కేసీఆర్ ను ఎలా కంట్రోల్ చేయాలి బాసూ!

Update: 2018-08-22 17:30 GMT
కొన్నింటికి ఎలాంటి లాజిక్కులు ఉండ‌వ‌ని చెబుతారో.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీసుకునే నిర్ణ‌యాలు సైతం అలానే ఉంటాయి. వాటికి ప్ర‌త్యేక‌మైన లాజిక్కులు ఉండ‌వు. ఆయ‌న‌కు ఎప్పుడు ఏమ‌నిపిస్తే.. ఆ విష‌యాన్ని మ‌రోసారి చెక్ చేసేసుకొని వెనువెంట‌నే నిర్ణం తీసుకుంటారు. అయితే.. అన్ని సంద‌ర్భాల్లోనూ ఇదే త‌ర‌హాలో వ్య‌వ‌హ‌రిస్తారా? అంటే లేద‌ని చెప్పాలి.  కొన్ని వ్యూహాల విష‌యంలో సుదీర్ఘంగా స‌మాలోచ‌న‌లు చేయ‌టం.. బ‌య‌ట వాతావ‌ర‌ణం త‌న‌కు అనుకూలంగా ఉందా?  లేదా? అన్న‌ది చూసుకోవ‌టం చేస్తుంటారు. ఇలాంటి స‌మ‌యాల్లో ఆయ‌న ఎవ‌రికి అందుబాటులో ఉండ‌కుండా ఉండ‌టం ఉద్య‌మ నాయ‌కుడి స‌మ‌యం నుంచి అల‌వాటు.

అరుదైన వ‌స్తువు ఏదైనా స‌రే అందుబాటులో ఉంటే దాని మీద ఆస‌క్తి అంత‌గా ఉండ‌దు. కానీ.. మామూలే అయినా.. అరుదుగా ల‌భిస్తుంద‌న్న దాని మీద ఉండే క్రేజ్ గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ విష‌యాన్ని కేసీఆర్ గుర్తించ‌ట‌మే కాదు.. త‌న మీద క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌ని రీతిలో ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తుంటారు. వాస్త‌వానికి తెలుగు రాజ‌కీయాల్లో ప్ర‌జ‌ల‌కు స‌న్నిహితంగా ఉండ‌ని ముఖ్య‌మంత్రి ఎవ‌ర‌న్న లెక్క తీస్తే అందులో కేసీఆర్ పేరు మొద‌ట‌గా వ‌స్తుంది.

అలా అని.. ఆయ‌న‌కు ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ ఉండ‌దా?  అంటే.. ట‌న్నులు.. ట‌న్నులు ఉంటుంది. విచిత్ర‌మైన విష‌యం ఏమంటే.. ప్ర‌జ‌ల‌కు దూరంగా ఉండే ముఖ్య‌మంత్రి మీద విమ‌ర్శ‌లు పెద్ద ఎత్తున వ‌స్తుంటాయి. కానీ.. కేసీఆర్ విష‌యంలో మాత్రం అలాంటివి అస్స‌లు క‌నిపించ‌వు. ఆయ‌న్ను త‌ప్పు ప‌ట్టేందుకు చాలానే విష‌యాలు ఉన్నా.. వాటిని త‌ప్పులుగా ఎత్తి చూపించే సాహ‌సం ఎవ‌రూ చేయ‌రు. ఒక‌వేళ ఎవ‌రైనా చేసినా.. వారు అందుకు త‌గ్గ ఫ‌లితాన్ని ఆయ‌న మాటల రూపంలో భ‌రించాల్సి ఉంటుంది. అందుకే.. కేసీఆర్ తో పెట్టుకోవ‌టానికి ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌రు.

ఉమ్మ‌డి రాష్ట్రంలో ప్ర‌తి విష‌యానికి గొంతు విప్పి గంద‌ర‌గోళం చేసే సంస్థ‌లు.. వ్య‌క్తులు చాలామందే ఉన్నారు. వారి దెబ్బ‌కు చాలామంది ముఖ్య‌మంత్రులు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌య్యే వారు. కానీ.. కేసీఆర్ స‌ర్కారును చూస్తే.. అలాంటి త‌ల‌నొప్పులు పెద్ద‌గా క‌నిపించ‌వు. అంతేనా.. మేధావులన్న పేరుతో.. స్వేచ్ఛ‌.. స్వాతంత్య్రం.. భావ‌స్వేచ్ఛ‌.. హ‌క్కులు.. లాంటి మాట‌లు చెప్పే వారంతా నోరెత్త‌కుండా ఉన్న వైనం చూస్తే.. కేసీఆర్ టాలెంట్ ఎంత‌న్న‌ది ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

ఇలా ఏ విష‌యంలోనూ కేసీఆర్ ను క్రాక్ చేయ‌టం అంత తేలికైన విష‌యం కాద‌ని చెప్పాలి. ఇదే మాట విప‌క్ష నేత‌ల నోటి నుంచి వ‌స్తుంటుంది. రాష్ట్రాన్ని ఆర్థికంగా ఇబ్బందిక‌ర ప‌రిస్థితికి తీసుకొచ్చి.. అప్పుల కుప్ప‌గా సంప‌న్న రాష్ట్రాన్ని చేసి.. ఇచ్చిన హామీల్లో చాలావ‌ర‌కూ అమ‌లు చేయ‌కున్నా.. ఏమీ అన‌లేని ప‌రిస్థితి.. వేలెత్తి చూపించ‌కుండా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించే తీరును వ్య‌వ‌స్థ‌ల‌కు క‌ల‌గ‌జేయ‌టంలో కేసీఆర్ స‌క్సెస్ అయ్యార‌ని చెప్పాలి.

ఎలాంటి ప‌రిస్థితినైనా త‌న‌కు త‌గ్గ‌ట్లుగా మార్చుకునే స‌త్తా కేసీఆర్ లో చాలా ఎక్కువ‌. ఆ సామ‌ర్థ్య‌మే ఆయ‌న ప్ర‌త్య‌ర్థుల‌కు పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. దానికి తోడు ఆయ‌న మాదిరి ఎత్తులు వేసే స‌త్తా.. తెలంగాణ‌లో ఏ నేత‌కూ లేని ప‌రిస్థితి. ఎంత‌లా లాలిస్తారో.. అంత‌కు రెట్టింపు అదిలించే గుణం కేసీఆర్ లో కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. నిజానికి అదే ఆయ‌న ఆయుధం కూడా.

ఎవ‌రి దాకానో ఎందుకు? జ‌ర్న‌లిస్టుల ముచ్చ‌టే తీసుకోండి. ప్ర‌శ్నించ‌టం వారి వృత్తి. కానీ.. వారి ప‌నిని వారు చేయ‌కుండా చేయ‌టంలో కేసీఆర్ నూటికి నూరు శాతం విజ‌యం సాధించార‌ని చెప్పాలి. ప్ర‌శ్నించి ప‌రేషాన్ అయ్యే క‌న్నా.. కామ్ గా ఉండ‌టం ఉత్త‌మం అన్న‌ట్లుగా వారు చెబుతారు. ఈ గుణాల్ని ఎత్తి చూపిస్తూ.. కేసీఆర్ ను మ్యాప్ చేసే ఐడియా ఏదైనా చెప్పండి బాసూ అంటూ.. కొంద‌రు రాజ‌కీయ నేత‌లు స‌ర‌దాగా అడిగేయ‌టం క‌నిపిస్తుంది. 


Tags:    

Similar News