భారత్‌ లో మరొకరు మృతి - పంజాబ్‌ లో నాలుగో కరోనా మరణం!!

Update: 2020-03-19 15:30 GMT
కరోనా మహమ్మారి మన దేశంలో నాలుగో ప్రాణం తీసింది. తొలుత కర్ణాటక - ఆ తర్వాత ఢిల్లీ - మహారాష్ట్రలలో ఒక్కొక్కరు చొప్పున ఈ వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు. తాజాగా, గురువారం పంజాబ్ రాష్ట్రంలో ఓ వృద్ధుడు మరణించాడు. అతని వయస్సు 70 సంవత్సరాలు. దీంతో కరోనా కారణంగా భారత్‌లో మృతి చెందిన వారి సంఖ్య నాలుగుకు చేరుకుంది.

మృతుడు పదిహేను రోజుల క్రితం జర్మనీ నుండి ఇటలీ మీదుగా భారత్‌ కు వచ్చాడు. పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ వచ్చింది. దీంతో పంజాబ్‌ లోని బంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తీవ్రమైన ఛాతి నొప్పితో అతను మృతి చెందినట్లుగా వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అతనికి డయాబెటీస్ - బీపీ ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఆయనకు చికిత్స అందించిన డాక్టర్ - అతడి బంధువులు - స్నేహితులను క్వారంటైన్‌ లో ఉంచారు. ఆయన బుధవారం మరణించినప్పటికీ - గురువారం ఆయన శాంపిల్స్ పాజిటివ్ అని తేలింది. కాగా, ఇండియాలో కరోనా కేసుల సంఖ్య 173కు చేరుకుంది. చండీగఢ్ - ఛత్తీస్‌ గఢ్ రాష్ట్రాల్లో ఒక్కరోజులోనే కొత్తగా పద్దెనిమిది కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా 9300 మందికి పైగా మృతి చెందారు. 2.27 వేల మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. భారత్‌ లో కేసుల సంఖ్య గత మూడు రోజుల్లోనే డెబ్బైకి పైగా చేరుకున్నాయి.


Tags:    

Similar News