ఇటీవల జరిగిన ఓ పర్యటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఓ పెద్దావిడ నుదుటిపై ముద్దుపెట్టుకున్న ఫొటోపై పలువురు రకరకాల వక్రీకరణలు చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ క్రమంలో ఆ పెద్దమనిషి ఆప్యాయతతో చేసిన పనిని కొన్ని వర్గాలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అంతేకాకుండా మరింతగా దిగజారి సదరు పెద్దావిడపై సైతం కామెంట్లు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా ఆ మహిళ మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వయసు ఏంటో గుర్తుంచుకోవాలని కోరారు. తనకు ముగ్గురు కుమారులని అందులో ఒకడికి 45, మరొకడికి 40, ఇంకొకడికి 35 ఏళ్లున్నాయని తెలిపింది. అంత వయసున్న తనపై వక్రభాష్యాలు తీయడం ఏమిటని ప్రశ్నించింది.
నా బిడ్డలాంటి వ్యక్తి మా ఊరు వచ్చాడని చూడటానికి ఆప్యాయంగా వెళితే..దాన్ని కూడా రాజకీయం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది."ఇలాంటి రాజకీయం మాకు తెలియదు. మాకు ఎవరైనా ఒకటే. ఎన్నికల సమయంలో వేసేది ఒకే ఓటు. ఇవన్నీ మాకేం తెలుస్తాయి? ఏదే అనుకుంటూ ఊహించుకొని చెత్తమాటలు. చెత్త రాయద్దు, చెత్త మాటలు మాట్లాడవద్దు. చెత్తమాటలు రాశారా పాపం కట్టుకుపోతారు. వాస్తవం రాయండి" అంటూ విజ్ఞప్తి చేసింది. 'నా వయసు ఏంటో గుర్తుంచుకోండి. నన్ను అవమానకరంగా చూసిన వాడు తన వ్యక్తి తల్లిని అవమానించినట్లే. రాసిన వాడు నన్ను అవమానించినట్లు కాదు, వాడి తల్లిని, వాడి చెల్లిని, వాడి అక్కను అవమానించినట్లు అవుతుంది. రాసేటప్పుడు వయసును బట్టి రాయాలి మీరు. ఏదో చేతికి వచ్చేసిందని రాయకూడదు' అంటూ పెద్దావిడ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయాల కోసం సామాన్యులను సైతం వివాదాలలోకి లాగడం సరికాదని ఆ పెద్దమనిషి విజ్ఞప్తి చేసింది.