"మూడో ప్రపంచ యుద్ధం మొదలైపోయింది"!

అవును.. ఉక్రెయిన్ - రష్యా మధ్య ఖండాతర క్షిపణి ప్రయోగాలతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.

Update: 2024-11-22 20:30 GMT

రష్యా - ఉక్రెయిన్ యుద్ధం మొదలై వెయ్యి రోజులు దాటిన సంగతి తెలిసిందే. కానీ.. ఇంతవరకూ ముగింపుఛాయలు కనిపించడం లేదు సరికదా.. ఉద్రిక్తతలు రోజు రోజుకీ పెరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో.. రష్యా మరింత దూకుడు పెంచుతుందని అమెరికా హెచ్చరిస్తుంది. ఈ సమయంలో యుద్ధం మొదలైపోయినట్లేనని అంటున్నారు మాజీ కమాండర్ ఇన్ చీఫ్.

అవును.. ఉక్రెయిన్ - రష్యా మధ్య ఖండాతర క్షిపణి ప్రయోగాలతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. మరోపక్క ఉక్రెయిన్ కు మద్దతిస్తోన్న అమెరికా.. ఉ.కొరియా మద్దతు ఇస్తున్న రష్యా తమ తమ దూకుడు చర్యలతో పరిస్థితిని మరింత తీవ్రంగా మారుస్తున్నాయని అంటున్నారు. ఈ సమయంలో ఉక్రెయిన్ కు చెందిన మాజీ అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఉత్తర కొరియాకు చెందిన సైనికులు ఉక్రెయిన్ పై పోరాడుతున్నారని.. ఇరాన్ రూపొందించిన ఆయుధ సామాగ్రితో ఉక్రెయిన్ లో అనేక మంది ప్రణాలు కోల్పోతున్నారని.. ఉ.కొరియా దళాలు, చైనా ఆయుధాలు ఈ యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఉక్రెయిన్ మాజీ కమాండర్ ఇన్ చీఫ్ వాలెరీ జులుఝ్నీ పేర్కొన్నారు.

ఇలా రష్యా మిత్రదేశాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంట్రీ ఇచ్చిన ఈ తరుణంలో 2024లో మూడో ప్రపంచ యుద్ధం మొదలైందనేది మనం విశ్వసించొచ్చని వాలెరీ జులుఝ్నీ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా.. సంక్షోభం మరింత విస్తరించకుండా చర్యలు తీసుకోవాలని ఉక్రెయిన్ మిత్రదేశాలకు విజ్ఞప్తి చేశారు.

ఇదే సమయంలో ఉక్రెయిన్ పై రష్యా సూపర్ సోనిక్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగంపై స్పందించిన జులుఝ్నీ... ఈ యుద్ధం స్థాయి, క్రూరత్వంలో ఇది స్పష్టమైన తీవ్రమైన పెరుగుదలను సూచిస్తుందని అన్నారు. ఉక్రెయిన్ సాంకేతికతతో మనుగడ సాగిస్తుంది కానీ.. ఈ యుద్ధంలో ఒంటరిగా మనుగడ సాధించగలదా అనేది తెలియదని అన్నారు.

ప్రస్తుతం యునైటెడ్ కింగ్ డమ్ లో ఉక్రెయిన్ రాయబారిగా ఉన్న జులుఝ్నీ.. ఓ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ విధంగా మాట్లాడారు.

Tags:    

Similar News