పార్టీ మారినా విశాఖ ‘రాజు’కు పీఠం దక్కలేదు

Update: 2020-03-17 17:30 GMT
రాజకీయాల్లో తెలివి ఉంటేనే సరిపోదు. కాలం కలిసి రావాలి. లేకుంటే.. తోపుల్లాంటోళ్లు సైతం తోటకూర కాడలా ఇట్టే వడిలి పోతుంటారు. ప్రజాదరణ ఉన్నప్పటికి సుడి లేకపోతే.. సిత్రం ఎంతలా మారుతుందో విశాఖ జిల్లాలో ఒకప్పుడు తిరుగులేని అధిక్యతను ప్రదర్శించిన బాలరాజు పరిస్థితి చూస్తే..అయ్యో అనుకోకుండా ఉండలేం. దివంగత మహానేత వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కాదు.. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలోనూ మంత్రిగా వ్యవహరించిన ఆయనకు క్యాడర్ అండ భారీగానే ఉంది.

అలాంటి కాంగ్రెస్ నేత.. రాష్ట్ర విభజన నాటి నుంచి కాలం కలిసి రావటం లేదంటారు. 2014లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో ఎంతటి వ్యతిరేకత ఉందన్న విషయం తెలిసినప్పటికీ.. ఆ పార్టీలోనే ఉండిపోయిన అతి కొద్ది మందిలో బాలరాజు ఒకరు. ఎంతో ఇచ్చిన పార్టీకి విధేయుడిగా ఉండి పోవాలన్న ఉద్దేశం తో ఆ పార్టీ తరఫున పోటీ చేసి దారుణ పరాజయం పాలయ్యారు.

తర్వాత కూడా కాంగ్రెస్ లోనే కొనసాగారు. ఏపీలో ఇంకెప్పటికి కాంగ్రెస్ కు సీన్ లేదన్న విషయాన్ని అర్థం చేసుకున్న ఆయన.. 2019 ఎన్నికలకు ముందు పవన్ కల్యాన్ జనసేనలో పార్టీలో చేరారు. అయితే.. అక్కడ తన పరిస్థితిలో మార్పు లేకపోవటంతో ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. సమీకరణాల్ని జాగ్రత్తగా చూసుకొని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

తనకు అవకాశం లేకున్నా.. తన కుమార్తె డాక్టర్ దర్శినిని జెడ్పీ ఛైర్ పర్సన్ చేయాలన్న ఆలోచనలో ఆయన పార్టీలో చేరినట్లు చెబుతారు. దీనికి తోడు విశాఖ జిల్లా జెడ్పీ ఛైర్ పర్సన్ పదవి ఎస్టీ మహిళలకు రిజర్వ్ కావటం తో తనకు తిరుగు లేదని భావించారు. దీనికి తగ్గట్లే పావులు కదుపుతున్న ఆయన దూకుడ్ని గుర్తించిన సొంత పార్టీ నేతలు ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారు. పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న తమకు కాకుండా రెండు నెలల క్రితం పార్టీలో చేరిన వారు పదవులు ఎగురేసుకు వెళ్లటమా? అంటూ అధినాయకత్వానికి ఫిర్యాదులు చేయటం షురూ చేశారు.

బాలరాజు కుమార్తెకు జెడ్పీ పీఠాన్ని ఇస్తే ఒప్పుకునేది లేదంటూ పాడేరుఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేయటమే కాదు.. పార్టీ అధినేత జగన్ కు కళ్లు.. ముక్కు.. చెవులు అయిన విజయసాయి వద్ద పంచాయితీ పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బాలరాజు కుమార్తెకు టికెట్ ఇస్తే ఒప్పుకునేది లేదన్న ఆమె మాటలు ఒక పక్క.. పార్టీకి చెందిన ఇతర నేతలు బాలరాజుకు అవకాశం ఇవ్వటాన్ని ససేమిరా అనే పరిస్థితి. ఇదిలా ఉంటే.. తన కుటుంబానికి అవకాశం లేకుండా చేస్తున్న నేతల తీరుపై బాలరాజు గుర్రుగా ఉన్నారు.

ఇలాంటి వేళ.. ఈ రెండు వర్గాల్లో ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీకి కొత్త తిప్పలు తప్పవన్న విషయాన్ని గుర్తించిన విజయసాయి.. మధ్యేమార్గంగా పాడేరులో పార్టీకి సమన్వయకర్తగా పని చేసి.. ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన మత్స్యరాస విశ్వేశ్వరరాజుకు ఛాన్సు ఇవ్వాలని పార్టీ అధినాయకత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. దీనికి తగ్గట్లే విశ్వేశ్వరరాజు సతీమణి శివరత్నానికి జెడ్పీటీసీ టికెట్ ను కేటాయించారు. ఇంతకాలం కలిసి రాని కాలం.. ఇప్పుడిప్పుడే తనకు అనుకూలంగా మారుతుందని ఆశించిన బాలరాజుకు.. తాజా పరిణామం మరోసారి హతాశుడ్ని చేసినట్లు చెబుతున్నారు.


Tags:    

Similar News