తెలంగాణలో ఉద్యమాలు అనేగానే టక్కున గుర్తుకు వచ్చే కేంద్రం ఉస్మానియా యూనివర్సిటీ. అనేక ప్రజాస్వామిక ఉద్యమాలకు వేదిక, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక భూమికగా నిలిచిన ఉస్మానియా యూనివర్సిటీ విషయంలో కొత్తగా విడుదలయిన ఆదేశాలపై విద్యార్థులు, తెలంగాణవాదుల్లో నిరసన వ్యక్తం అవుతోంది. ఇంతకీ ఇంత ఆగ్రహానికి కారణం... ఓయూలో సభలు పెట్టొద్దని యూనివర్సిటీ అధికారులు హుకుం జారీ చేయడమే.
ఇటీవల అట్టహాసంగా జరిగిన ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలను ప్రారంభిస్తూ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ స్వేచ్ఛగా అభిప్రాయాల మార్పిడికి యూనివర్సిటీ వేదికలు కావాలని ఉద్భోదించారు. అలా ప్రకటించి కనీసం రెండు నెలలైనా గడవక ముందే సభలపై యూనివర్సిటీ నిషేధం విధించింది. యూనివర్సిటీ అధ్యా పకులు, బోధకులు, సిబ్బంది... విద్యా, పరిశోధనేతర కార్యకలాపాలకు పాల్పడవద్దని పత్రికా ప్రకటన విడుదల చేసింది. విశ్వవిద్యాలయం ప్రాంగణంలో రాజకీయ, బహిరంగ సభలను అనుమతించబోమని స్పష్టం చేసింది. విశ్వవిద్యాలయాల లక్షం విద్యా పరమైన, పరిశోధన సంబంధిత అంశాలకే పరిమితమని పేర్కొంది.
ఇటీవల శతాబ్ది ఉత్సవాల్లో ముఖ్యమంత్రి ప్రసంగించకపోవడం, జూన్ 2న రాష్ట్ర అవతరణోత్సవాన్ని నిర్వహించకపోవడం వంటి అంశాలతో యూనివర్సిటీ వార్తల్లో నిలిచింది. తాజాగా నిరుద్యోగంపై యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమానికి సిద్ధమవుతుండడం, కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ త్వరలో యూనివర్సిటీకి వస్తారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో యూనివర్సిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. విద్యార్థుల్లో ఇప్పటికే పెరిగిన అసంతృప్తులకు ఈ నిషేధం ఆజ్యం పోస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/