త‌మిళుల్ని వ‌ణికిస్తున్న ఓక్కి!

Update: 2017-12-02 05:15 GMT
త‌మిళుల‌కు వ‌రుణ‌శాపం ఏమైనా వెంటాడుతుందా? అన్న సందేహం క‌లిగేలా ప‌రిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. గ‌డిచిన కొన్ని సంవ‌త్స‌రాలుగా వాన త‌మిళ‌నాడును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వ‌రుస వ‌ర్షాల‌తో త‌మిళుల‌కు చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. వ‌ర్ష విల‌యానికి త‌మిళులు వ‌ణికిపోతున్నారు.

తాజాగా త‌మిళ‌నాడును ఓక్కి తుఫాను వెంటాడి వేధిస్తోంది. దాని ధాటికి త‌ట్టుకోలేక ఇప్ప‌టికే ప‌లువురు మ‌ర‌ణించారు. భారీ ఆస్తి న‌ష్టం వాటిల్లింది. త‌మిళ‌నాడు.. కేర‌ళ‌లు కేంద్రంగా చేసుకొని చెల‌రేగిపోయిన ఓక్కి ధాటికి రెండు రాష్ట్రాలు వ‌ణికిపోయాయి. ఓక్కి విల‌యానికి క‌న్యాకుమారి చిగురుటాకులా వ‌ణికిపోయింది. జిల్లా మొత్తం దారుణంగా దెబ్బ తింది. ఒక్క క‌న్యాకుమారి జిల్లా మాత్ర‌మే కాదు తిరున‌ల్వేలి.. తూత్తుకూడి.. పుదుకొట్టో.. రామ‌నాథ‌పురం.. విరుదున‌గ‌ర్ జిల్లాలు తీవ్రంగా న‌ష్ట‌పోయాయి.

ఓక్కి తుఫాను కార‌ణంగా క‌న్యాకుమారి జిల్లా వ్యాప్తంగా దారుణ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. భారీగా పోటెత్తిన వ‌ర‌ద నీటితో ప‌లు ప్రాంతాలు మునిగిపోయాయి. సుమారు 3500 విద్యుత్ స్తంభాలు కూలిపోవ‌టంతో విద్యుత్ వ్య‌వ‌స్థ కుప్ప‌కూలింది. ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. క‌న్యాకుమారి - నాగ‌ర్ కోవిల్‌.. నాగ‌ర్ కోవిల్ - తిరునెల్వేలి జాతీయ ర‌వాణా నిలిచిపోయింది. ఈ మార్గాల్లో రైళ్ల రాక‌పోక‌ల్ని నిలిపేశారు. గ‌డిచిన ఆరు రోజులుగా విడ‌వ‌కుండా కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా దాదాపు ల‌క్ష ఎక‌రాలు ఎఫెక్ట్ అయిన‌ట్లుగా భావిస్తున్నారు. త‌మిళ‌నాడుతోపోలిస్తే కేర‌ళ‌లో తుఫాను దెబ్బ త‌క్కువే అయిన‌ప్ప‌టికీ.. న‌ష్టం ఎక్కువ‌గానే ఉందంటున్నారు.


Tags:    

Similar News