అలా చేస్తే పాకిస్థాన్ లోనే కాదు.. భారత్ లోనూ కుటుంబ సభ్యులే చంపేస్తున్నారు

Update: 2022-05-07 05:29 GMT
ఎవరి జీవితం వారిది. నచ్చితే వారితో కలిసి ప్రయాణం చేయ్. లేదంటే ఎవరి దారిన పోవచ్చు. కానీ.. అందుకు భిన్నంగా తమకు నచ్చినట్లే పిల్లలు ఉండాలని తల్లిదండ్రులు పలువురు మూర్ఖంగా వ్యవహరించటం.. కుటుంబ సభ్యులు పరిమితులు విధించి నానా తిప్పలు పెట్టటం లాంటివి చేస్తుంటారు. గురువారం రాత్రి హైదరాబాద్ లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాము ఒప్పుకోనప్పటికి హిందూ కుర్రాడ్ని తన చెల్లి పెళ్లి చేసుకుందన్న కోపంతో ఆమె భర్తను నడిరోడ్డు మీద చంపేసిన వైనం తెలిసిందే. సంచలనంగా మారిన ఈ ఉదంతంలో.. తమ మతానికి చెందని వ్యక్తి తన చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడన్న కసి కనిపిస్తుంది.

ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ లో దీనికి మించిన దారుణం చోటు చేసుకుంది. 21 ఏళ్ల సిద్రా అనే యువతి తనకు నచ్చిన రీతిలో తన కెరీర్ ను ప్లాన్ చేసుకుంది. లాహోర్ కు 130కిలోమీటర్ల దూరంలో ఉన్న రెనాల్ ఖుర్ద్ ఒకారా ప్రాంతానికి చెందిన ఆమె.. మోడలింగ్ తో పాటు థియేటర్స్ లో డ్యాన్సర్ గా కెరీర్ ను ఎంచుకుంది.

అయితే.. ఈ రెండు ఉద్యోగాల్ని వదిలేయాలని.. తమ కుటుంబ సంప్రదాయానికి విరుద్దమని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేశారు. అయితే.. ఇష్టమైన కెరీర్ ను వదులుకునేందుకు సిద్రా నో చెప్పింది.

తాజాగా ఆమె ఈద్ పండుగ సందర్భంగా వేడుకల్ని కుటుంబ సభ్యులతో జరుపుకునేందుకు పైసలాబాద్ నుంచి సొంతూరుకు వచ్చింది. పండక్కి ఇంటికి వచ్చిన కుమార్తెతో కుటుంబ సభ్యులు మరోసారి గొడవ పడ్డారు. మాటా మాటా పెరగటంతో.. ఆమెపై కుటుంబ సభ్యులు దాడి చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఇది జరిగిన తర్వాతి రోజు సిద్రా సోదరుడు హమ్జా కోపంతో ఊగిపోతూ.. సోదరిపై కాల్పులు జరిపాడు.

దీంతో.. ఆమె అక్కడికక్కడే ప్రాణాల్ని వదిలింది. డ్యాన్సర్ గా పని చేస్తున్న సిద్రా వీడియోల్ని తెలిసిన వారు కుటుంబ సభ్యులకు పంపటంతో వారు ఆగ్రహానికి గురైనట్లుగా చెబుతున్నారు. సోదరిని చంపేసిన నేరాన్ని హమ్జా ఒప్పుకోవటంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదంతా చూసినప్పుడు ఇంట్లో అమ్మాయి తమకు నచ్చని పని చేస్తే.. చంపేయటమే అన్న ధోరణి అటు పాకిస్థాన్ లాంటి మతఛాందస దేశంలోనే కాదు.. భారత్ లోనూ ఉండటం విచారించాల్సిన అంశంగా చెప్పక తప్పదు.
Tags:    

Similar News