ఇప్పట్లో దత్తన్న గవర్నర్ కాలేరా.. ?

Update: 2017-09-02 14:49 GMT
నిన్నటి వరకు తెలుగు రాష్ట్రాలకు పెద్ద దిక్కు వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి కాగానే... ఆ ప్లేస్ ఇకపై తనదే అనుకున్నారు మాజీ కేంద్ర మంత్రి దత్తన్న. మొత్తం తెలుగు మీడియా అంతా ఇక తన చుట్టూనే తిరుగుతుందని కలలు కన్నారు. కానీ తానొకటి తలిస్తే.. మోదీ, షా మరొకటి తలిచారు. దాంతో మీడియా వెంటపడటం మాట దేవుడెరుగు... మొదటికే మోసం వచ్చి మంత్రి పదవి ఊడిపోయింది. గవర్నర్ గిరీ ఇస్తామని అమిత్ షా హామీ ఇచ్చినా  అది ఇప్పట్లో నెరవేరుతుందా అన్నది డౌటే.  
    
దత్తన్న ఎంపీగా గెల్చింది సికింద్రాబాద్ లోక్ సభ నియోకవర్గం నుంచి. దత్తన్న ముమ్మాటీకీ జనం నుంచి పుట్టిన నేతే. కానీ 2014లో మాత్రం గెల్చింది మోదీ మానియాతోనే అన్న విషయంలో ఎవ్వరికీ సందేహాలుండవు. ఇప్పుడున్న పరిస్థితిలో దత్తన్నను గవర్నర్ గా పంపిస్తే.. సికింద్రాబాద్ సీటు ఖాళీ అవుతుంది. అంటే దత్తన్న రాజీనామా చేసిన ఆరు నెలల్లోగా అక్కడ ఎన్నిక నిర్వహించాలి.  ఇప్పటికిప్పుడు మంత్రిపదవుల పంపకం తర్వాత దత్తన్నను ఏ రాష్ట్రానికో గవర్నర్ గా పంపిస్తే ఖచ్చితంగా 2018 మొదట్లో సికింద్రాబాద్ లోక్ సభకు ఎన్నికలు జరపాల్సిందే. అప్పటికి సాధారణ ఎన్నికలకు అటూ ఇటూగా ఏడాది మాత్రమే సమయం ఉంటుంది.
    
ఇక ... 2014 ఎన్నికలతో పోల్చితే జంటనగరాల్లో టీఆర్ ఎస్ తిరుగులేని పట్టు సంపాదించింది. ఏడాదిన్నర క్రితం జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలే అందుకు నిదర్శనం.  పోనీ హైదరాబాద్ లో బీజేపీ ఏమైనా బలంగా ఉందా అంటే అదీ లేదు. అమిత్ షా వచ్చిన తర్వాత కూడా తెలంగాణ బీజేపీ నేతల్లో అడ్డు తెరలు అలాగే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో దత్తన్నను గవర్నర్ గా పంపి.. కొత్తగా ఎన్నికలు పెట్టుకొని కొత్త సమస్యలు తెచ్చుకునేందుకు బీజేపీ అధిష్టానం సిద్ధంగా ఉంటుందా..?  దత్తన్నకు గవర్నర్ గిరి ఇస్తామని మాట వరకుసకు చెప్పారే తప్ప.. ఇప్పట్లో అందలం ఎక్కిస్తారన్న నమ్మకాలైతే మాత్రం నిల్ అన్న మాటే. ఉంటే గింటే 2019 ఎన్నికల్లో కూడా బీజేపీ గెలిస్తే అప్పుడు ఇస్తే ఇవ్వచ్చు.
Tags:    

Similar News