ఆనంద్ మహీంద్రా ట్వీట్లే కాదు.. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు బాస్

Update: 2022-05-09 04:12 GMT
మాట ఇవ్వటం ఏముంది.. ఇట్టే ఇచ్చేయొచ్చు. కానీ.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటమే చాలా కష్టం. మాట ఇస్తే చాలు.. దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టని వైనం కొందరిలో కనిపిస్తూ ఉంటుంది. అందుకు నిదర్శనంగా నిలుస్తుంటారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా. సోషల్ మీడియాల్ చాలా యాక్టివ్ గా ఉండే ఆయన.. ఎప్పటికప్పుడు కొత్త అంశాలను ప్రస్తావిస్తూ ఉంటారు. స్ఫూర్తి వంతమైన వీడియోలను షేర్ చేస్తుంటారు.

రెండేళ్ల క్రితం ఇడ్లీ బామ్మను ప్రపంచానికి పరిచయం చేశారాయన. ఎనిమిది పదుల వయసులోనూ రూపాయికే నాలుగు ఇడ్లీలు అమ్ముతూ పేదల ఆకలి తీర్చే ఇడ్లీ బామ్మ  కమలాత్తాళ్ గురించి చెప్పి.. ఆమెకు అవసరమైన గ్యాస్ అవసరాన్ని తాను భరిస్తానని చెప్పటమే కాదు.. సొంతింటిని నిర్మించి ఇస్తామని కూడా మాట ఇచ్చారు.

రెండేళ్ల క్రితం ఇచ్చిన మాటను తాజాగా ఆయన నిలబెట్టుకున్నారు. మదర్స్ డే రోజున ఆమెకు ఇంటిని ఆమె చేత ప్రారంభించిన విషయాన్ని తన ట్వీట్ తో తెలియజేశారు.

తాను మాట ఇచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఇడ్లీ బామ్మ సొంతింటి నిర్మాణానికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. తమిళనాడులోని వడివెలంపాలయం గ్రామానికి చెందిన కమలాత్తాళ్ 37 ఏళ్లుగా రూపాయికి నాలుగు ఇడ్లీలు అమ్ముతున్నారు.

ఆమె గురించి 2019లో ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. ఆమెకు సాయం చేయటానికి ఆనంద్ మహీంద్రా ముందుకు వచ్చారు. సొంతింటిని ఆమెకు కట్టించి ఇస్తామన్న మాటను నిలబెట్టుకున్న ఆయన్ను అభినందించాల్సిందే.

ఇడ్లీ బామ్మ సొంతింటి కలను తీర్చిన వైనంపై పోస్టు చేసిన ట్వీట్ కు నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. 'మీకు సెల్యూట్' అని ఒకరు.. మీలాంటి కుమారుడు అందరికి రావాలని మరొకరు ఆకాంక్షిస్తే.. మదర్స్ డే రోజు ఇడ్లీ బామ్మ ఆశీస్సులు పొందటం.. భగవంతుడి ఆశీస్సులు పొందటం లాంటిదేనని మరొకరు కామెంట్ చేశారు. ఏమైనా.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా అభినందనీయులని మాత్రం చెప్పక తప్పదు.



Tags:    

Similar News