోటు కోల్పోయారు. వీరిద్దరూ ఇలా వేటుకు గురవుతారని ఏడాది కిందటి వరకు ఎవరూ ఊహించలేదు. కానీ, జరిగింది.

వారి వైఫల్యాలు అంతలా ఉన్నాయి మరి. ఇప్పుడు మిగిలింది కోహ్లినే. రోహిత్ కెప్టెన్ కాబట్టి అతడికి ఢోకా లేదు. రోహిత్ ఫామ్ కూడా బాగుంది. కానీ, విరాట్ పైనే అందరి చూపూ నెలకొంది. ఏ ఫార్మాట్ లోనూ మెప్పించలేకపోతున్న అతడు టెస్టుల్లో మరీ నిరాశాజనకంగా ఉన్నాడు.

పరిస్థితి ఇలాగే కొనసాగితే కోహ్లిపై వేటుపడినా ఆశ్చర్యం లేదు.  అయితే.. వేటు వేసినా దానికి ‘‘విశ్రాంతి’’ అని పేరు పెట్టి తప్పిస్తారు. అసలే బీసీసీఐ లో ఉన్నది సౌరభ్ గంగూలీ. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్.
Tags:    

Similar News