అంత పెద్ద నేత.. చనిపోతే దగ్గరకు రావటానికి భయపడ్డారట!

Update: 2020-08-08 11:19 GMT
కరోనాకు మించిన కఠినమైన పరిస్థితుల్ని ఇప్పటివరకూ ప్రపంచం చూడలేదేమో? ఒక్క తూటా పేలకుండానే లక్షలాది మంది ప్రాణాలు తీస్తున్న వైనం మానవాళిని కలవరపాటుకు గురి చేస్తుంది. అంతేనా.. కంటికి కనిపించని ఈ శత్రువు ఆడుతున్న ఆటతో.. మనిషి వణికిపోతున్నాడు. కుటుంబ సభ్యులు మొదలు సన్నిహితుల వరకు ఎవరికి దగ్గరగా ఉండలేని చిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తాజాగా విజయనగరానికి చెందిన ఒక కాంగ్రెస్ నేత పరిస్థితి తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే.

పీసీసీ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న యడ్ల ఆదిరాజు ఆకస్మికంగా మరణించారు.ఇక్కడ ఈయన గురించి కాస్త చెప్పుకోవాలి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీలో పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన తర్వాత.. విజయనగరం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలంతా వేర్వేరు పార్టీల్లోకి వెళ్లిపోయిన తర్వాత.. పార్టీకి నేనున్నానంటూ.. పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేసేందుకు సాహసం చేసిన వ్యక్తిగా ఆదిరాజును అందరూ చెప్పుకుంటారు.

చురుకైన కాంగ్రెస్ నేతగా గుర్తింపు పొందిన ఆయన్ను పీసీసీ ఉపాధ్యక్షుడిగా అధినాయకత్వం ఎంపిక చేసింది. బొత్స సత్యనారాయణ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడిగా మాత్రమే కాదు.. వీర విధేయుడిగా వ్యవహరించిన ఆయన ఉన్నట్లుండి అనారోగ్యానికి గురి కావటం.. ఆకస్మికంగా చనిపోవటంపై అందరూ షాక్ తిన్నారు. ఆయన మరణానికి కారణం కరోనా అన్నది తేలకున్నా.. ఆయన చుట్టూ ఉన్న వారు మాత్రమే కాదు.. బంధుమిత్రులు సైతం ఆయన వద్దకు రావటానికి ఇష్టపడని వైనం చూసినప్పుడు కరోనా మనుషుల మీద ఎంత ప్రభావాన్ని చూపుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కారులో ఆసుపత్రికి చేరుకొని.. లోపలకు వెళ్లే లోపు కారులోనే ఆయన తుదిశ్వాస విడిచారు. మంది మార్బలం ఎంత ఉంటే మాత్రం ప్రయోజనం ఏముంది? అప్పటివరకు సన్నిహితంగా ఉన్న వారు చనిపోతే.. దగ్గరకు వచ్చేందుకు సైతం ఇష్టపడని తీరు చూసినప్పుడు కరోనా ఎలాంటి పరిస్థితిని తీసుకొచ్చిందన్న భావన కలగటం ఖాయం.
Tags:    

Similar News