కమలనాథులు చంకలు గుద్దుకోనక్కర్లేదు.. గెలిచింది బీజేపీ కాదు.. ఈటల మాత్రమే

Update: 2021-11-03 14:30 GMT
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ విజయం సాధించారు. ఈ గెలుపు లో క్రెడిట్ ఇవ్వాల్సింది.. తీసుకోవాల్సింది ఏమైనా ఉందంటే అది ఈటల రాజేందర్ మాత్రమే. ఇంకె వరికి ఇందు లో వాటా లేదనే చెప్పాలి. ఈటల ప్రాతినిధ్యం వహించిన బీజేపీ ఇప్పుడు భారీగా సంబరాలు చేసుకుంటున్నారు. అయితే.. వారంతా మర్చిపోకూడని విషయం ఏమంటే.. తాజా గెలుపు ఈటలకు మాత్రమే సొంతం.. బీజేపీకి ఏ మాత్రం కాదు. ఆ మాటకు వస్తే.. ఈటల రాజేందర్ బీఎస్పీ తరఫున బరిలో నిలిచినా.. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినా గెలిచేవారు.

బీజేపీని ఏ మాత్రం ఇష్టపడని మైనార్టీ వర్గాలు సైతం.. తాజా ఉప ఎన్నికల్లో తమ జీవితంలో తొలిసారి బీజేపీకి ఓటు వేశారు. అది బీజేపీ మీద ఉన్న అభిమానంతో కాదు.. ఈటల మీద ఉన్న మమకారంతో మాత్రమే. అంతేకాదు.. తాజా ఉప పోరులో పెట్టిన భారీ ఖర్చు మొత్తం ఈటల వ్యక్తిగతంతో పాటు.. ఆయన్నుఅభిమానించేవారు.. ఆయనకు ఫైనాన్స్ సపోర్టు చేసే వారు భారీగా విరాళాలు ఇవ్వటం ద్వారా.. ఈటల మీద పడే భారాన్ని తగ్గించే ప్రయత్నం చేశారని చెప్పాలి. ఈ లెక్కన చూసినా.. ఈటల విజయం కోసం బీజేపీ ప్రత్యేకంగా ఖర్చు చేసింది లేదు. ఎన్నికల ఖర్చు మొత్తం తానే భరిస్తానని ఈటల ముందే చెప్పినట్లుగా చెబుతారు.

ఉప పోరులో ఈటల విజయం తర్వాత.. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారతాయనటంలో ఎలాంటి సందేహం లేదు. కాకుంటే.. అది అధికార టీఆర్ఎస్ లో చోటు చేసుకునే అంతర్గత సమీకరణాలు మాత్రమే.. అంతేకానీ.. తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ బలపడుతుందని.. విస్తరిస్తుందన్న మాటలన్ని ఉత్తవేనని చెప్పాలి. నిజానికి హుజూరాబాద్ ఉప పోరు మొత్తం సీఎం కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ అన్న రీతిలోనే సాగింది.

అదే.. ఈటల మీద భారీ సానుభూతికి కారణమైంది. చివరకు గెలుపును సొంతమయ్యేలా చేసింది. ఈ గెలుపులో తమ పాత్ర కంటే కూడా ఈటలే కీలకమన్న విషయాన్ని కమలనాథులు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. లేదంటే.. తమ బలాన్నిఉన్నదాని కంటే ఎక్కువగా ఊహించుకుంటే.. మొదటికే మోసం వస్తుందన్న సత్యాన్ని వారు గ్రహించాల్సిన అవసరం ఉంది.


Tags:    

Similar News