విజయవాడ మెట్రోకు డబ్బుల్లేవు!

Update: 2016-03-24 06:34 GMT
 విజయవాడ మెట్రో రైలు అనుకున్న సమయానికి పట్టాలెక్కేట్టు కనిపించడం లేదు. 2018 నాటికి మెట్రో రైలును పట్టాలపై పరుగులు తీయించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరాటపడుతున్నారు. ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతోపాటు ఇతరత్రా కారణాల వలన ఈ ప్రాజెక్ట్ 2020 నాటికి కూడా పూర్తయ్యే సూచనలు కనిపించడం లేదు.

ఈ ప్రాజెక్టుకు  సంబంధించి ప్రాథమిక పనులు ఇప్పటికే ప్రారంభం కావల్సి ఉంది. అయితే అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ (ఎఎంఆర్‌ సి)కు ప్రభుత్వం కనీస నిధులు కూడా కేటాయించకపోవడంతో కార్పొరేషన్ అధికారులు ఆందోళన చెందుతున్నారు.
   
కనీసం వచ్చే నెలలోనైనా పనులు మొదలు పెట్టాలంటే, ఇప్పటికిప్పుడు సుమారు 300 కోట్ల రూపాయలైనా కేటాయించాలని ఎఎంఆర్‌సి అధికారులు కోరుతున్నారు. మెట్రో రైలు సంబంధించి భూసేకరణ జరగాలి. ఆ తరువాత టెండర్లను ఆహ్వానించాల్సి ఉంది. వీటన్నిటికీ కనీస నిధులైనా ప్రభుత్వం విడుదల చేయాలి. అది జరగకపోవడంతో మెట్రో పనులు మరింత జాప్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సుమారు 6000 కోట్ల రూపాయలతో విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్‌ కు సంబంధించి ఇప్పటి వరకూ ప్రణాళికలు తయారయ్యాయి కానీ, నిధులు మంజూరు కాలేదు. మొత్తం ఖర్చులో 25 శాతం కేంద్రం, 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని జైకా రుణ రూపంలో ఇస్తుంది. ఈ ప్రాజెక్ట్‌ ను 2018 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కానీ పరిస్థితులు ఇందుకు అనుకూలంగా లేవు.
   
మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశలో భాగంగా రెండవ కారిడార్‌ కు టెండర్లు పిలవాల్సి ఉంది. ఇదే సమయంలో భూసేకరణను కూడా వేగవంతం చేయాలి. టెండర్ల మాట అటుంచితే, భూసేకరణ పనులు ముందుగా చేపట్టాలి. నెల రోజుల్లో భూసేకరణ చేసి భూమిని మెట్రో కార్పొరేషన్‌ కు అప్పచెపుతామని కృష్ణా జిల్లా కలెక్టర్ చెప్పారు. భూసేకరణలో స్థలాలు కోల్పోయిన వారికి నష్టపరిహారం, తదితర ఖర్చులకు కనీసం వెయ్యి కోట్లు అవసరమవుతాయని అధికారులు చెపుతున్నారు. అయితే ప్రభుత్వం బడ్జెట్‌ లో కేవలం 300 కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించింది. ఈ నిధులు ఏమేరకు సరిపోతాయంటున్నారు మెట్రో కార్పొరేషన్ అధికారులు. భూసేకరణకు ఇవ్వాల్సిన నష్టపరిహారమే సుమారు 700 కోట్ల రూపాయల వరకూ అవుతుందని, 300 కోట్లు ఏమాత్రం సరిపోవని చెపుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ఖజానా పూర్తిగా వట్టిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో జైకా నుంచి రుణం తీసుకోవడమే మంచిదని ప్రభుత్వం భావిస్తోంది. జైకా రుణం మంజూరు చేయడానికి కనీసం ఆరు నెలల వ్యవధి పడుతుందని భావిస్తున్నారు. ఈలోగా 300 కోట్ల రూపాయలను విడతల వారీగా కేటాయిస్తే ప్రాథమిక పనులైనా మొదలుపెడతామని అధికారులు అంటున్నారు. ఏప్రిల్‌ లో కొత్త ఆర్థిక సంవత్సరం ఆరంభమవుతుంది. అప్పటికి ఈ 300 కోట్లలో కొంత మొత్తమైనా విడుదలవుతుందని భావిస్తున్నారు. జైకా నుంచి ముందు 3,600 కోట్ల రూపాయల రుణం తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. తరువాత దీన్ని నాలుగు వేల కోట్లకు పెంచింది. ఇప్పుడు 4,200 కోట్ల రూపాయలు తీసుకోవాలని భావిస్తోంది. అనుకున్న సమయానికి రుణం విడుదలైనా, కేంద్ర సహకారం అందినా, 2018 నాటికి మాత్రం మెట్రో రైలు పట్టాలు ఎక్కడం సాధ్యం కాదని మెట్రో రైలు అధికారులే చెపుతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ప్రాజెక్ట్ ఖర్చు 6000 కోట్ల రూపాయలుగా అంచనా వేస్తున్నారు. అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరిగి 2018కే ప్రాజెక్ట్ పూర్తయినా అంచనా వ్యయం 8,400 కోట్ల రూపాయలకు పెరుగుతుంది. అదే 2020 వరకూ సాగితే అంచనా వ్యయం 9000 కోట్ల రూపాయలకు చేరుకుంటుందని మెట్రో అధికారులే చెపుతున్నారు.
Tags:    

Similar News