పైపై పూత.. 100 పారిస్ ఒలింపిక్ పతకాలు వాపస్..

ఒలింపిక్ పతకం అంటే మామూలు కాదు.. అది సాధించినవారికి వారి వారి దేశాల్లో లభించే ఆదరణ, ప్రభుత్వ ప్రోత్సాహకాలు అంతా ఇంతా కాదు.

Update: 2025-01-14 23:30 GMT

ఒలింపిక్ పతకం అంటే మామూలు కాదు.. అది సాధించినవారికి వారి వారి దేశాల్లో లభించే ఆదరణ, ప్రభుత్వ ప్రోత్సాహకాలు అంతా ఇంతా కాదు. రూ.కోట్లలో డబ్బు.. అంతకుమించిన నజరానాలు.. అయితే, అసలు ఒలింపిక్ పతకమే నాసిరకంగా ఉంటే.. ఒకటీ రెండు కాదు 100 పతకాలు పోటీలు జరిగిన ఆరు నెలల్లోనే వాపస్ వచ్చే పరిస్థితి ఉంటే?

గత ఏడాది జూన్-జూలైలో పారిస్ వేదికగా ఒలింపిక్స్ జరిగిన సంగతి తెలిసిందే. అంటే మహా అయితే ఆరు నెలలు. కానీ, ఇంతలోనే డజన్ల కొద్దీ విజేతలు తాము గెలిచిన పతకాలను వెనక్కిస్తున్నారట. దీంతో ఒలింపిక్‌ పతకాల నాణ్యతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెడల్స్ పై ఉన్న లోహపు పూత చెదిరిపోయిందని.. 100 మంది అథ్లెట్లు వాటిని వాపస్‌ చేశారని తెలుస్తోంది. ఇది ప్రతిష్ఠకు సంబంధంచిన విషయం కావడంతో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ స్పందించింది.

లోపం ఉన్నవి మార్చి ఇస్తాం..

ఒలింపిక్ పతకాల లోపాల విషయమై ఒలింపిక్ కమిటీ స్పందించింది. లోపాలు తేలినవాటిని మార్చేస్తామని తెలిపింది. పారిస్‌-24 ఒలింపిక్‌ గేమ్స్‌ నిర్వాహక కమిటీ ఫ్రెంచ్‌ ప్రభుత్వ మింట్‌ తో కలిసి పనిచేసింది. పతకాల తయారీ, నాణ్యతకు బాధ్యత దీనిదే. లోపం ఉన్నవాటిని ఫ్రెంచి ప్రభుత్వ మింట్‌ రీప్లేస్‌ చేస్తుంది. ఈ ప్రక్రియ కొన్ని వారాల్లో ప్రారంభం కానుంది.

ఫ్రాన్స్ ప్రభుత్వ మింట్‌ మాత్రం పతకాలు నాసిరకంగా ఉన్నాయనే విమర్శలను ఖండిస్తోంది. ఆగస్టు నుంచే లోపాలున్నవాటిని మార్చి ఇచ్చామని పేర్కొంది. అయితే, కొందరు అథ్లెట్లు నాసిరకం పతకాలను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అమెరికా స్కేట్‌ బోర్డర్‌ హూస్టన్‌ పతకాల నాణ్యతపై ఫిర్యాదు చేశాడు.

పారిస్ ఒలింపిక్స్ మొదటి నుంచి విమర్శల మధ్య జరిగాయి. కలుషిత నది ఒడ్డున నిర్వహించారనే ఆరోపణలు వచ్చాయి. ఇక ఒలింపిక్ విజేతలకు 5,084 స్వర్ణ, రజత, కాంస్య పతకాలను ప్రదానం చేశారు. వీటిని చౌమెట్‌ సంస్థ డిజైన్‌ చేసింది. ఇది లగ్జరీ బ్రాండ్. పతకాల్లో ప్రఖ్యాత ఐఫిల్‌ టవర్‌ నుంచి తీసిన ఉక్కును కలిపారు. తయారీ ఖర్చు ఎంత అయినప్పటికీ విలువ ఒలింపిక్స్ లో ఒక్క పతకం గెలిచినా అది అపురూపమే. జీవితాంతం అతడు ఒలింపిక్ చాంపియనే.

Tags:    

Similar News