రాజధాని కోసం పాదయాత్ర ?

Update: 2021-10-11 05:15 GMT
రాష్ట్రానికి పూర్తిస్ధాయి రాజధానిగా అమరావతినే కంటిన్యూ చేయాలనే డిమాండ్ తో ఐక్యా కార్యాచరణ సమితి (ఐకాస) నేతలు తొందరలోనే తిరుమలకు పాదయాత్ర చేయబోతున్నారు. నవంబర్ 1వ తేదీ నుంచి 45 రోజుల పాటు జరగబోయే పాదయాత్ర రాజధాని ప్రాంతంలోని తుళ్ళూరు ప్రారంభమవుతోంది. 400 కిలోమీటర్ల దూరాన్ని 45 రోజుల్లో పూర్తిచేయాలని ఐకాస నేతలు డిసైడ్ చేశారు. ఈ యాత్రలో రైతులు, రైతుకూలీలు, ప్రజాసంఘాల నేతలు, రాజకీయనేతలు పాల్గొనబోతున్నారు.

మరి పాదయాత్ర ద్వారా రాజధానిని సాధించుకోవచ్చని ఐకాస నేతలకు ఎవరు సలహా ఇచ్చారో అర్ధం కావటంలేదు. 400 కిలోమీటర్లు కాదుకదా 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినా అమరావతిని రాజధానిగా కంటిన్యూ చేయించుకోలేమన్న విషయాన్ని ఐకాస నేతలు గ్రహించాలి. ఎందుకంటే ఇదే విషయమై ఇప్పటికే హైకోర్టులో చాలా పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ కూడా జరుగుతోంది. ఇంకో కీలకమైన అంశం ఏమిటంటే రాజధాని ఏది ? ఎక్కడుండాలి అనే విషయాన్ని కోర్టులు డిసైడ్ చేయలేవు.

హైకోర్టు ఏర్పాటు విషయంలో  మాత్రమే సుప్రింకోర్టు కొలీజియం+హైకోర్టు అంగీకరించాల్సుంటుంది. ఈ విషయం తప్ప ఇంకెందులో కూడా కోర్టు జోక్యం చేసుకునే అవకాశం లేదు. రాజధాని ఏర్పాటన్నది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశమే అని స్వయంగా కేంద్రమే చాలాసార్లు అఫిడవిట్ రూపంలో తేల్చి చెప్పేసింది. జగన్ ఆలోచన ప్రకారం హైకోర్టు కర్నూలులో ఏర్పాటవ్వాలి. అందుకు అవసరమైన ప్రక్రియ పెండింగ్ లో ఉంది కాబట్టే మూడు రాజధానుల ప్రతిపాదన ఇంకా అమల్లోకి రాలేదు.

ఇక అమరావతి ఉద్యమాన్నే తీసుకుంటే రాజధాని కోసం ఉద్యమం అన్నది రాష్ట్రంలోని ఏ జిల్లాలో కూడా జరగటం లేదు. చివరకు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూడా లేదనే చెప్పాలి. కేవలం రాజధాని కోసం భూములిచ్చిన 29 గ్రామాల్లోని కొన్ని గ్రామాల్లో మాత్రమే ఉద్యమం జరుగుతోందంటున్నారు. ఈ ఉద్యమం కూడా టీడీపీ స్పాన్సర్డ్ అనే బలమైన ముద్రుంది కాబట్టే మిగిలిన జిల్లాల్లోని జనాలు ఎవరు పట్టించుకోవటంలేదు. ఈమధ్యనే జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో అమరావతి చుట్టుపక్కల మండలాల్లో కూడా వైసీపీనే గెలుచుకుంది.

ఉద్యమం అంటే రాజధాని రైతులు ఢిల్లీలో రైతులను చూసి నేర్చుకోవాలి. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివార్లలో గడచిన పది మాసాలుగా రైతు సంఘాలు చేస్తున్నది అసలైన ఉద్యమం. ఈ ఉద్యమానికి దేశవ్యాప్తంగా రైతు సంఘాల నుంచి మద్దతు ఎందుకు వస్తున్నదో అమరావతి ఉద్యమకారులు గమనించాలి. రైతుల ఉద్యమానికి మద్దతుగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ నుండే కాకుండా మహారాష్ట్ర, కర్నాటక నుంచి కూడా పెద్ద ఎత్తున రైతు సంఘాలు వెళ్ళి పార్టిసిపేట్ చేస్తుండటమే ఉద్యమస్పూర్తికి నిదర్శనం. అంతేకానీ టీడీపీ మద్దతు మీడియాలో ఫొటోలు వేయించుకోవటం, పాదయాత్ర చేయటం ఉద్యమం కాదని గ్రహించాలి.
Tags:    

Similar News