జీఎస్టీకి ఏడాది...ఆఖ‌రికి మిగిలింది ఇదే

Update: 2018-06-30 04:42 GMT
దశాబ్దకాలం పాటు చర్చోపచర్చలు...ఎన్నో బేధాభిప్రాయాలు....రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల త‌ర్వాత ఎట్ట‌కేల‌కు అమలులోకి వచ్చినవస్తు - సేవల పన్ను (జీఎస్టీ) అమలుకు నేటితో ఏడాది పూర్తయింది. ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో వచ్చిన జీఎస్టీకి ఏడాది తర్వాత కూడా బాలరిష్టాలు తొలగిపోలేదు.  పైపెచ్చు సవాళ్లు రోజురోజుకి పెరుగుతున్నాయి. గత ఏడాది కాలంలో జీఎస్టీ అనుభవాలు మిశ్రమంగా ఉన్నాయని చెప్ప‌డం కంటే..సామాన్యుల‌కు చేదునే మిగిల్చాయ‌డ‌నం క‌రెక్ట్ అవుతుందేమో. ఎందుకంటే జీఎస్టీ సాఫీగా అమలైన దాఖలాలు లేవు. ఇప్పటికే వస్తువులు - సేవల స్లాబులు అనేక సార్లు మార్పులు చేర్పులు జరిగాయి. జీఎస్టీ అమలవుతున్న తొలిరోజుల్లోనే దేశ ఆర్థిక వృద్ధిరేటు మందగించింది. పెద్ద కంపెనీలు జీఎస్టీని సానుకూలంగా మార్చుకున్నప్పటికీ సూక్ష్మ చిన్న - మధ్య తరహా పరిశ్రమలు - చిన్న చిన్న ట్రేడర్లు మాత్రం కొత్త పన్ను వ్యవస్థలో ఇప్పటికీ ఇమడలేకపోతున్నారు. చాలా మంది చిన్న ట్రేడర్లు పెద్ద తయారీ కంపెనీలకు సప్లయర్స్‌గా పనిచేస్తుండటంతో వారి సప్లయ్ చైన్ దెబ్బతిన్నది. దీంతో అమ్మకాలు తగ్గాయి. త‌ద్వారా వారిలో తీవ్ర నిరాశ మొద‌లైంది.

మ‌రోవైపు గత ఏడాది కాలంలో చిన్న ట్రేడర్లు - ఎగుమతి దారులకైతే గడ్డుకాలంగానే గడిచింది. జీఎస్టీ రిఫండ్లు ఆలస్యం కావడంతో వ్యాపారులు విల‌విలాడిపోతున్నారు. ఎగుమతిదారుల పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది. చిన్న చిన్న పొరపాట్లకు కూడా రిఫండ్లను పొందలేకపోతున్నారు. ఎగుమతి దారుల సమస్య తీర్చేందుకు ఈ-వ్యాలెట్ వ్యవస్థ కూడా ఇప్పటికీ ఇంకా పూర్తి స్థాయి అమలుకు నోచుకోలేదు. అక్టోబర్ నాటికి తప్పని సరిగా అమలు చేయాలని ప్రభుత్వం గడువును విధించింది. ఇదిలాఉండగా - ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండానే జీఎస్టీని అమలు చేశారనేదానికి జీఎస్టీ పోర్టల్ పెద్ద సాక్ష్యం. జీఎస్టీ రిటర్న్‌లను దాఖలు చేయడంలో పోర్టల్ సృష్టించిన సమస్యలతో అనేక సందర్భాలలో ప్రభుత్వం గడువులను పొడిగించిన సందర్భాలున్నాయి. కేవలం సాంకేతిక అవరోధాల కారణంగానే ప్రభుత్వం ఆదాయంపై అనిశ్చితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సమస్యలన్నీ సమసి పోయి 2018-19 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి రూ. 7.44 లక్షల కోట్ల ఆదాయం జీఎస్టీ వసూళ్ల ద్వారానే వస్తుందన్న లక్ష్యాన్ని బడ్జెట్‌ లో నిర్దేశించారు. అయితే, ఈఏడాది తొలి రెండు నెలల కాలంలో సగటున రూ. 97,000 కోట్ల ఆదాయం మాత్రమే పొందగలిగింది. మేలో దాదాపు 9 శాతం మేర జీఎస్టీ ఆదాయం తగ్గింది. అంతకు ముందు ఏప్రిల్‌లో మాత్రం రికార్డు స్థాయి లో రూ. 1.04 లక్షల కోట్ల ఆదాయాన్ని పొందింది.

ఇదిలాఉండ‌గా...ఈ-వే బిల్లు అమలుతో జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరుగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తున్నా - ప్రయోజనాలు పరిమితంగానే వుండే అవకాశం వున్నదని ఆర్థిక శాఖ అధికారి ఒకరు అభిప్రాయపడుతున్నారు. ఈ-వే బిల్లు అమలు తర్వాత మే లో కేవలం రూ. 94,000 కోట్ల వసూళ్లు జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. జీఎస్టీ ఎగవేతలను అరికట్టడం ద్వారా సగటున నెలకు కనీసం లక్ష కోట్ల రూపాయల జీఎస్టీ వసూళ్లను చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. యాంటీ ప్రాఫిటీరింగ్ చట్టం అమలు ద్వారా జీఎస్టీ ఎగవేతలను అరికట్టవచ్చునని ప్రభుత్వం భావిస్తున్నది. జీఎస్టీ రిటర్న్ దాఖలు వ్యవస్థను మరింత సులభతరం చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఆరునెలల్లో అలా చేయగలిగినా సాంకేతిక పరంగా ఎదురవుతున్న లొసుగుల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న నెలకు సగటున లక్ష కోట్ల రూపాయల వసూలు లక్ష్యాన్ని చేరుకోవడం కష్టంగా కనిపిస్తున్నది. జీఎస్టీ అమలులో ప్రభుత్వం ఎదుర్కొంటున్న మరో ప్రధాన సమస్య పన్ను రేట్లను హేతుబద్ధం చేయడం. గత నవంబర్‌ లో దాదాపు 178 వస్తువులను 28 శాతం పన్ను స్లాబు నుంచి 18 శాతానికి మార్చడంతో ప్రభుత్వ వార్షిక ఆదాయం దాదాపు రూ. 20,000 కోట్ల గండిపడింది. ప్రస్తుతం పెయింట్స్ - సిమెంట్‌ లను కూడా 28 శాతం స్లాబు నుంచి 18 శాతానికి మార్చే యోచనలో ప్రభుత్వం వున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇలా స్లాబులను తరచూ మారుస్తుండటంతో ప్రభుత్వం ఆదాయంపై ప్రభావం పడే అవకాశమూ వుంది. సిమెంట్ స్లాబును 18 శాతానికి తగ్గించడం వల్లనే ప్రభుత్వానికి ఏటా రూ. 10,000 కోట్ల ఆదాయం కోల్పోవాల్సి రావచ్చునని అంచనా.
Tags:    

Similar News