హల్ చల్ చేస్తున్న నయిం వాట్సప్ మెసేజ్?

Update: 2016-08-15 07:04 GMT
గ్యాంగ్ స్టర్ నయింకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఎన్నో ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అతడి ఎన్ కౌంటర్ తర్వాత అతడెంత దారుణంగా వ్యవహరిస్తాడు? అతడి నేర చరిత్ర ఎంత భీకరమైందన్న విషయాన్ని తెలుసుకున్న వారంతా జడుసుకునే పరిస్థితి. మొనగాళ్లు లాంటి నేతల్ని సైతం.. వణుకు పుట్టేలా వ్యవహరించటం.. కోట్లాది రూపాయిలున్న వారిని బెదిరించిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. నయిం వార్నింగ్ లు ఎలా ఉంటాయి? అతడు టార్గెట్ చేసిన ప్రముఖులకు సంబందించిన వివరాలు ఇప్పుడు రాజకీయ.. పోలీస్ .. మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా నయిం అసలు స్వరూపాన్ని కళ్లకు కట్టినట్లు చెప్పే ఒక వాట్సప్ మెసేజ్ అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. ఎన్నారై శ్రీధర్ పేరిట అతగాడు పెట్టిన ఈ పోస్టింగ్ లో నిజం మాట సంగతి తెలీదు కానీ.. అతడు చెబుతున్న విషయాల్ని చూస్తే.. నిజంగానే జరిగిందన్నట్లుగా ఉండటం గమనార్హం. తనను బెదిరించటమే కాదు.. నేరుగా నయిం దగ్గరకు తీసుకెళ్లి.. ఆయనే నేరుగా తనకు ఎలా వార్నింగ్ ఇచ్చింది.. తాను డబ్బులు ఇవ్వనన్నా.. అతగాడు తన దగ్గర ఎలా వసూలు చేసింది లాంటి విషయాల్ని పూసగుచ్చినట్లుగా చెప్పుకొచ్చిన వాట్సప్ మెసేజ్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ వాట్సప్ మేసేజ్ విశ్వసనీయతను పక్కన పెడితే.. ఇందులోని కంటెంట్ మాత్రం నయిం నేర చరిత్రను కళ్లకు కట్టినట్లుగా చూపిస్తుందనటంలో సందేహం లేదని చెప్పాలి.ఇక.. వాట్సప్ మెసేజ్ లోకి వెళితే..

భువనగిరిలోని నయిం ప్రధాన అనుచరుడు పాశం శ్రీను తనకు ఫోన్ చేసి భాయ్ కలవాలని చెప్పాడంటూ శ్రీధర్ డోగిపర్తి పేర్కొన్నారు. ఇక.. మెసేజ్ ను అతని రాతల్లోనే చూస్తే..

ఈ ఏడాది జనవరి 29న ఉదయం వేళ.. భువనగిరిలో సాయిబాబా ఆలయం వద్ద వెహికిల్ లో ఎక్కించుకున్నారు. ఆ కారులో పాశం శ్రీను.. డ్రైవర్ కత్తుల జంగయ్య.. భువనగిరి జెడ్పీటీసీలు ఉన్నారు. నా సెల్ ఫోన్ తీసేసుకున్నారు. నా దగ్గర ఆయుధాలు ఏమైనా ఉన్నాయా? అని చెక్ చేశారు. తర్వాత సాయిబాబా గుడి.. అయ్యప్ప.. ఎల్లమ్మ గుళ్ల వద్ద పూజలు చేసిన తర్వాత తుక్కుగూడకు తీసుకెళ్లారు. అక్కడే మరో వెహికిల్ లోకి మార్చారు.

తర్వాత కళ్లు మూసేశారు. అరగంటల తర్వాత కళ్లు తెరవమన్నారు. కళ్లు తెరిచి చూస్తే.. ఒక పెద్ద గెస్ట్ హౌస్ లోకి తీసుకెళ్లారు. అక్కడ ఏకే47 ఉన్న ఇద్దరు గన్ మెన్లు చెక్ చేసి నయిం ఉన్న గది వద్దకు తీసుకెళ్లారు. అలా భాయ్ నయిం దర్శనం కలిగింది. నన్ను గుర్తు పట్టావా? అని అడిగాడునయిం. ‘గుర్తుపట్టాను. 28 ఏళ్ల కిందట మా నాన్న దగ్గరకు వచ్చారు కదా’’ అని నేను బదులిచ్చాను. ఎలా ఉన్నాడు మీ నాన్న అని నయిం అడిగాడు. చనిపోయి ఐదేళ్లు అయ్యింది కదా అని బదులిచ్చాను.

దీనికి బదులిచ్చిన నయిం.. ‘‘మీ నాన్న చాలా ధైర్యవంతుడు. అప్పట్లో నేను స్టూడెంట్ లీడర్ గా ఉన్నప్పుడు భయపెట్టే ప్రయత్నం చేసినా భయపడలేదు’’ అని చెప్పాడు. కాసేపు మా మధ్య మామూలు సంభాషణ జరిగింది. తర్వాత పాయింట్ లోకి వచ్చేశాడు. తాను నక్సలైట్లమీద పోరాటం చేస్తున్నని.. నక్సల్స్ ను చంపటం తనకు వ్యసనమని.. అందుకోసం డబ్బు కావాలని చెప్పాడు. రూ.రెండు కోట్లు ఇవ్వాలన్నాడు.

రెండు కోట్లు అంటే ఏమైనా జోక్ చేస్తున్నావా? అని ప్రశ్నించాను. దానికి బదులిచ్చిన నయిం.. నేను జోక్ చేసినట్లు కనిపిస్తోందా? నీకు సీరియస్ నెస్ కనిపించటం లేదా? అంటూ తాను ఎవరెవరిని చంపిందన్న విషయాన్ని చెప్పుకొచ్చి భయపెట్టే ప్రయత్నం చేశాడు. అది విన్న తర్వాత నేను అంత డబ్బు ఇవ్వలేనని చెప్పాను. డబ్బులు ఇవ్వొద్దు.. వెళ్లి  పో.. కాకుంటే మీ వాళ్లు ఎక్కడ ఉంటారో నాకు తెలుసు. మీ బావ కారుకు యాక్సిడెంట్ అవుతుంది. మామూలు ప్రమాదమని మీరు అనుకుంటారు. కానీ.. నేనే చేయించానని ఫోన్ చేస్తా. నాకు మేకనుకోసినా.. కోడిని కోసినా.. మనిషిని కోసినా ఒక్కటే. నీ దగ్గర ఎంత ఉందో నాకు తెలుసు. చచ్చేటప్పుడు ఏం తీసుకుపోతావ్? ఏదీ నీతో రాదని బెదిరించాడు.

అదంతా విన్న తర్వాత రూ.10లక్షలు ఇస్తానన్నా. పది పైసలు ఇస్తావా.. దాని కోసం ఇంత స్కెచ్ వేయాలా? నువ్వు కావాలంటే రూ.రెండు కోట్లు ఇవ్వొచ్చు. కానీ.. రూ.50 లక్షలు ఫైనల్ అని తేల్చేశాడు. మిడిల్ క్లాస్ వాళ్లను ఎందుకలా ఇబ్బంది పెడతావు అని ప్రశ్నించా. దానికి బదులిచ్చిన నయిం.. నాకు నీతో స్నేహం చేయాలని ఉంది. నాతో ఉట్టిగా ఫ్రెండ్ షిప్ చేయమంటే చేయవు కదా. నీకు నష్టం జరిగితే.. ఆ నష్టం భాయ్ తో జరిగితే.. దాన్ని భర్తీ చేసుకోవటానికి స్నేహం చేద్దామనుకుంటావన్నాడు. ఇది జరిగిన తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 20న అమ్మతో కలిసి వెళ్లి పాశం శ్రీను ఇంటికి వెళ్లి రూ.50లక్షలు ఇచ్చి వచ్చానంటూ వాట్సప్ మెసేజ్ లో ఉంది. ఇదే అంశం ఒక ప్రముఖ మీడియా సంస్థలోనూ రావటం గమనార్హం.
Tags:    

Similar News