ఎమ్మెల్సీ బ‌రికి నామినేష‌న్లు పోటెత్తాయిగా!

Update: 2017-02-21 06:08 GMT
శాస‌న‌మండ‌లిలో ఖాళీ అయిన స్థానాల భ‌ర్తీ కోసం జ‌ర‌గ‌నున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు భారీ పోరు త‌ప్పేలా లేదు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఈ ద‌ఫా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు ఏపీలో భారీ ఎత్తున నామినేష‌న్లు దాఖ‌ల‌య్యాయి. ఏపీ శాస‌న‌మండ‌లిలో ఇటీవ‌లే ఖాళీ అయిన మూడు గ్రాడ్యుయేట్స్‌ - రెండు టీచ‌ర్స్ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. నిన్న‌టితో ఈ స్థానాల‌కు నామినేష‌న్ల దాఖ‌లు గ‌డువు కూడా ముగిసింది. ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న స్థానాల్లో ప‌శ్చిమ రాయ‌ల‌సీమ (అనంత‌పురం - క‌డ‌ప - క‌ర్నూలు) గ్రాడ్యుయేట్స్‌ - టీచ‌ర్స్ స్థానాల‌తో పాటు చిత్తూరు-నెల్లూరు-ప్ర‌కాశం గ్రాడ్యుయేట్స్‌ - టీచ‌ర్స్ స్థానాలు - ఉత్త‌రాంధ్ర ప‌ట్ట‌భ‌ద్రుల స్థానం కూడా ఉంది. ఉత్త‌రాంధ్ర స్థానం స‌హా మొత్తం ఐదు స్థానాల ఎన్నిక కోసం అభ్య‌ర్థులు నామినేష‌న్ల‌తో క్యూ క‌ట్టారు.

ప‌శ్చిమ రాయ‌ల‌సీమ గ్రాడ్యుయేట్స్ స్థానానికి దాఖ‌లైన నామినేష‌న్ల సంఖ్య చూస్తే... అస‌లు అక్క‌డ జ‌రుగుతోంది ఎమ్మెల్సీ ఎన్నిక‌లా?  లేక ఎమ్మెల్యే ఎల‌క్ష‌న్లా అనే అనుమానం రాక మాన‌దు. ఎందుకంటే ఆ స్థానానికి ఏకంగా 62 నామినేష‌న్లు దాఖ‌ల‌య్యాయి. అయితే నేడు జ‌ర‌గ‌నున్న ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న‌లో ఎన్నిమేర అర్హ‌త సాధిస్తాయ‌న్న విష‌యాన్ని ప‌క్క‌న‌బెడితే... అస‌లు ఈ ఒక్క స్థానానికి 60కి పైగా నామినేష‌న్లు దాఖ‌ల‌య్యాయంటే... పోటీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక ఇదే ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి కూడా  25 నామినేష‌న్లు దాఖ‌ల‌య్యాయి. అంటే ఈ స్థానాన్ని ద‌క్కించుకునేందుకు కూడా పెద్ద సంఖ్య‌లో అభ్య‌ర్థులు బ‌రిలోకి దిగార‌న్న మాట‌.

పార్టీల ప్ర‌మేయం అంత‌గా లేకున్నా... ఈ ఎన్నిక‌లు మాత్రం అటు అధికార పార్టీ టీడీపీతో పాటు ఇటు ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపీకి కూడా అత్యంత ప్రాధాన్యం క‌లిగిన ఎన్నిక‌లుగానే ఇవి నిలుస్తున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ క్ర‌మంలోనే ఈ మేర నామినేష‌న్లు దాఖ‌ల‌య్యాయ‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇక ఉత్త‌రాంధ్ర గ్రాడ్యుయేట్స్ స్థానానికి కూడా 34 నామినేష‌న్లు దాఖ‌ల‌య్యాయి. బచిత్తూరు-నెల్లూరు-ప్ర‌కాశం గ్రాడ్యుయేట్స్ స్థానం విష‌యానికి వ‌స్తే... 20 నామినేష‌న్లు దాఖ‌లు కాగా,  టీచ‌ర్స్ స్థానం కోసం 9 నామినేష‌న్లు దాఖ‌ల‌య్యాయి. నిన్న సాయంత్రంతో నామినేష‌న్ల దాఖ‌లుకు గ‌డువు ముగిసింద‌ని ప్ర‌క‌టించిన ఎన్నిక‌ల సంఘం... గ‌డువులోగా అందిన ద‌ర‌ఖాస్తుల‌ను నేడు ప‌రిశీలించ‌నుంది. ఈ ప‌రిశీల‌న‌లో ఎన్ని నామినేష‌న్లు అర్హ‌త సాధిస్తాయో నేటి సాయంత్రంలోగా తేలిపోనుంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News