90 గంటల వ్యాఖ్యపై కవరింగ్ కోసం నానా పాట్లు

ఎల్ అండ్ టీ ఛైర్మన్ చేసిన వ్యాఖ్యలకు తమదైన శైలిలో వారిచ్చిన కౌంటర్ పంచ్ కు నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున సానుకూలత వ్యక్తం కావటంతో ఎల్ అండ్ టీ ఆత్మరక్షణలో పడింది.

Update: 2025-01-14 14:30 GMT

కాలం మారింది. సోషల్ మీడియా ఇప్పుడు అందరికి ఒక బటన్ దూరంలో ఉంది. ఈ విషయాన్ని అత్యుత్తమ స్థానాల్లో ఉన్న వారు.. కీలక పదవుల్లో ఉన్నోళ్లు అనుక్షణం గుర్తుంచుకోవాలి. స్మార్ట్ ప్రపంచంలో ప్రతి ఒక్కరి చేతిలో ఉండే ఫోన్ కెమేరా ప్రతి మాటలను ఇట్టే క్యాచ్ చేయటమే కాదు.. నిమిషాల వ్యవధిలో ప్రపంచం మొత్తాన్ని వైరల్ చేసి పారేస్తోంది. ఇలాంటి వేళ.. నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఆచితూచి అన్నట్లు ఉండాలి. ఇంట్లోనో.. స్నేహితుల మధ్యనో మాట్లాడే తీరులో నలుగురు ఎదుట మాట్లాడకుండా ఉండాలన్న విషయం మర్చిపోయిన పక్షంలో అందుకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.

ఇప్పుడు అలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటున్నారు ఎల్ అండ్ టీ ఛైర్మన్. ఇటీవల ఆయన మాట్లాడుతూ వారానికి 90 గంటల పని విషయంలో సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలు.. దానిపై ఆనంద్ మహీంద్రా.. పూనావాలా తదితరులు స్పందించటమే కాదు తప్పు పట్టారు. ఎల్ అండ్ టీ ఛైర్మన్ చేసిన వ్యాఖ్యలకు తమదైన శైలిలో వారిచ్చిన కౌంటర్ పంచ్ కు నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున సానుకూలత వ్యక్తం కావటంతో ఎల్ అండ్ టీ ఆత్మరక్షణలో పడింది.

దీంతో డ్యామేజ్ కంట్రోల్ ఎలా చేయాలన్న దానిపై భారీ మధనం తర్వాత తాజాగా ఒక నోట్ ను సంస్థ హెచ్ఆర్ నుంచి విడుదలైంది. తమ ఛైర్మన్ చేసిన వ్యాఖ్యలు జనాల్లోకి పొరపాటుగా వెళ్లాయని హెచ్ఆర్ హెడ్ సోనియా తన నోట్ లో పేర్కొన్నారు. ‘మా ఎండీ వ్యాఖ్యలు పొరపాటుగా జనంలోకి వెళ్లాయి. ఆయన చాలా సాధారణంగానే ఆ మాటలు అన్నారు. కానీ.. అవి అనవసర విమర్శలకు దారి తీయటం నిజంగా బాధాకరం. వారానికి 90 గంటలు పని తప్పనిసరి అని కానీ దానిని అమలు చేయాలని కానీ ఆయనేం అనలేదు’’ అంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారు.

అంతేకాదు.. ఆయన సంస్థలోని ప్రతి ఉద్యోగిని తన కుటుంబ సభ్యుడిగానే భావిస్తారని.. అలానే టీం బాగోగుల గురించి కూడా ఆలోచిస్తారంటూ ఆయన గుణగణాల్ని కీర్తించేలా నోట విడుదల చేశారు. ఆయన నాయకత్వాన్ని ఆమె ఆకాశానికి ఎత్తేశారు. ఆయన మాటల్ని అర్థం చేసుకొని.. విమర్శలకు పుల్ స్టాప్ పెట్టాలని కోరటం గమనార్హం. నిజానికి ఎల్ అండ్ టీ ఛైర్మన్ వారానికి 90 గంటల పని చేయాలన్నా ఫర్లేదేమో కానీ.. దానికి కొనసాగింపుగా చేసిన వ్యాఖ్యలే పెను దుమారానికి కారణమయ్యాయి.

‘ఇంట్లో కూర్చొని ఎంతకాలం అలా భార్యను చూస్తూ ఉండిపోతారు? ఇంట్లో తక్కువ.. ఆఫీసులో ఎక్కువగా ఉంటామని భార్యలకు చెప్పాలి. అవసరమైతే ఆదివారాలు పని చేయాలి’ అంటూ నోరు పారేసుకోవటంతో రచ్చ మొదలైంది. ఆయన వ్యాఖ్యలకు పారిశ్రామికవేత్తలు మాత్రమే కాదు.. బాలీవుడ్ టాప్ హీరోయినన్ దీపికా పదుకొణె సైతం అసహనం వ్యక్తం చేశారు. బానిసలా కష్టపడటాన్ని కాకుండా తెలివిగా పని చేయటాన్ని తాను నమ్ముతానంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త హర్షా గోయెంకా పేర్కొన్నారు. పనిని.. వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకోవటం చాలా అవసరమన్నారు. మరోవైపు.. ఎల్ అండ్ టీ ఛైర్మన్ చేసిన వ్యాఖ్యల్ని సమర్థిస్తున్న ప్రముఖులు లేకపోలేరు. ఏమైనా.. జీవితానికి పని మాత్రమే కాదు.. దానికి మించిన విషయాలు కూడా ఉన్నాయన్న విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోవటం లేదన్నది ప్రశ్నగా మారింది.

Tags:    

Similar News