2జీ కేసు..అన్నాహజారే షాకింగ్ కామెంట్

Update: 2017-12-21 10:58 GMT
దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించడ‌మే కాకుండా...కాంగ్రెస్ సార‌థ్యంలోని యూపీఏ హయాంలో జరిగిన అతిపెద్ద కుంభకోణాల్లో 2జీ స్పెక్ట్రం స్కామ్ కూడా ఒకటి. 2జీ స్పెక్ట్రం కుంభకోణం కేసులో టెలికాం శాఖ మాజీ మంత్రి ఎ రాజా - డీఎంకే ఎంపీ కనిమొళి సహా నిందితులందరినీ కోర్టు నిర్దోషులుగా తేల్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప‌లువురు ప్ర‌ముఖులు ఈ తీర్పుపై త‌మ‌దైన శైలిలో స్పందించారు. వీరంద‌రిలో అవినీతి వ్య‌తిరేక ఉద్య‌మ‌కారుడు అన్నాహజారే వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. కోర్టు సరైన తీర్పును వెలువరించిందని ఆయన వ్యాఖ్యానించారు. కోర్టు ఎలాంటి తీర్పును వెలువరించినా మనందరం శిరసా వహించాల్సిందేనని ఆయ‌న అన్నారు. కోర్టులు సరైన సాక్ష్యాలనే చూస్తాయని నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేకపోతే కోర్టులు ఏమీ చేయలేవని అన్నా హ‌జారే చెప్పారు. ఒకవేళ ప్రభుత్వం వద్ద సరైన సాక్ష్యాలు ఉంటే ఉన్నత న్యాయ స్థానంలో అప్పీల్ చేసుకోవచ్చని అన్నారు.  కోర్టు తీర్పును ప్రశ్నించడం సరికాదని ఆయ‌న వ్యాఖ్యానించారు.

ఇదిలాఉండ‌గా...ఈ కేసులో కనిమొళి - ఎ.రాజా సహా అందరినీ నిర్దోషులుగా పేర్కొంటూ పాటియాలా కోర్టు ఇచ్చిన తీర్పును మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్వాగతించారు. కోర్టు తీర్పు అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయన పాటియాలా కోర్టు తీర్పును అందరూ గౌరవించాలన్నారు. యూపీఏ హయాంలో కుంభకోణాలు జరిగాయంటూ సాగుతున్న దుష్ప్రచారానికి ఈ తీర్పు ఫుల్ స్టాప్ పెట్టినట్లయ్యిందన్నారు. ఢిల్లీలో మాజీ కేంద్రమంత్రి చిదంబరం మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వం 2జీ స్పెక్ట్రం భారీ స్కాంకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలు నిజం కావన్నారు. నేడు పటియాలా  కోర్టు ఇచ్చిన తీర్పుతో ఇది తేలిపోయిందని చిదంబరం స్పష్టం చేశారు.

2జి స్పెక్ట్రమ్‌ కుంభకోణం కేసులో అందరినీ నిర్దోషులుగా పేర్కొంటూ తీర్పు చెప్పడంపై ఢిల్లి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తీవ్రంగా స్పందించారు. సీబీఐ కావాలనే ఈ కేసును నీరుగార్చిందా అని ఆయన ప్రశ్నించారు. 2జి కుంభకోణం దేశంలోనే జరిగిన అతి పెద్ద కుంభకోణమని ఢిల్లి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. యూపీఏ తిరిగి అధికారంలోకి రాకపోవడానికి ఈ కుంభకోణం కూడా ఒక ముఖ్యకారణమని ఆయన అన్నారు. దీనిని కావాలనే సీబీఐ నీరుగార్చినట్లుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

2జీ స్కామ్‌ లో నిర్దోషిగా తేలిన డీఎంకే ఎంపీ కనిమొళి ఆ తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు కోసం గత ఆరు ఏళ్లుగా ఎదురుచూస్తున్నట్లు ఆమె చెప్పారు. మ‌నందరికీ ఇదో శుభ దినమని రాహుల్ తెలిపిన‌ట్లు ఆమె పేర్కొన్నారు. 2జీ కేసులో నిర్దోషిగా తేలిన తనకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కంగ్రాట్స్ తెలిపారన్నారు. అగాధం చివరన వెలుతురు కనిపిస్తుందన్న నమ్మకం తనకు ఉందని కనిమొళి ఈ సందర్భంగా తెలిపారు. కంపెనీలో తాను కేవలం 20 రోజులు మాత్రమే డైరక్టర్‌ గా ఉండడం వల్ల తనపై ఆరోపణలు చేశారన్నారు. ఆ కంపెనీకి సంబంధించి ఒక్క బోర్డు మీటింగ్‌ కు కూడా హాజరుకాలేదన్నారు. ఒక్క డాక్యుమెంట్‌ పైన కూడా తాను సంతకం చేయలేదన్నారు. డీఎంకేను ఎన్నికల్లో ఓడించాలన్న ఉద్దేశంతోనే తనను ఈ ఊబిలోకి లాగినట్లు ఆమె ఆరోపించారు.
Tags:    

Similar News