మరోసారి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. టైం డిసైడ్ చేశారుగా?

Update: 2021-06-02 11:30 GMT
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అన్నంతనే.. కరోనా సెకండ్ వేవ్ పీడకల ఒక్కసారిగా గుర్తుకు వచ్చి.. ఒళ్లు జలదరించేలా చేస్తుంది. అయితే.. కొద్ది నెలల్లోనే మరోసారి ‘ఐదు’ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల్ని నిర్వహించనున్నారు. వాస్తవానికి 2022 మార్చి నాటికి పంజాబ్.. ఉత్తరాఖండ్.. గోవా.. మణిపూర్ అసెంబ్లీ పదవీ కాలం ముగియనుంది. మేలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ పదవీ కాలం ముగుస్తుంది. తాజాగా ఒక మీడియా సంస్థకు ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) సుశీల్ చంద్ర వెల్లడించిన వివరాల్ని చూస్తే.. నాలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్ని ఒకే దఫా పూర్తి చేయాలన్న యోచనలో ఉన్నట్లు కనిపిస్తుంది.

అసెంబ్లీ పదవీ కాలం ముగియక ముందే ఎన్నికల్ని జరపటం.. విజేతల జాబితాను గవర్నర్ కు సమర్పించటం ఎన్నికల సంఘం ప్రధాన కర్తవ్యం అని పేర్కొన్న వైనం చూస్తే..  వచ్చే ఏడాది మొదటి రెండు నెలల్లోనే ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కరోనా వేళ నిర్వహించిన ఎన్నికలు.. తగినంత అనుభవాన్ని ఇచ్చినట్లుగా సుశీల్ చంద్ర పేర్కొన్నారు. కరోనా మహమ్మారి త్వరలోనే అదుపులోకి వస్తుందన్న నమ్మకం తమకుందని.. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్ని కచ్ఛితంగా షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తామని ఆయన చెప్పారు.

ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ (పశ్చిమ బెంగాల్.. తమిళనాడు.. కేరళ.. అసోం.. పుదుచ్చేరి) ఎన్నికల వేళ.. ఎన్నికల సంఘం దారుణంగా ఫెయిల్ అయ్యిందని.. కరోనా కేసులు భారీగా పెరగటానికి.. సుదీర్ఘ షెడ్యూల్ కారణమన్న విమర్శలు వెల్లువెత్తాయి. కరోనా కేసుల నేపథ్యంలో అప్పటికప్పుడు పరిమితులు విధించిన ఈసీ తీరును పలువురు తప్పు పట్టారు. అయితే.. ఈసీ మాత్రం తాను ఎన్నికల్ని సమర్థంగా నిర్వహిస్తున్నట్లుగా పేర్కొంది. పోలింగ్ కేంద్రాల్ని భారీగా పెంచామని.. పలు జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పుకుంది. ఏది ఏమైనా.. మరో ఆరేడు నెలల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీకి జరిగే ఎన్నికలు.. వాటి ఫలితాలు దేశ రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని చెప్పక తప్పదు.
Tags:    

Similar News