ఆ విష‌యంలో ఎన్టీఆర్ ఫెయిల్‌.. మ‌రి జ‌గ‌న్ పాస్ అవుతారా?

Update: 2021-08-23 13:30 GMT
రాజ‌కీయాలు మ‌హా విచిత్ర‌మైన‌వి. నాయ‌కుల వైఖ‌రి అంత‌కంటే చిత్ర‌మైంది. ప‌ద‌వి ద‌క్కించుకునేందుకు నేత‌లు దేనికైనా వెన‌కాడరు. ఇక ఆ ప‌ద‌విని కాపాడుకునేందుకు ఎంత‌కైనా తెగిస్తారు. ఏదైనా తేడా జ‌రిగి ప‌ద‌వి చేజారిందా.. త‌మ‌కు రాజ‌కీయ జ‌న్మ‌నిచ్చిన పార్టీనే లెక్క‌చేయ‌రు. దేశ రాజకీయ చ‌రిత్ర‌లో ఇలాంటి సంఘ‌ట‌ను చాలా సార్లు జ‌రిగాయి. తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల్లోనూ ఇలాంటి దృశ్యాలు క‌నిపించాయి.

ఆనాడు దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావుకు ఎదురైన సంఘ‌ట‌న ఇలాంటిదే. ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి విష‌యంలోనే అలాంటి ప‌రిస్థితి ఎదుర‌వుతుందేమోన‌న్న అనుమానాలు ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరంద‌కుంటున్నాయి. మ‌రి అప్ప‌ట్లో ఎన్టీఆర్‌కు ఎలాంటి అనుభ‌వం ఎదురైంది.. ఇప్పుడు జ‌గ‌న్ విష‌యంలో ఏం జ‌రుగుతుంద‌ని అనుకుంటున్నారు?

త‌న‌దైన అద్భుత న‌ట‌న‌తో తెలుగు ప్ర‌జ‌ల హృద‌యాల్లో చోటు ద‌క్కించుకున్న ఎన్టీఆర్‌.. అదే అభిమాన బ‌లాన్ని నమ్ముకుని 1982లో తెలుగు దేశం పార్టీ స్థాపించి తొమ్మ‌ది నెల‌ల్లోనే అధికారంలోకి వ‌చ్చారు.  పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోలోనే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యి రికార్డు సృష్టించారు. అప్ప‌ట్లో దేశంలో ఏక‌చ్ఛాద్రిప‌త్యం చ‌లాయించిన కాంగ్రెస్‌కు పోటీగా నిలిచి పార్టీని గెలిపించుకుని స‌రికొత్త చ‌రిత్ర సృష్టించారు.

ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యిన రెండు సంవత్సరాల తరువాత 1985 లో నాదెండ్ల భాస్క‌ర్‌రావు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి పార్టీ ని చీల్చి అప్పటి కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మద్దతుతో  తెలుగు దేశం పార్టీలో త‌న వ‌ర్గం నాయ‌కుల అండ‌తో నాదెండ్ల భాస్క‌ర్‌రావు ముఖ్య‌మంత్రి అయ్యారు. అప్పుడు వైద్య‌చికిత్స‌ల కోసం యుఎస్‌లో ఉన్న ఎన్టీఆర్ తిరిగి దేశానికి వ‌చ్చి ధ‌ర్మ యుద్ధం పేరుతో ఉద్య‌మానికి తెర‌దీసి తిరిగి సీఏం ప‌ద‌విలో కూర్చున్నారు.  ఈ త‌ర్వాతి ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న పార్టీ ఘ‌న విజ‌యం సాధించింది.

అయితే అధ‌కారం చేప‌ట్టిన త‌ర్వాత కొన్ని రోజుల‌కు స‌న్నిహితులు ఇచ్చిన స‌ల‌హా మేర‌కు మంత్రివ‌ర్గంలో భారీ మార్పులు చేశారు. ఒక్క‌సారిగా 30 మంది మంత్రుల‌ను మార్చారు. అందులో జానారెడ్డి లాంటి ముఖ్య నేత‌లూ ఉన్నారు. ఈ సంఘ‌ట‌న‌తో ప‌ద‌వి కోల్పోయిన మంత్రుల‌కు ఎన్టీఆర్‌పై కోపం పెరిగింది. దీంతో పార్టీలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు ఎక్కువ‌య్యాయి. దీంతో 1989 ఎన్నిక‌ల్లో టీడీపీ ఓడిపోయింది. ఈ ఓట‌మికి ప‌ద‌వుల నుంచి దిగిపోయిన మంత్రులే కార‌ణ‌మ‌ని అభిప్రాయాలు వినిపించాయి.

ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి తిరుగులేని మెజార్టీ ఉంది. 2019 ఎన్నిక‌ల్లో ఆ పార్టీ తిరుగులేని విజ‌యం సాధించింది. అయితే అప్పుడు అధికారం చేప‌ట్టిన జ‌గ‌న్‌.. రెండున్న‌రేళ్ల పాల‌న ముగిశాక మంత్రివ‌ర్గ‌లో మార్పులు ఉంట‌యాని అప్పుడే ప్ర‌క‌టించారు. అంద‌రికీ స‌మ‌న్యాయం ద‌క్కాల‌ని, ప‌ని చేయ‌ని మంత్రుల‌పై వేటు త‌గ్గ‌ద‌ని అప్పుడే హెచ్చ‌రించారు. ఈ నేప‌థ్యంలో మ‌రో మూడు నెల‌ల్లో జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి రెండున్న‌రేళ్లు పూర్తి కానున్నాయి. ఈ నేప‌థ్యంలో మంత్రివ‌ర్గంలో కీలక‌మైన మార్పులు జ‌ర‌గ‌నున్నట్లు జోరుగా చ‌ర్చ సాగుతోంది.  

మంత్రి ప‌ద‌విపై ఆశలు పెట్టుకున్న వాళ్లు చాలా మంది ఉన్నారు.  దీంతో ఇప్ప‌టికే మంత్రులుగా ఉన్న‌వాళ్ల‌లో ఆందోళ‌న మొద‌లైంద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుత‌మున్న మంత్ర‌వ‌ర్గంలో దాదాపు 70 నుంచి 80 శాతం మంత్రుల‌ను తీసేసి ఆ స్థానాల్లో కొత్త‌వాళ్ల‌ను తీసుకుంటార‌నే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఒక‌వేళ ఈ ప్ర‌చార‌మే నిజ‌మైతే.. బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి లాంటి సీనియ‌ర్ల‌పై వేటు ప‌డుతుంద‌నే ఊహాగానాలు వినిపిస్తాయి. ఒక‌వేళ  ఇలాంటి సీనియ‌ర్ మంత్రుల‌పై వేటు ప‌డితే అది పార్టీపై పెను ప్రభావం చూపుతంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

ఈ సీనియ‌ర్ మంత్రులు చేతుల్లో ఆయా జిల్లాలున్నాయి. ఆ జిల్లాల్లో పెత్త‌న‌మంతే వీళ్ల‌దే. దీంతో వీళ్ల‌ను మంత్రి ప‌ద‌వుల నుంచి తొల‌గిస్తే వ‌చ్చే ఎన్నికల్లో వాళ్లు పార్టీ విజ‌యం కోసం ప‌నిచేస్తారా? వాళ్లు ఆస‌క్తి చూపిస్తారా? అనే ప్ర‌శ్న‌లు రేకెత్తే అవ‌కాశం ఉంది. మ‌రోవైపు మంత్రి ప‌ద‌వులు పోయాయ‌నే విష‌యాన్ని చూపి ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లోని టీడీపీ నాయ‌కులు ఈ వైసీపీ నేత‌ల‌ను టార్గెట్ చేసే ఆస్కారం ఉంటుంది.

దీంతో వైసీపీకి చాలా ఇబ్బంది ఎదుర‌య్యే ప్ర‌మాదం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌ద‌వులు పోయిన మంత్రులు పార్టీకి వ్య‌తిరేకంగా మారే ప్ర‌మాదం లేక‌పోలేదు. గ‌త ఎన్నిక‌ల్లో అంటే జ‌గ‌న్ హ‌వా న‌డిచింది కాబ‌ట్టి అధికారం ద‌క్కింది. కానీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో అలాంటి ప‌రిస్థితి ఉంటుంద‌నే న‌మ్మ‌కం లేదు. ఇప్ప‌టికే అధికార ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌నే అభిప్రాయాలున్నాయి.

ఈ నేప‌థ్యంలో మంత్రివ‌ర్గంలో నుంచి సీనియ‌ర్ నేత‌ల‌కు ఉద్వాస‌న ప‌లికితే అది వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ ఫ‌లితంపై ప్ర‌భావం చూప‌నుంది.  పార్టీలో గంద‌ర‌గోళ ప‌రిస్థితులు ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి ఆనాడూ మంత్రివ‌ర్గంలో మార్పుల‌తో దెబ్బ‌తిన్న ఎన్టీఆర్‌లా.. ఇప్పుడు జ‌గ‌న్ కూడా ఓట‌మి చెందుతారా? లేదా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి పార్టీ నేత‌ల్లో అస‌మ్మ‌తి చెల‌రేగ‌కుండా చూసుకుంటారా? అనేది తేలాలంటే మ‌రికొంత కాలం ఆగాల్సిందే.

గమనిక: పాఠకులే దేవుళ్లు.. వారి సలహాలు, సూచనలు విలువైనవి.. మా ఆర్టికల్ చదివిన తర్వాత మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి.. కింద కామెంట్స్ బాక్స్ లో షేర్ చేయండి.. మీ ఆలోచనలకు మేం అక్షర రూపాన్ని ఇస్తాం..
Tags:    

Similar News