ఆదివారం తెలంగాణ వ్యాప్తంగా నో వ్యాక్సిన్.. కారణమిదే!

Update: 2021-04-18 03:05 GMT
కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్న వేళ.. వైరస్ వ్యాప్తికి వ్యాక్సినేషన్ ఒక సొల్యూషన్ గా చెప్పాలి. జనవరిలో వ్యాక్సిన్ దేశంలో అందుబాటులోకి వచ్చినా.. సామాన్యులకు అందించే విషయంలో జరిగిన ఆలస్యం.. వ్యూహాత్మక వైఫల్యం.. వెరసి ఈ రోజున కరోనా రెండో దశతో దేశ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. తాజాగా దేశ వ్యాప్తంగా రోజుకు దగ్గర దగ్గర రెండున్నర లక్షల (శనివారం ప్రకటించిన అధికారిక లెక్కల ప్రకారం రూ.2.34లక్షలు) మంది పాజిటివ్ గా తేలుతోంది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరగటం ఖాయమని చెబుతున్నారు.

టీకా అందుబాటులోకి వచ్చినప్పుడు.. రకరకాల అనుమానాలు.. అంతకు మించి వెంటాడే సందేహాలతో వ్యాక్సిన్ వేసుకోవటానికి ఆసక్తి చూపించని ఎంతో మంది.. ఇప్పుడు టీకాల కోసం పరుగులు తీస్తున్నారు. ఇలాంటి వేళలోనే.. టీకాల కొరత దేశ వ్యాప్తంగా పీడిస్తోంది. దేశంలో తయారైన టీకాల్ని.. విదేశాలకు పెద్ద ఎత్తున దానం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి ఈ రోజున దేశ ప్రజలు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. పలు రాష్ట్రాల్లో టీకాల కొరత ఇబ్బంది పెడుతోంది. ఏ రోజుకు ఆ రోజు కేంద్రాన్ని టీకాల కోసం అడుక్కోవటమే పనిగా మారింది. తాజాగా తెలంగాణ వ్యాప్తంగా టీకాలు పూర్తిగా అయిపోయిన దుస్థితి. దీంతో.. ఆదివారం (ఏప్రిల్ 18) రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లుగా హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. రాష్ట్రంలో టీకాల నిల్వలు లేకపోవటంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా ఆయన చెప్పారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఆదివారం సాయంత్రానికి వ్యాక్సిన్ స్టాక్ వచ్చే వీలుందని.. ఈ కారణంతోనే ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ను ఆపేసినట్లు తెలిపారు. కొద్దిరోజుల క్రితమే రాష్ట్ర సీఎస్ సోమేశ్ కుమార్ కేంద్రానికి లేఖ రాశారు.

రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరత పెరుగుతోందని.. వెంటనే 30 లక్షల డోసులు పంపాలని కోరారు. కానీ.. వచ్చింది మాత్రం 4.6 లక్షల డోసులు మాత్రమే వచ్చాయి. ఇలా.. కేంద్రం నుంచి సానుకూల స్పందన లేకపోవటంతో ఈ రోజున టీకాలు లేక.. వ్యాక్సినేషన్ ఒక రోజంతా ఆగిపోయిన పరిస్థితి.
Tags:    

Similar News