ఈసారి కేసు వంతు.. రాజాసింగ్ కు!

Update: 2018-09-14 05:41 GMT
ఇదేం చిత్ర‌మో కానీ.. కాస్తంత ప్ర‌జాద‌ర‌ణ‌.. బ‌ల‌మైన నేత‌లుగా పేరున్న విప‌క్ష నేత‌ల‌పై ఒక్కొక్క‌టిగా కేసులు న‌మోద‌వుతున్నాయి. గ‌తంలో ఎప్పుడూ లేనంత చైత‌న్యంతో పోలీసులు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న అభిప్రాయం ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు. యాదృశ్చిక‌మో.. ఇంకేదైనా కార‌ణ‌మో కానీ ఎప్పుడో 14 సంవ‌త్స‌రాల కింద‌ట జ‌రిగిన నేరంగా చెబుతూ.. కాంగ్రెస్ నేత జ‌గ్గారెడ్డిపై కేసు న‌మోదు చేసి జైలుకు త‌ర‌లించారు.

ఇది జ‌రిగిన వెంట‌నే రేవంత్ రెడ్డిపై కేసు న‌మోదైంది. ఇది చాల‌ద‌న్న‌ట్లుగా కాంగ్రెస్ నేత‌.. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీ‌శైలంగౌడ్ మీద మ‌రో కేసు న‌మోదు చేశారు పోలీసులు. ఇప్పుడు ఈ వంతు తాజామాజీ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రావ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ త‌ర‌చూ వార్త‌ల్లో నిలిచే రాజాసింగ్ మీద ఏకంగా ఐదు కేసులు పెట్టిన‌ట్లుగా ఆయ‌న వాపోతున్నారు.

ఇంత‌కూ ఆయ‌న మీద పెట్టిన కేసుల గురించి వింటే అవాక్కు అవ్వాల్సిందే. ఆగ‌స్టు 15న అనుమ‌తి లేకుండా తిరంగా జెండా ర్యాలీ నిర్వ‌హించినందుకు త‌న‌పై ఐదు పోలీస్ స్టేష‌న్ల‌లో కేసులు న‌మోదు చేసినట్లు ఆయ‌న చెబుతున్నారు. తిరంగా యాత్ర‌ను ఈ ఏడాది మాత్ర‌మే నిర్వ‌హించ‌లేద‌ని.. గ‌తంలోనూ చేప‌ట్టిన విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు.

మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. తిరంగా యాత్ర‌ను ఒక్క హైద‌రాబాద్‌లోనే నిర్వ‌హించ‌లేద‌ని.. దేశ వ్యాప్తంగా నిర్వ‌హించార‌ని ఏ రాష్ట్రంలోనూ అనుమ‌తులు తీసుకోలేద‌ని.. ఎక్క‌డా కేసు న‌మోదు చేయ‌లేద‌ని రాజాసింగ్ చెబుతున్నారు. తిరంగా యాత్ర‌ను.. ఆగ‌స్టు 15న స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా జాతీయ జెండా ఊరేగింపుగా ర్యాలీ చేసి.. మిఠాయిలు పంచుతారే త‌ప్పించి మ‌రింకేమీ చేయ‌రని.. దీనికి కూడా ఐదు కేసులు న‌మోదు చేస్తారా? అని ప్ర‌శ్నిస్తున్నారు.   

త‌న‌పై పెట్టిన కేసులకు సంబంధించి త‌మ ఎదుట హాజ‌రు కావాలంటూ అబిడ్స్ పోలీసులు త‌న‌కు నోటీసులు జారీ చేసిన‌ట్లుగా చెప్పారు. మ‌జ్లిస్ ఒత్తిడి మేర‌కు త‌న‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం అక్ర‌మ కేసులు బ‌నాయించిన‌ట్లుగా చెబుతున్నారు. తాను కేసుల‌కు బెదిరేది లేద‌న్న ఆయ‌న త‌న‌పై న‌మోదైన కేసుల‌పై కోర్టుల‌లోనే తేల్చుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. దేశ‌భ‌క్తిని చాటేందుకు తిరంగా యాత్ర‌ను నిర్వ‌హిస్తే.. కేసులు పెట్ట‌టం దారుణ‌మ‌న్నారు.
Tags:    

Similar News