బీజీటీ.. తెలుగు కుర్రాడు నిలిపాడు..బుమ్రా కంగారూ వెన్నువిరిచాడు

మొత్తంగా చూస్తే మొదటి రోజు ఆటలో తెలుగు కుర్రాడు నిలిపితే.. కెప్టెన్ బుమ్రా కంగారూల వెన్నువిరిచాడు

Update: 2024-11-22 12:06 GMT

సొంతగడ్డపై చరిత్రలో ఎన్నడూ లేని విధంగా న్యూజిలాండ్ తో మూడు టెస్టుల సిరీస్ లో క్లీన్ స్వీప్ అయి.. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ లేకుండానే పర్యటనకు వెళ్లి.. మరో కీలక బ్యాట్స్ మన్ గాయపడి జట్టుకు దూరమైన సందర్భంలో.. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ (బీజీటీ) బరిలో దిగిన టీమ్ ఇండియా మొదటి టెస్టు మొదటి రోజు మంచి ప్రదర్శనే చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగి కేవలం 150 పరుగులకే ఆలౌటైనా.. బౌలింగ్ లో ప్రత్యర్థిని అంతకన్నా తక్కువకే కట్టడి చేసేలా కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే మొదటి రోజు ఆటలో తెలుగు కుర్రాడు నిలిపితే.. కెప్టెన్ బుమ్రా కంగారూల వెన్నువిరిచాడు.

7 నెలల్లోనే అంతర్జాతీయ స్థాయికి

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ తో వెలుగులోకి వచ్చాడు తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి. కేవలం 21 ఏళ్ల వయసున్న నితీశ్.. ఏప్రిల్ 5న సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున తొలి మ్యాచ్ ఆడాడు. పంజాబ్ కింగ్స్ పై 37 బంతుల్లోనే 64 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ అతడి కెరీర్ ను మలుపు తిప్పింది. నిలకడగా 135 కిలోమీటర్ల వేగంతో బంతులు వేయగల కుర్రాడు కావడంతో టీమ్ ఇండియా సెలక్టర్ల కన్ను పడింది. ఐపీఎల్ లో మొత్తం 303 పరుగులు చేశాడు. 3 వికెట్లు పడగొట్టాడు. ఆ వెంటనే జింబాబ్వే పర్యటనకు ఎంపికైనా గాయంతో దూరమయ్యాడు. గత నెలలో బంగ్లాదేశ్ తో టి20 సిరీస్ లో చోటు దక్కించుకుని ఢిల్లీలో జరిగిన రెండో టీ20లో 74 పరుగులు చేసి, 2 వికెట్లు తీశాడు. రంజీ ట్రోఫీలోనూ ఆకట్టుకోవడంతో నితీశ్‌ కు టెస్టు జట్టులోనూ చోటుదక్కింది. కాగా, శుక్రవారం మొదలైన టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో టీమ్ ఇండియా టాప్ స్కోరర్ నితీశ్ (41) కావడం విశేషం. జైశ్వాల్, పడిక్కల్ ఖాతా తెరవకుండానే వెనుదిరగ్గా.. కోహ్లీ అనూహ్య బౌన్స్ కు బలవగా.. రిషభ్ పంత్ (37)తో కలిసి నితీశ్ జట్టు స్కోరును 100 దాటించాడు. ఈ మ్యాచ్ లో నితీశ్ తక్కువ పరుగులే చేసినా అతడు కనబర్చిన ఆత్మవిశ్వాసం మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఐపీఎల్ లో సన్ రైజర్స్ కెప్టెన్, ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్ లో అప్పర్ కట్ తో నితీశ్ కొట్టిన సిక్సర్ హైలైట్ గా నిలిచింది. దీంతో టీమ్ ఇండియా 150 పరుగులు చేసింది. 9 వికెట్లు కోల్పోయిన దశలో మరిన్ని పరుగులు చేసే క్రమంలో నితీశ్ చివరి వికెట్ గా వెనుదిరిగాడు.

బుమ్రా దెబ్బకు బెంబేలు

150 పరుగులకే టీమ్ ఇండియాను చుట్టేసిన ఆనందంతో బ్యాటింగ్ కు దిగిన ఆతిథ్య కంగారూలకు కెప్టెన్ బుమ్రా చుక్కలు చూపించాడు. కచ్చితమైన లెంగ్త్ లో అతడు వేస్తున్న బంతులకు ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ బెంబేలెత్తిపోయారు. మరీ ముఖ్యంగా ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మన్ స్టీవ్ స్మిత్ ను మొదటి బంతికే వికెట్ల ముందు బుమ్రా దొరకబుచ్చుకున్న తీరు అద్భుతం. స్మిత్ రివ్యూ కూడా అడగలేదు. కొత్త ఓపెనర్ మెక్ స్వీనీ (10), ఖవాజా (8)లనూ బుమ్రా నిలదొక్కుకోనీయలేదు. అద్భుతమైన బంతికి ఖవాజా స్లిప్‌ లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు. ఆసీస్ కెప్టెన్ కమిన్స్ (3) బుమ్రా బౌలింగ్‌లో వికెట్ కీపర్ పంత్‌ కు క్యాచ్‌ ఇచ్చాడు. కాగా, ఈ మ్యాచ్ లో నితీశ్ రెడ్డితో పాటే అరంగేట్రం చేసిన పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ హర్షిత్ రాణా.. ప్రమాదకర బ్యాట్స్ మన్ ట్రావిస్ హెడ్‌ (11)ను బౌల్డ్‌ చేశాడు. హైదరాబాదీ సిరాజ్‌ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్‌ (6), కీలక బ్యాట్స్ మన్ మార్నస్ లబుషేన్ (2; 52 బంతుల్లో)ను బలిగొన్నాడు.

చిక్కినట్టేనా?

తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఇంకా 83 పరుగులు వెనుకబడి ఉంది. మూడు వికెట్లు చేతిలో ఉన్నాయి. వీటిని వెంటనే తీసివేయాలి. ఆధిక్యం 70 పరుగులైనా దక్కాలి. ఆపై 200 పరుగులు చేస్తే టెస్టు మ్యాచ్ మన చేతుల్లోకి వచ్చినట్లే. కాగా, తొలి రోజే 17 వికెట్లు పడిన పెర్త్ టెస్టు మూడో రోజుకు మించి జరగకపోవచ్చు. లేదా పిచ్ బ్యాటింగ్ కు సహకరిస్తే నాలుగో రోజుకు దారితీయొచ్చు.

Tags:    

Similar News