కిమ్ కొత్త చ‌ట్టాలు.. అవేంటో చూడ‌గ‌ల‌రా?

Update: 2021-06-13 23:30 GMT
ఏ దేశంలోనైనా నియంత‌లను ఒక్క‌టే భ‌యం వెంటాడుతుంది. ఎక్క‌డ అధికారం దూర‌మైపోతుందోన‌ని నిత్యం ఆందోళ‌న చెందుతుంటారు. అందుకే.. దాన్ని కాపాడుకునేందుకు ఎంత‌కైనా తెగిస్తుంటారు. ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకోవ‌డానికైనా సిద్ధ‌ప‌డుతుంటారు. ఈ క్ర‌మంలో.. ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఎలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నాడో ప్ర‌పంచానికి తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో వింత వింత నిర్ణ‌యాలు తీసుకున్న కిమ్‌.. తాజాగా మ‌రికొన్ని కొత్త చ‌ట్టాలు చేశాడు.

అవేంటంటే.. నార్త్ కొరియాలో ఎవ్వ‌రూ జుట్టుకు రంగు వేసుకోకూడ‌దు. హెయిర్ స్టైల్స్ కూడా ఏదిప‌డితే అది ఫాలో కాకూడ‌దు. జుట్టు ఎలా కత్తిరించుకోవాలో.. 215 ర‌కాల డిజైన్ల‌ను ఫైన‌ల్ చేసిపెట్టాడు. అందులో ఏదో ఒకటి సెల‌క్ట్ చేసుకోవాలి త‌ప్ప‌.. ఇత‌ర ర‌కాల‌ను ఎంచుకోకూడ‌దు.

స్పైక్‌, ముల్లెట్ వంటి హెయిర్ స్టైల్స్ సంఘ వ్య‌తిరేక‌మైన‌వి అంటూ నిషేధించాడు. అంతేకాదు.. స్కీన్‌ టైట్ జీన్స్ వేసుకోకూడ‌దు. ఏవైనా స్లోగ‌న్స్ ప్రింట్ చేసిన టీష‌ర్టులు వేసుకోకూడ‌దు. అదేవిధంగా.. ముక్కు, పెదాల‌ను కుట్టించుకోకుడ‌దు. ఇంకా.. అత్యంత ప్ర‌ధాన‌మైన‌వి సౌత్ కొరియాకు చెందిన సినిమాలు, ఆ దేశం పాట‌లు, వీడియోలు చూడ‌కూడ‌దు. పాడ‌కూడ‌దు. విన‌కూడ‌దు. అంతేకాదు.. నార్త్ కొరియాలో ప్ర‌ద‌ర్శించ‌కూడ‌దు.

ఇందులో చాలా వ‌ర‌కు చ‌ట్టాలు గ‌త డిసెంబ‌ర్ లోనే అమ‌ల్లోకి వ‌చ్చాయి. ఈ రూల్స్ ఎవ‌రైనా ఉల్లంఘిస్తే.. ఇప్ప‌టి వ‌ర‌కు 15 సంవ‌త్స‌రాల జైలు శిక్ష విధిస్తున్నారు. ప‌దిహేనేళ్ల క‌న్నా త‌క్కువ వ‌య‌సున్న‌వారు ఈ త‌ప్పు చేస్తే.. వాళ్ల త‌ల్లిదండ్రుల‌కు శిక్ష విధిస్తున్నారు. అయితే.. దీన్ని ఏకంగా మ‌ర‌ణ‌శిక్ష కింద‌కు మార్చేందుకు ఆలోచిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

విదేశీ సంస్కృతిని త‌మ దేశంలోకి రానివ్వొద్దంటూ ఈ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నాడు కిమ్‌. కానీ.. అస‌లు విష‌యం వేరే ఉంద‌ని అంటున్నారు. జ‌నాలు మార్పును కోరుకోవ‌డం ద్వారా.. త‌న అధికారానికి గండం వ‌స్తుంద‌ని భ‌య‌ప‌డ‌డం ద్వారానే ఈ విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి, రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటాడో చూడాల్సి ఉంది.







Tags:    

Similar News