బ్యాంకుల వద్ద రూ.18వేల కోట్లు.. ఇవి ఎవరివంటే?

Update: 2021-01-05 23:30 GMT
కోటి కాదు రెండు కోట్లు కాదు. ఏకంగా రూ.18వేల కోట్ల భారీ మొత్తానికి సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి తాజాగా వెల్లడైంది. బ్యాంకుల్లో మొండి బకాయిల గురించి ఎప్పటికప్పుడు సమాచారం బయటకు వస్తుంటుంది. ఇందుకు భిన్నంగా క్లెయిం చేయని డిపాజిట్లకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు క్లెయిం చేయని డిపాజిట్లు రూ.14971 కోట్లు ఉండగా.. ప్రైవేటు బ్యాంకుల వద్ద ఇవి రూ.2472 కోట్లుగా చెబుతున్నారు.

2019 గణాంకాల ప్రకారం ఈ డిపాజిట్లను ఎవరూ తమవిగా వచ్చి తీసుకోవటం లేదు. భారత రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం డిపాజిట్లు పది సంవత్సరాలు.. అంతకంటే ఎక్కువ కాలం పని చేయనప్పుడు వాటిని క్లెయిం చేయని వాటిగా వర్గీకరిస్తారు. కెవైసీ నిబంధనలు ఉన్నప్పటికీ.. బ్యాంకులు ఈ డిపాజిట్లరకు సంబంధించిన వివరాల్ని కనుగొనలేకపోతున్నట్లుగా చెబుతున్నారు.
క్లెయిం చేయని డిపాజిట్లలో విదేశీ బ్యాంకులవి కూడా రూ.455 కోట్లు ఉన్నాయి. పదేళ్లు.. అంతకంటే ఎక్కువ కాలం క్లెయిం చేయని డిపాజిట్లను విద్య.. అవగాహన నిధికి బదిలీ చేస్తారు. అలాంటి ఖాతాల జాబితాను బ్యాంకులు తమ వెబ్ సైట్లలో చూపిస్తాయి. ఇలా బ్యాంకుల్లో డిపాజిట్లు చేసి తర్వాత పట్టించుకోని ఖాతాదారుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే.. బ్యాంకులకు ఉండే ఖాతాదారులతో పోలిస్తే.. ఇలా క్లెయిం చేసుకోని వారి సంఖ్య ఎక్కువేం కాదని చెబుతున్నారు.

ఇక్కడున్న సమస్య ఏమంటే.. బ్యాంకుల్లో డిపాజిట్లను క్లెయిం చేయని వారి ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తే.. వారిని గుర్తించేందుకు అయ్యే ఖర్చు చాలా ఎక్కువ అవుతుందని బ్యాంకులు చెబుతున్నాయి. అయితే.. డిపాజిట్లు క్లెయిం చేసుకోని వారి ఖాతాల మొత్తాల్ని బదిలీ చేసిన తర్వాత.. ఎవరైనా వస్తే కూడా వారు వెనక్కి తీసుకోవటానికి వీలు ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికైతే తమవని చెప్పేందుకు ముందుకు రాని వారి డిపాజిట్లను మౌలిక సదుపాయాల కోసం వినియోగిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పక తప్పదు.


Tags:    

Similar News