ఆస్తులు ప్రకటించిన ఒడిశా సీఎం.. ఏడాదిలో ఎంత పెరిగాయంటే?

Update: 2021-01-12 01:30 GMT
దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక్కొక్కరు ఒక్కోలాంటి తీరును ప్రదర్శిస్తుంటారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కాస్త భిన్నం. రాజకీయంగా ఆయన లో ప్రొఫైల్ మొయింటైన్ చేస్తుంటారు. అనవసరంగా హడావుడి ఉండదు. జాతీయ స్థాయిలో ఆయన ఎప్పుడు హాట్ టాపిక్ గా ఉండరు.కూల్ గా పాలన చేసుకుంటూ పోతారు. ఒడిశాలో ఆయనకు తిరుగులేదు. ఆయనరాజకీయ ప్రత్యర్థులు ఆయన్ను ఎదుర్కోలేని పరిస్థితి.

అలాంటి ఆయన తాజాగా తన ఆస్తుల లెక్కను ప్రకటించారు. 2020 మార్చి 31 నాటికి రూ.64.98 కోట్లుగా తేల్చారు. ఏడాది వ్యవధిలో తన ఆస్తులు రూ.71 లక్షల మేర పెరిగినట్లుగా వెల్లడించారు. భువనేశ్వర్.. ఢిల్లీ.. ఫరీదాబాద్ లలో తన తండ్రి కమ్ మాజీ సీఎం బిజు పట్నాయక్.. తల్లి ద్వారా లభించిన ఆస్తులు.. రచయితగా రాయల్టీ రూపంలో తనకు వచ్చిన ఆదాయం మొత్తం కలిపితే రూ.63కోట్లుగా తెలిపారు. లోకాయుక్తకు ఆ వివరాల్ని వెల్లడించారు.

నిజాయితీ కలిగిన ముఖ్యమంత్రిగా పేరున్న నవీన్ పట్నాయక్.. అత్యధిక కాలం విదేశాల్లోనే జీవితాన్ని గడిపారు. ఒడిశా రాజకీయాల్లోకి అడుగు పెట్టినప్పుడు..ఈ ‘విదేశీయుడ్ని’ ఒడిశా ప్రజలు ఆదరిస్తారా? అన్న సందేహం ఉండేది. తన యాసలోనూ.. భాషలోనూ విదేశీ వాసన కనిపిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తేవి. అయితే.. కమిట్ మెంట్.. అంతకు మించిన నిజాయితీ ఆయనకు ఆభరణంగా మారి.. ఒడిశాలో తిరుగులేని రాజకీయ నేతగా మారారు. బ్రహ్మచారిగా జీవితాన్ని గడిపే ఆయన.. దేశంలోని నిజాయితీ ముఖ్యమంత్రుల్లో ముందువరుసలో నిలుస్తారు.

ఆయన ఆస్తుల్లో అత్యధిక విలువ ఉన్న ఆస్తి.. ఢిల్లీలోని తన తల్లి నివాసంలోని వాటా. న్యూఢిల్లీలోని అబ్దుల్ కలాం రోడ్డులో ఉన్న ఈ భవనంలోని ఆయన వాటా రూ.43 కోట్లుగా చెబుతారు. ఫరీదాబాద్ లోని టిక్రీఖేరా గ్రామంలో 22.7 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.దాని విలువ రూ.10కోట్లు. ఇలా చూసినప్పుడు రాజకీయంగా ఆయన సంపాదించింది ఏమీ లేదనే చెప్పాలి. గడిచిన రెండు దశాబ్దాలుగా ఒడిశాలో తిరుగులేని అధినేతగా ఉన్న నవీన్ కు.. సమీప భవిష్యత్తులో ఇబ్బంది లేదంటున్నారు.

ఇదిలా ఉంటే.. టీడీపీ అధినేత.. ఏపీ విపక్ష నేత చంద్రబాబు ప్రతి ఏడాది తమ కుటుంబ సభ్యులు ఆస్తుల ప్రకటనను చేస్తుంటారు. విపక్ష నేతగా ఉన్నఆయన ఈసారి ఆ విషయాన్ని వదిలేసినట్లుగా కనిపిస్తుందే. గతంలో ప్రతి ఏడాది తన ఆస్తుల వివరాల్ని వెల్లడించటం.. దాని మీద పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తటం ఉండేది. ఈసారి అందుకు భిన్నంగా ఆయన.. తమ ఆస్తుల వివరాల్ని వెల్లడించలేదు. కరోనా హడావుడిలో ఈ విషయమే మీడియాకు పట్టలేదు. ఒడిశా సీఎం ఆస్తుల వెల్లడితో బాబు ప్రతి ఏటా చేసినట్లుగా ఆస్తుల్ని ఎందుకు వెల్లడించలేదన్న అనుమానం వచ్చే పరిస్థితి.
Tags:    

Similar News