రాజ్ నాథ్ కు సలీం ఇప్పుడు సారీ చెబుతారా?

Update: 2015-12-01 04:17 GMT
రాజకీయాల్లో విమర్శలు.. ఆరోపణలు మామూలే. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవటానికి.. ఆరోపణస్త్రాలు సంధించుకోవటానికి మీడియాలో వచ్చే వార్తలు.. వార్తాంశాలు ఎంతమాత్రం సరికాదంటూ చేసే వాదనకు బలం చేకూరే పరిస్థితి తాజాగా నెలకొంది. సోమవారం లోక్ సభలో ‘‘అసహనం’’ మీద జరిగిన చర్చలో సీపీఎం ఎంపీ మహమ్మద్ సలీం మాట్లాడుతూ. ఔట్ లుక్ మ్యాగ్ జైన్ లో ప్రచురించిన ఒక వార్తను ఉటంకిస్తూ.. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ మీద తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సదరు కథనంలో.. 800 ఏళ్ల తర్వాత భారతదేశానికి ఒక హిందువు ప్రధాని అయ్యారంటూ అందులో వ్యాఖ్యలు ఉన్నాయి.

తాను అలాంటి వ్యాఖ్యలు అస్సలు చేయలేదని.. తాను చేయని వ్యాఖ్యలు తనపై రుద్దితే ఎలా అంటూ రాజ్ నాథ్ సింగ్ వాపోయారు. తన జీవితంలో ఇలాంటి దారుణ పరిస్థితి ఎదుర్కొనలేదని.. తాను చేయని వ్యాఖ్యల్ని తాను చేసినట్లుగా ఎలా చెబుతారంటూ నిండు సభలో రాజ్ నాథ్ ఫైర్ అయ్యారు. ఔట్ లుక్ మ్యాగ్ జైన్ లో ప్రచురితమైన కథనంలోని అంశాల్ని తాను ప్రస్తావించానని.. కావాలంటే సదరు పత్రికనే అడగాలని.. లేదంటే ఆ పత్రిక మీద పరువు నష్టం దావా వేయాలంటూ ఒక సూచన పారేసి.. వేయాల్సినంత ఆరోపణల బురద వేసి సలీం కూర్చున్నారు.

తాజా వివాదం నేపథ్యంలో ఔట్ లుక్ స్పందించింది. తాము ప్రచురించిన కథనంలో పేర్కొన్న వ్యాఖ్యలు రాజ్ నాథ్ వి కావని.. అవి అశోక్ సింఘాల్ చేసిన వ్యాఖ్యలని.. తప్పుగా కోట్ చేసినట్లుగా పేర్కొన్నారు. జరిగిన దానికి చింతిస్తున్నట్లు ఔట్ లుక్ ప్రకటించింది. తమ తప్పుల మీద ఔట్ లుక్ లెంపలేసుకున్న నేపథ్యంలో.. ఒక మీడియాలో వచ్చిన వార్తల్ని ప్రామాణికంగా చేసుకొని విమర్శలు చేసిన సలీం క్షమాపణలు చెబుతారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మీడియాలో కొన్ని పొరపాట్లు దొర్లే అవకాశం ఉందని.. వాటిని ప్రామాణికంగా చేసుకొని తీవ్ర ఆరోపణలు చేయటం సరికాదన్న విషయం తాజా ఉదంతం చెప్పకనే చెబుతుందనుకోవాలి. మీడియాలో వచ్చిన ఆరోపణలకు సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరించి.. రాజకీయ నాయకులు మాట్లాడితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News