మోడీజీ.. వార్నింగ్ బెల్స్ మోగుతున్నాయ్

Update: 2016-11-21 16:28 GMT
అత్యున్నత న్యాయస్థానం చెప్పింది జరగబోతుందా? నోట్లరద్దు నేపథ్యంలో జాతి జనుల మనోభావాలు ఎలా ఉన్నాయన్న విషయాన్ని ఒక్క లైనులో చెప్పేసిన సుప్రీంకోర్టు.. కేంద్రాన్ని తన మాటతో అలెర్ట్ చేసిందని చెప్పాలి. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో డబ్బుల కోసం తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న ప్రజలు.. తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్న విషయాన్ని ప్రస్తావించారు. అయితే.. సుప్రీంకోర్టు చెప్పినంత సీరియస్ గా ఎలాంటి ఘటన నిన్నటి వరకూ చోటు చేసుకోలేదు.

తాజాగా మాత్రం ఆ తరహా ఘటనలు చోటు చేసుకునే ప్రమాదం ఉందన్న సంకేతాలు ఇచ్చేలా ఒక ఘటన చోటు చేసుకుంది. డబ్బుల్ని డ్రా చేసుకునేందుకు.. విత్ డ్రా చేసుకునేందుకు బ్యాంకుల వద్ద క్యూలో నిలుచున్న వారిలో కొందరు గుండెపోటుకు గురై.. చనిపోవటం తెలిసిందే. విపక్షాల అంచనాల ప్రకారం.. నోట్ల రద్దు నిర్ణయం కారణంగా దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ 40 మంది వరకూ మరణించినట్లుగా చెప్పుకొచ్చారు. ఇందులో.. క్యూలైన్లో నిలుచొని అనారోగ్యంతో మరణించిన వారితోపాటు.. డబ్బులు అందవన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడిన వారూ ఉన్నారు.

అయితే.. ఇందుకు భిన్నంగా ఉత్తరప్రదేశ్ లో ఒక ఘటన చోటు చేసుకుంది. డబ్బుల కోసం బ్యాంకు వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో ఒక వ్యక్తి మరణించారు. దేవరియా ప్రాంతంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచివద్ద పాత నోట్లను కొత్తనోట్లుగా మార్చుకోవటానికి.. కొత్త నోట్లను డ్రా చేసుకోవటానికి పెద్ద క్యూ ఏర్పడింది. గంటలు గడుస్తున్నా క్యూ లైన్ మాత్రం తగ్గని పరిస్థితి.

అంతలో ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారి తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో ఒక వ్యక్తి మరణించారు. చనిపోయిన వ్యక్తి వివరాలు బయటకు రాలేదు. తొక్కిసలాటలో కొందరు గాయపడినట్లుగా చెబుతున్నా.. ఆ వివరాలు కూడా బయటకు రాలేదు. ఏమైనా.. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ప్రధాని మీద ఉంది. ఇప్పటికే.. బ్యాంకుల వద్ద డబ్బుల కోసం వెయిట్ చేస్తున్న ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీన్ని యుద్ధప్రాతిపదికన తగ్గించాల్సిన అవసరం మోడీపై ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News