ఎన్నార్సీపై జగన్ వ్యూహం అదిరిపోయిందిగా?

Update: 2019-12-24 06:34 GMT
రాజకీయాల్లో టైమింగ్ చాలా ముఖ్యం. విషయం ఏదైనా.. ప్రకటన మరేదైనా.. టైమ్లీగా చెప్పాల్సిన అవసరం ఉంది. లేదంటే అనవసరమైన తిప్పులు తప్పవు. ఎప్పటికప్పుడు జరిగే రాజకీయ పరిణామాలకు అనుగుణంగా స్టాండ్ ను మార్చేయటం.. టైమ్లీగా రియాక్ట్ అయ్యే విషయంలో తనను ఎవరూ తప్పు పట్టలేరన్న విషయాన్ని చేతల్లో చేసి చూపించారు ఏపీ ముఖ్యమంత్రి.

దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఎన్నార్సీకి తాము వ్యతిరేకమని దేశ ప్రజలు.. ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్న వేళ.. ఈ అంశంపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్య చేశారు. తాము ఎన్నార్సీని వ్యతిరేకిస్తున్నగా తేల్చేశారు. ఎందుకిలా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు ప్రకటించిన జగన్.. ఎన్నార్సీ విషయానికి వచ్చేసరికి మాత్రం తన స్టాండ్ ను మార్చుకున్నారు. ఎందుకిలా? ఏ వ్యూహంతో ఆయనీ నిర్ణయాన్ని తీసుకున్నారన్నది చూస్తే.. పకడ్బందీ వ్యూహంతోనే జగన్  ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పాలి. ఎన్నార్సీపై జగన్ నెగిటివ్ గా రియాక్ట్ కావటం వెనుక అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పక తప్పదు.

రెండు రోజుల క్రితం ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి అంజావ్ భాషా మాట్లాడుతూ ఎన్నార్సీని అమలు చేయమని స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు ఇచ్చినప్పటికీ.. ముస్లిం మైనార్టీలో ఎన్నార్సీ మీద పెల్లుబుకుతున్న ఆందోళనలు.. భయాల నేపథ్యంలో జగన్ క్లియర్ స్టాండ్ తీసుకున్నారని చెప్పాలి. దీనికి తోడు ఎన్నార్సీని దేశ వ్యాప్తంగా అమలు చేయాలన్న ఆలోచన తమకు లేదన్న విషయాన్ని ప్రధాని మోడీనే స్వయంగా చెప్పటాన్ని మర్చిపోకూడదు.

సుప్రీంకోర్టు చెప్పినందువల్లే అసోంలో ఎన్నార్సీని అమలు చేశామే తప్పించి.. దేశ వ్యాప్తంగా అమలు చేయాలన్న ఆలోచన తమకు లేదని ప్రధాని మోడీ స్పష్టం చేయటాన్ని మర్చిపోకూడదు. ప్రధాని మోడీ ప్రకటన వేళ.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అనూహ్యంగా రియాక్ట్ అయి.. ఎన్నార్సీ మీద తన స్టాండ్ పై క్లారిటీ ఇచ్చేశారని చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నార్సీని కేంద్రం తెర మీదకు తీసుకొచ్చే అవకాశమే లేదు. అదేసమయంలో తాము కూడా ఎన్నార్సీకి వ్యతిరేకమని చెప్పటం ద్వారా అటు  కేంద్రానికి ఎలాంటి ఇబ్బంది లేదు. మరోవైపు రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీలు కోరుకున్నట్లుగా జగన్ నిర్ణయం ఉందని చెప్పాలి. అత్యంత వేగంగా తీసుకున్న నిర్ణయం జగన్ ప్రభుత్వానికి ప్లస్ కావటం ఖాయమని చెప్పకతప్పదు.


Tags:    

Similar News