జగన్ అవసరం రాదా ?

Update: 2021-10-10 06:07 GMT
క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. కడప జిల్లాలోని బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికలో ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి అడుగుపెట్టాల్సిన అవసరం రాకపోవచ్చు. ఎందుకంటే ప్రత్యర్ధులు గట్టిగా లేని ఈ ఉపఎన్నికలో జగన్ అవసరం మాత్రం ఏముంటుంది ? ఈమధ్యనే జరిగిన తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో కూడా జగన్ అసలు ప్రచారానికే రాలేదు. అప్పట్లో టీడీపీ తరపున స్టార్ క్యాంపైనర్లుగా చంద్రబాబునాయుడు, నారాలోకేష్ అండ్ ఎంతగా ప్రచారాన్ని హోరెత్తించారో అందరు చూసిందే.

ఒకవైపు టీడీపీ నుండి మరోవైపు బీజేపీ ప్రచారాన్ని హోరెత్తించేసినా జగన్ మాత్రం నియోజకవర్గంలోకి అడుగుపెట్టలేదు. మొదట్లో ప్రచారానికి రావాలని జగన్ అనుకున్నా తర్వాత కరోనా వైరస్ కారణంగా విరమించుకున్నారు. అప్పటికే చంద్రబాబు అండ్ కో ప్రచారంలో పాల్గొంటున్నా జగన్ మాత్రం పట్టించుకోలేదు. అంతటి బిజీగా జరిగిన పార్లమెంటు ఉఫఎన్నికలోనే అడుగుపెట్టని జగన్ ఇఫుడు గట్టిపోటీయే లేని బద్వేలు ఉపఎన్నికలో పాల్గొంటారా ?

అందుకనే ఉపఎన్నిక మొత్తాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికే బాధ్యత అప్పగించారు. ఒవరాల్ గా బాధ్యతను పెద్దిరెడ్డి భుజాన వేసుకున్నా మళ్ళీ మండలాల్లో ఎక్కడికక్కడ ఇతర మంత్రులు, ఎంఎల్ఏలు కూడా బాధ్యతను మోస్తున్నారు. నిజానికి బద్వేలు ఉపఎన్నికలో వైసీపీ గెలుపు నల్లేరు మీద నడకనే చెప్పాలి. పోటీలో టీడీపీ ఉన్నా జరిగేదిదే లేకపోయినా జరిగేదిదే అని అందరికీ తెలిసిందే. అలాంటిది పోటీలో కాంగ్రెస్, బీజేపీలున్నపుడు వైసీపీ లెక్క చేయాల్సిన అవసరమేలేదు.

గట్టిగా చెప్పాలంటే పోటీలో ఉన్న రెండుపార్టీలకు పోలింగ్ ఏజెంట్లను పెట్టుకునేంత సీన్ కూడా లేదు. పోలింగ్ ఏజెంట్లనే పెట్టుకునేంత సీన్ లేని పార్టీలు ఇక ఏరకంగా గట్టి పోటి ఇవ్వగలవు. ఎన్నికను వైసీపీకి అనుకూలంగా ఏకగ్రీవం కాకుండా కాంగ్రెస్, బీజేపీలు అడ్డుకోగలిగాయంతే. వాస్తవం ఇదైతే బీజేపీ నేతలు మాత్ర విపరీతంగా ఫోజులు కొడుతున్నారు. వైసీపీ విజయాన్ని అడ్డుకుంటామనేంత స్ధాయిలో మాట్లాడుతున్నారు. మొత్తానికి ఉపఎన్నికలో జగన్ అడుగుపెట్టకుండానే ముగిసేట్లున్నాయి.
Tags:    

Similar News