10 వేల నుంచి 2 లక్షలకు...

Update: 2022-01-12 14:30 GMT
సరిగా వారం రోజుల కిందట దేశంలో కరోనా బాధితుల సంఖ్య 10వేలకు అటూఇటూగా ఉండేది. ప్రస్తుతం అది 2లక్షలకు చేరింది. ఈ గణాంకాలు చాలు. మహమ్మారి మరోసారి ఏస్థాయిలో విరుచుకుపడిందో  స్పష్టమవుతోంది. హమ్మయ్య..వ్యాక్సిన్ వచ్చేసింది,  గట్టెక్కామనుకున్న ప్రపంచ మానవాళికి కరోనా మూడో అల రూపంలో మరో సవాల్ విసిరింది. ఒమిక్రాన్ రూపంలో  ఆపదగా పరిణమించింది.

ఒకేరోజు 2 లక్షల మందికి..
దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే 1.96 లక్షల మంది వైరస్ బారినపడ్డారు. దీంతో గత రెండేళ్లతో కలిపితే  మొత్తం కేసుల సంఖ్య 3.58కోట్లకు చేరింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 9.56 లక్షలమంది ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్నారు. ఈనెల 11 నాటికి సగటు పాజిటివిటీ రేటు 10. 54శాతం కాగా..బుధవారం వాటి తీవ్రత 11.05 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటిలో జన్యు విశ్లేషణలో 4,461 ఒమిక్రాన్ కేసులని స్పష్టం చేసింది. కొత్త వేరియంట్ బాధితులు అత్యధికంగా మహారాష్ట్రలో 1,247, రాజస్థాన్ లో 645 మంది , ఢిల్లీలో 546 మంది ఉన్నారని మంత్రిత్వశాఖ వివరించింది.డిసెంబరు 30న 1.1శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు ప్రస్తుతం పదింతలు పెరగడం చూస్తే కేవలం 12రోజుల్లో మూడో అల తీవ్రత  ఏమేర ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో ఢిల్లీలోని ఆప్ సర్కారు ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. ఇప్పటికే రెస్టారెంట్లు, బార్లపై నిషేధం విధించగా,తాజాగా ప్రైవేటు కార్యాలయాలనూ మూసేయాలంటూ ఆదేశించింది. అటు ఉత్తరాఖండ్ లో నదీ తీరాల్లో పుణ్యస్నానాలను నిషేధించింది. ఒడిశా సర్కారు కూడా అదే బాట పట్టింది.

మరణాల  రేటు తక్కువే.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసు మొట్టమొదటిసారి దక్షిణాఫ్రికాలో 2021 నవంబరు 24న నమోదైంది.  మనదేశంలో తొలికేసు డిసెంబరు 2న కర్ణాటక రాష్ట్రంలో నమోదైంది. అప్పటినుంచి ఇప్పటిదాకా పరిశీలిస్తే...42 రోజుల వ్యవధిలో ఈ సంఖ్య 4,461కు చేరింది. ఈ వ్యవధిలో సుమారు వందరెట్ల వ్యాప్తి జరిగినట్లు స్పష్టమవుతోంది. ఈ అల తాకిడి ఈ నెలాఖరునాటికి వెయ్యిశాతానికి చేరే ప్రమాదమూ లేకపోదనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి.  అయితే ఒమిక్రాన్ ఒత్తిడి ఎలా ఉన్నా మరణరేటు స్వల్పంకావడం పెద్దఊరటే. మూడో వేవ్ నేపథ్యంలో ఇప్పటిదాకా 277 మంది మృతి చెందారు.  ఈ వేరియంట్ గొంతు బాగంలో  తిష్టవేయమే దీనిక్కారణం. గొంతు నుంచి ఊపిరితిత్తుల్లో వ్యాధికారకం చేరనందున ప్రాణాలకు పెద్దముప్పు లేదని వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు.  

రెండు డోసులు వేసుకున్నా...
రెండు డోసులు వేసుకున్నాం. ఏ కరోనా మా దరిచేరదనుకున్న వారంతా ప్రస్తుత పరిస్థితిని చూసి ఆందోళనకు లోనవుతున్నారు. ఇప్పటికే రెండు డోసులు వేసుకున్న వారు సైతం కరోనా బారిన పడుతుండటంతో చిగురుటాకులా వణికిపోతున్నారు. తాజాగా భారతరత్న, గానకోకిల  లతామంగేష్కర్ రెండు రోజుల కిందట వైరస్ బారినపడ్డారు. ప్రముఖ నటుడు మహేశ్ బాబు, నటి కీర్తి సురేష్, రేణూదేశాయ్, ఆమె తనయుడు అకీరా ,ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖమంత్రి కొడాలి నాని..ఇలా చెప్పుకొంటూ పోతే పలువురు ప్రముఖులకు పాజిటివ్ నిర్ధారణైంది. వీరంతా ఇప్పటికే రెండు డోసుల టీకా వేసుకున్నవారే. అయినప్పటికీ వైరస్ సోకడం చర్చనీయాంశంగా మారింది.
Tags:    

Similar News