ఆ నిర్ణయమే అటు రాష్ట్ర, ఇటు పార్టీ భవిష్యత్తును మార్చింది!

అవును... ఒక పాదయాత్ర రాష్ట్ర రాజకీయ చరిత్రను మార్చేసింది. ఉచ్చనీచాలు మరిచిన నేతల నుంచి అవమానాలు ఎదుర్కొన్న యువనేతను నాయకుడిని చేసింది.

Update: 2024-12-18 12:53 GMT

అద్భుతాలు జరిగే ముందు ఎవరూ గుర్తించరు.. జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదు అని అంటారు. గత ఏడాది జనవరి 27న కుప్పం నుంచి నారా లోకేష్ యువగళం యాత్ర ప్రారంభమైనప్పుడు చాలా మంది ఇది అద్భుత భవిష్యత్తుకు నాంది అని గుర్తించనివారు ఉన్నారని అంటారు. అవహేళన చేసినవారి సంఖ్యా ఎక్కువేనని చెబుతారు.

అయితే చాలా మంది అంచనాలకు ఏమాత్రం అందకుండా.. ప్రకాశవంతమైన రేపటి కోసం చీకటిని చీల్చుకుంటూ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర రాష్ట్ర రాజకీయ చరిత్రనే మార్చేసింది. అది అటు టీడీపీ భవిష్యత్తుతో పాటు రాష్ట్ర భవిష్యత్తు మార్పుకు కీలక నాంది అని చెప్పొచ్చు.

అవును... ఒక పాదయాత్ర రాష్ట్ర రాజకీయ చరిత్రను మార్చేసింది. ఉచ్చనీచాలు మరిచిన నేతల నుంచి అవమానాలు ఎదుర్కొన్న యువనేతను నాయకుడిని చేసింది.. టార్చ్ బేరర్ ని చేసింది! అటు తనను, ఇటు ప్రజలను వేధించిన పాలకులకు చరమగీతం పాడింది. ఫలితంగా అది ప్రజా విజయంగా మారింది.

ఆ యువగళంతో రాటు తేల్చిన నేతే.. నేడు యువ నాయకుడిగా పార్టీలోనూ, కీలక శాఖలకు మంత్రిగా అటు ప్రభుత్వంలోనూ కీలకంగా మారారు. ఈ నేపథ్యంలో యువగళం పూర్తై ఏడాది పూర్తి చేసుకుంటున్న వేళ.. నారా లోకేష్ ను పోరాట యోధుడిగా.. పార్టీ, రాష్ట్ర భవిష్యత్తును మార్చిన రాజకీయ యువ చాణక్యుడిగా పార్టీ గుర్తు చేసుకుంటుంది.

నాడు ప్రజా మద్దతుతో, ప్రజలు మమేకమవ్వడంతో మొదలైన యాత్రకు.. రోజులు గడిచేకొద్దీ, ముందుకు సాగే కొద్దీ ఆదరణ, స్పందన పెరిగింది. ఈ సమయంలో ప్రజ సమస్యలపై అవగాహన పెంచుకుంటూ.. ప్రజలు ఏమి కోరుకుంటున్నారో అవలోకనం చేసుకుంటూ.. నాటి ప్రభుత్వంపై ప్రజల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో గ్రహిస్తూ ముందుకు సాగారు.

ప్రజలతో మమేకం అవుతూ వారికి దగ్గరయ్యారు. యాత్ర సాగే కొద్దీ స్పందన పెరిగింది. ప్రజా సమస్యలపైన అవగాహన వచ్చింది. ప్రజలు ఏం కోరుకుంటున్నారో అర్దమైంది. ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఉందో గుర్తించారు. తమ పార్టీలో సమస్యలను తెలుసుకున్నారు. అదే ఎన్నికల్లో మేనిఫెస్టోతో పాటుగా అభ్యర్దుల ఖరారులో కీలకంగా మారింది.

కుప్పంలో ప్రారంభమైన ఈ యాత్ర 11 ఉమ్మడి జిల్లాలు, 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు, మున్సిపాలిటీలు, 2028 గ్రామాలు మీదుగా 226 రోజులు కొనసాగింది. ఆ సమయంలో మొదట్లో లోకేష్ యాత్రను లైట్ తీసుకున్నట్లు కనిపించిన పాలకులు.. రోజులు గడిచే కొద్ది ఈ యాత్రే తమకు చెక్ పెట్టబోతుందని గ్రహించారో ఏమో కానీ.. అడుగడుగునా అవరోధాలు సృష్టించారు.

అక్రమ కేసులు పెట్టి వేధించారు. అయినప్పటికీ, ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ, ప్రతీ రోజు సుమారు వెయ్యి నుంచి పదిహేను వందల మంది నాయకులు, కార్యకర్తలతో కలిసేవారు నారా లోకేష్. ఈ నేపథ్యంలోనే.. వారి దగ్గరకు వచ్చిన నాయకుల నుంచి క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలను తెలుసుకునేవారు. అన్ని వర్గాలతోనూ మమేకమయ్యేవారు.

ఇబ్బందులు పెట్టేకొద్ది రాటు తేలుతూ, మరింత మెరుపును సంతరించుకుంటూ అన్ని వర్గాలతోనూ లోకేష్ మమేకమయ్యారు. సమస్యలతో వచ్చిన వారికి "నేనున్నాను" అని భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టుతో సెప్టెంబర్ 9న పాదయాత్రకు విరామం ఇవ్వాల్సి వచ్చింది!

సంక్షోభ సమయంలోనే నాయకుడి సమర్ధత తెలుస్తుందని అంటారు. ఈ క్రమంలో తన తండ్రి, పార్టీ అధినేత అరెస్టై జైల్లో ఉన్న సమయంలో లోకేష్ పై పెద్ద బాధ్యతే పడింది. అటు బాబు అరెస్టుతో పార్టీలో అలజడి లేకుండా, కేడర్ లో అలసత్వం అలుముకోకుండా లోకేష్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని అంటారు.

తన తండ్రి కేసులో ఢిల్లీలో న్యాయ నిపుణులతో చర్చలు చేస్తూ, అదే సమయంలో గల్లీలోని ప్రతీ నాయకుడు, కార్యకర్తలో నిరాస నిస్పృహలు అలుముకోకుండా నడుచుకున్నారు. ఇదే సమయంలో పొత్తులపైనా అటు ఢిల్లీలో కసరత్తు మొదలైందని అంటారు. అది కూడా నేటి పరిస్థితులకు కీలక మలుపు అని అంటారు.

ఇక ఈ యువగళం పాదయాత్ర వేళ నారా లోకేష్ పై మొత్తం 25 కేసులు నమోదు అయ్యాయి! ఇదే సమయంలో సుమారు 40 మంది యువగళం వాలంటీర్లపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైలుకు పంపారు. విదేశాల్లో ఉన్నవారితో కలిసి 46 మందిపై తప్పుడు కేసులు పెట్టారు. ఇవన్నీ లోకేష్ ను కృంగదీయలేదు సరికదా.. ఆయనలో మరింత కసిని పెంచాయి.

ఈ సమయంలోనే రెడ్ బుక్ ఆలోచన చేశారని అంటారు. ఇందులో భాగంగా... నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తప్పవంటు హెచ్చరించారు. నాటి హెచ్చరికలనే నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత అమలుచేసి చూపిస్తున్నారు.

ఈ యువగళంలో మరో కీలక విషయం.. ప్రజల సమస్యలు వింటూ నిర్వహించిన సమావేశాలు! అవును... లోకేష్ యువగళంలో మొత్తం 70 బహిరంగ సభలు, 155 ముఖాముఖి సమావేశాలు, 12 ప్రత్యేక కార్యక్రమాలు, 8 రచ్చబండలు నిర్వహించి.. వీటిలో ప్రజల నుంచి వినతిపత్రాలు అందుకున్నారు. అనంతరం ఆగనంపూడి వద్ద యువగళం యాత్రను సరిగ్గా ఏడాది క్రితం ముగించారు.

వాస్తవానికి దేశంలో మరే ఇతర పార్టీకీ లేని సైన్యం తెలుగుదేశానికి ఉంది. ఈ నేపథ్యంలో కార్యకర్తలకు ఏమైనా చేయాలని భావించిన లోకేష్.. భీమా సౌకర్యం కల్పించారు! ఇక మంత్రిగా కీలకమైన విద్యాశాఖ బాధ్యతలు చూసుకుంటూ, సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అటు ప్రజా దర్బార్ లో కష్టం ఉందంటే వెంటనే స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో అన్నా అని పిలిస్తే నేనున్నా అని అంటున్నారు.

Tags:    

Similar News