మోడీని రౌండ‌ప్ చేసే స్కెచ్ రెడీ

Update: 2017-11-16 17:52 GMT
ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోడీ పార్ల‌మెంట్ అంటే భ‌య‌ప‌డుతున్నారా? స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌పై ఆయ‌న‌కు ఎందుకు ఆస‌క్తిలేదు?  నోట్ల ర‌ద్దు - జీఎస్టీ విష‌యంలో ఇరుకున ప‌డ‌తామ‌నే మోడీజీ ఇలా చేస్తున్నారా?  ప్ర‌ధాని తీరును గ‌మ‌నించిన విప‌క్షాలు మోడీని రౌండప్ చేసేందుకు నిర్ణ‌యం తీసుకున్నాయా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. ప్ర‌ధాని మోడీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం పార్లమెంటు శీతాకాల సమావేశాలను నవంబర్‌లో నిర్వహించకుండా డిసెంబర్‌కు వాయిదా వేయటంతోపాటు సమావేశాల నిడివిని కుదించివేయటంపై రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్‌కు ఫిర్యాదు చేయాలని ప్రతిపక్షాలు ఆలోచిస్తున్నాయి.

బీజేపీ సార‌థ్యంలోని ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చినప్పటినుండి పార్లమెంటు నిర్లక్ష్యానికి గురవుతోందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక వ్యూహం ప్రకారం పార్లమెంటు ప్రాధాన్యతను తగ్గిస్తోందన్నది ప్రతిపక్షాల ఆరోపణ. ప్రతి ఏడాది పార్లమెంటు మూడుసార్లు సమావేశం అవుతుంది. బడ్జెట్, వర్షాకాల, శీతాకాల సమావేశాలు నిర్ణీత తేదీలకు జరగటం అనేది స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండీ జరుగుతోంది. బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో రెండు విడతలుగా జరిగితే, వర్షాకాల సమావేశాలు జూలై, ఆగస్టు, శీతాకాల సమావేశాలు నవంబర్, డిసెంబర్ నెలల్లో జరగటం ఆనవాయితీ. ఈ మూడు విడతల సమావేశాల తేదీలు ఒకటి రెండు రోజులు అటుఇటు కావచ్చు కానీ నెలలు మారవు. అయితే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ సాంప్రదాయాన్ని తిరగరాస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ నాలుగో వారంలో ప్రారంభమై డిసెంబర్ మూడో వారంలో ముగియవలసి ఉండగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకోసం ఈ సమావేశాలను నవంబర్‌కు బదులు డిసెంబర్‌లో కేవలం పది రోజులు మాత్రమే నిర్వహించి చేతులు దులుపుకోవాలని బీజేపీ ప్రభుత్వం ఆలోచిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సమావేశాలు నవంబర్‌లో ప్రారంభమైతే పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీపై ప్రతిపక్షాలు చర్చ జరిపి గుజరాత్‌లో తమ విజయావకాశాలను దెబ్బతీస్తాయని బీజేపీ భయపడిందనీ, అందుకే సమావేశాలను డిసెంబర్‌కు మార్చి నిడివిని కుదించిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ విధంగా ఎన్‌డీఏ ప్రభుత్వం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీస్తోందనే విషయాన్ని రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ దృష్టికి తీసుకురావాలని ప్రతిపక్షం ఆలోచిస్తోంది. ఈ అంశంపై కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, జేడీ(యూ), ఆర్జేడీ, సమాజ్‌వాదీ, జేడీయస్ తదితర పార్టీల నాయకుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఏకాభిప్రాయం కుదిరిన వెంటనే రాష్టప్రతి అప్పాయింట్‌మెంట్ తీసుకుంటారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అయితే పార్లమెంటు సమావేశాల వాయిదాపై ప్రభుత్వం నుండి ఏదైనా ప్రకటన వస్తుందా లేదా అనేది వేచి చూసిన తరువాత రాష్టప్రతి అపాయింట్‌మెంట్ తీసుకుంటామని కాంగ్రెస్ స‌హా విపక్షాలు భావిస్తున్నాయి.
Tags:    

Similar News