కేసుల్లోనే కాదు.. రికవరీల్లోనూ మనమే నెంబర్ వన్

Update: 2020-09-20 04:30 GMT
అందరికంటే ముందే నిద్ర లేచినా.. కరోనాను కంట్రోల్ చేసేందుకు వారాల తరబడి లాక్ డౌన్ విధించినా.. దేశంలో మహమ్మారి ఎంతలా వ్యాపించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. చూస్తుండగానే ప్రపంచంలో అత్యధిక కేసులు నమోదవుతున్న దేశంగా భారత్ పట్టికలో ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చేసింది. ఇటీవల కాలంలో ప్రతి రోజూ 90వేలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్న వేళ.. తాజాగా గడిచిన 24 గంటల్లో 93,337 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకంతకూ పెరుగుతున్న కేసులు ఓవైపు భయాందోళనల్ని కలిగిస్తున్నా.. అంతకు మించిన ఊరట తాజాగా లభించింది.

ఇప్పటివరకూ ఎప్పుడు లేని విధంగా కరోనా రికవరీలు భారీగా మన దేశంలో చోటు చేసుకున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా ఒక్కరోజులో 95,880 మంది కోలుకొని వెళ్లటం భారీ రిలీఫ్ గా చెప్పాలి. దీంతో.. ఇప్పటివరకు రికవరీల్లో మెరుగ్గా ఉన్న అమెరికా.. బ్రెజిల్ భారత్ కంటే వెనుక పడిపోయాయి. తాజాగా వెలువడిన గణాంకాల్ని చూస్తే.. ఆసక్తికర అంశం ఒకటి కనిపిస్తుంది. కేసుల నమోదులోనే కాదు.. రికవరీల్లోనూ మనమే నెంబర్ వన్ అన్న విషయం స్పష్టమవుతుంది.

భారీగా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లోనే రికవరీలు మెరుగుపడటం గమనార్హం. రికవరీల్లో బిహార్.. తమిళనాడు.. పశ్చిమబెంగాల్.. ఆంధ్రప్రదేశ్.. ఢిల్లీ రాష్ట్రాలు తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. కేసుల నమోదు కంటే కూడా రికవరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ మరణాలు కూడా ఎక్కువగా ఉండటం కాస్తంత ఆందోళన కలిగించే అంశం. కాకుంటే.. తాజాగా చోటు చేసుకుంటున్న మరణాల్లో 57 శాతానికి పైనే మూడు రాష్ట్రాల్లోనే ఉండటం గమనార్హం. గడిచిన 24 గంటల్లో 1247 మంది మరణిస్తే.. అందులో మహారాష్ట్రలో 440 మంది.. కర్ణాటకలో 179 మంది.. ఉత్తరప్రదేశ్ లో 98 మంది ఉండటం గమనార్హం. మొత్తం మరణాల్లో ఈ మూడు రాష్ట్రాల వాటానే 57.4శాతం ఉందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
Tags:    

Similar News