జ‌గ‌న్‌పై అస‌భ్య పోస్టు!..యువ‌కుడిపై కేసు!

Update: 2017-12-31 09:25 GMT
ఏపీలో విప‌క్ష నేత‌, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై అధికార టీడీపీ అనుకూల మీడియాతో పాటుగా సోష‌ల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున అస‌భ్య‌క‌ర‌మైన పోస్టులు వ‌స్తున్నాయి. టీడీపీ నేత‌లైతే... నోటికి ఎంత మాట వ‌స్తే అంత మాట అనేస్తున్నారు. ఈ వ్యాఖ్య‌ల‌పై వైసీపీ నేత‌లు ఏమాత్రం కాస్తంత ఘాటుగా స్పందించినా... టీడీపీ దండు గంగ వెర్రులెత్తుతోన్న వైనం తెలియ‌నిదేమీ కాదు. త‌మ పార్టీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడిపై చిన్న మాట అన్నా విల‌విల్లాడిపోయే టీడీపీ నేత‌లు... విప‌క్ష నేత హోదాలో ఉన్న జ‌గ‌న్ ను మాత్రం నోటికి ఇచ్చిన‌ట్లు మాట్లాడ‌రడాన్న విష‌యం అస్స‌లు గుర్తుకు రావ‌డం లేని వైనం నిజంగా ఆశ్చ‌ర్య‌క‌ర‌మేన‌ని చెప్పాలి.

స‌రే... ఎలాగూ పొలిటీషియ‌న్లుగా వారిని ఎవ‌రూ ఆప‌లేరు గానీ... జ‌గ‌న్‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున వస్తున్న అస‌భ్య‌క‌ర పోస్టుల‌పై ఏమాత్రం స్పందించని పోలీసులు... టీడీపీ నేత‌లు ప్ర‌త్యేకించి చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు నారా లోకేశ్ పై అదే సోష‌ల్ మీడియాలో క‌నిపించే పోస్టుల‌పై మాత్రం త‌క్ష‌ణ‌మే స్పందిస్తున్నారు. కేవ‌లం సింగిల్ కంప్లైంట్ వ‌చ్చిందంటే చాలు... బాబు - చిన‌బాబుపై అస‌భ్య‌క‌ర పోస్టులు పెట్టిన వారిని ఏకంగా అరెస్ట్ చేస్తూ చుక్క‌లు చూపిస్తున్నారు. ఈ త‌ర‌హా వ్య‌వ‌హారంపై ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా... పోలీసులు ప‌ట్టించుకున్న పాపాన పోలేద‌న్న వాద‌న లేక‌పోలేదు.

అయితే ప‌రిస్థితి మారిందో, లేదంటే ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్నాయ‌న్న భావ‌నో... తెలియ‌దు గానీ... వైఎస్ జ‌గ‌న్‌ పై సోష‌ల్ మీడియాలో పోస్ట్ అయిన ఓ అస‌భ్యక‌ర‌మైన పోస్టుపై ఏపీ పోలీసులు ఏకంగా కేసు న‌మోదు చేశారు. ఈ ఘ‌ట‌న కృష్ణా జిల్లా ప‌రిధిలో చోటుచేసుకుంది. ఆ ఘ‌ట‌న పూర్తి వివ‌రాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా మొవ్వ మండలం కోసూరుకు చెందిన పరుచూరి సురేష్ కుమార్... గ‌డ‌చిన కొద్ది రోజులుగా జగన్‌పై ఫేస్‌బుక్‌లో అసభ్యకరంగా పోస్టు పెట్టినట్లుగా తెలుస్తోంది. దీనిని సీరియస్‌గా తీసుకున్న పామర్రు వైసీపీ ఇంచార్జ్ అనిల్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు స్వీక‌ర‌ణ సంద‌ర్భంగానూ నాట‌కీయ ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి.

తొలుత అస‌లు ఫిర్యాదును స్వీక‌రించేందుకే పోలీసులు స‌సేమిరా అన్నార‌ట‌. అయితే పోలీసుల తీరుపై ఆగ్ర‌హం వ్యక్తం చేసిన వైసీపీ శ్రేణులు... పోలీస్ స్టేష‌న్ ముందు ఆందోళ‌న‌కు దిగ‌డంతో ఫిర్యాదు స్వీక‌ర‌ణ‌కు పోలీసులు స‌రేన‌న‌క త‌ప్ప‌లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. అనిల్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అతని ఫేస్‌ బుక్ అకౌంట్ ఆధారంగా దర్యాఫ్తు చేస్తున్నారు. త్వరలోనే సురేష్‌ ను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా జ‌గ‌న్‌పై అస‌భ్య‌క‌ర పోస్టులు పెట్టిన సురేశ్ క‌మార్‌ ను అరెస్ట్ చేస్తామ‌ని కూడా పోలీసులు చెప్పార‌ట‌.
Tags:    

Similar News