సొంత పైల‌ట్ ను చిత‌క‌బాదిన పాకిస్థానీలు!

Update: 2019-03-01 06:56 GMT
దేశ‌మంతా ఇప్పుడు అభినంద‌న్ పేరు మార్మోగిపోతోంది. భార‌త గ‌గ‌న‌త‌లంలోకి ప్ర‌వేశించిన పాక్ యుద్ధ విమానాన్ని నేల‌కూల్చి దేశ సార్వ‌భౌమ‌త్వాన్ని చాటిచెప్పిన వాయుసేన వింగ్ క‌మాండ‌ర్ ఆయ‌న‌. దుర‌దృష్ట‌వ‌శాత్తూ శ‌త్రువుల చేతికి చిక్కినా.. వేగంగా పావులు క‌దిపిన భార‌త్ అభినంద‌న్ ను పాక్ ఏమీ చేయ‌కుండా నిలువ‌రించ‌గ‌లిగింది. అంత‌ర్జాతీయ స్థాయిలో ఒత్తిడి పెర‌గ‌డంతో ఆయ‌న్ను మ‌న‌దేశానికి శుక్ర‌వారం తిరిగి అప్ప‌గించేస్తామ‌ని పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ ప్ర‌క‌టించేశారు కూడా. యావ‌ద్భార‌త దేశం ఇప్పుడు ఆయ‌న రాక కోసం ఆతృత‌గా ఎదురుచూస్తోంది.

అయితే, భార‌త్‌-పాక్ మ‌ధ్య మంగ‌ళ‌వారం చోటుచేసుకున్న ఈ గ‌గ‌నత‌ల ఘ‌ర్ష‌ణ‌కు సంబంధించి తాజాగా ఓ ఆస‌క్తిక‌ర విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. వాస్త‌వానికి మంగ‌ళ‌వారం తాము రెండు భార‌త యుద్ధ విమానాల‌ను కుప్ప‌కూల్చామ‌ని పాక్ తొలుత ప్ర‌క‌టించింది. ఇద్ద‌రు వాయుసేన పైల‌ట్ల‌ను బంధించామ‌ని కూడా చెప్పుకుంది. కానీ మ‌న‌దేశ అధికారులు మాత్రం కూలింది ఒక్క మిగ్‌-21 విమాన‌మేన‌ని.. దాయాది దేశానికి బందీగా చిక్కింది వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ మాత్ర‌మేన‌ని స్ప‌ష్టం చేశారు.

మ‌రి పాక్ బంధించిన రెండో పైల‌ట్ ఎవ‌రు? పాక్ కూల్చివేసిన రెండో యుద్ధ విమానం ఎవ‌రిది? ఈ ప్ర‌శ్న‌ల‌కు తాజాగా స‌మాధానం దొరికింది. కానీ ఆ స‌మాధానం పాక్ కు ఏమాత్రం మింగుడు ప‌డ‌నిది. అదేంటో తెలుసా.. పాక్ చెప్పిన రెండో పైల‌ట్ వారి సొంత పైల‌టే. తాము కూల్చివేసిన‌ట్లు ప్ర‌గ‌ల్బాలు ప‌లికిన యుద్ద విమానం వారి సొంత‌దే.

అస‌లేం జ‌రిగిందంటే.. బాలాకోట్ ఉగ్ర శిబిరంపై భార‌త్ దాడితో నిర్ఘాంత‌పోయిన పాక్ ఎలాగైనా ప్ర‌తిదాడి చేయాల‌ని భావించింది. యుద్ధ విమానాల‌తో భార‌త గ‌గ‌న‌త‌ల ప‌రిధిని ఉల్లంఘించింది. అందులో భాగంగా  అత్యాధునిక ఎఫ్‌-16 విమానంతో పాక్ పైల‌ట్ ఒక‌రు మ‌న‌దేశంలోకి చొచ్చుకొచ్చాడు. దాన్ని గుర్తించిన ఐఏఎఫ్‌ వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ మిగ్‌-21లో బ‌య‌లుదేరారు. ఎఫ్‌-16ను వెన‌క్కి ప‌రుగులు పెట్టించి కూల్చివేశారు. విమానం కూలిపోయేలోపే అందులో నుంచి పాక్ పైల‌ట్ పారాచూట్ సాయంతో కింద‌కు దూకాడు.

అలా కింద‌కు దూకిన పాక్ పైల‌ట్ స్వ‌దేశీ భూభాగంపై క్షేమంగా దిగాడు. సైనిక దుస్తుల్లో ఉన్న ఆయ‌న్ను స్థానికులు భార‌తీయుడ‌ని పొర‌ప‌డ్డారు. భార‌త్ పై ఉన్న అనుచిత ఆవేశంతో వాస్త‌వాలు నిర్ధారించుకోకుండా సొంత పైల‌ట్ పై దాడికి తెగ‌బ‌డ్డారు. పిడిగుద్దుల వ‌ర్షం కురిపించారు. ర‌క్త‌మోడుతున్నా క‌నిక‌రించ‌లేదు. దీంతో తీవ్రంగా గాయ‌ప‌డ్డ పైల‌ట్ అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లాడు. అంత‌లో భార‌త పైల‌ట్ స్థానికుల‌కు చిక్కార‌న్న స‌మాచారం అందుకున్న పాక్ పోలీసులు అక్క‌డికి చేరుకున్నారు. అస‌లు నిజం తెలుసుకొని ఖంగుతిన్నారు. ఆయ‌న్ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

అయితే - పోలీసులు అక్క‌డికి చేరుకొని వాస్త‌వాలు నిర్ధారించుకునేలోపే పాక్ సైన్యాధికారులు అత్యుత్సాహం  ప్ర‌ద‌ర్శించారు. ప‌ట్టుబ‌డ్డ‌ది భార‌త పైల‌టేన‌ని పొర‌ప‌డ్డారు. అభినంద‌న్ తోపాటు మ‌రో భార‌త అధికారినీ తాము బంధించిన‌ట్లు ప్ర‌క‌టించారు. కూలిన ఎఫ్-16 భార‌త్ దేన‌నుకొని రెండు యుద్ధ విమానాల‌ను కూల్చివేసిన‌ట్లు బ‌డాయిలు చెప్పుకున్నారు. ఆపై నాలుక క‌రుచుకొని.. అభినంద‌న్ మాత్ర‌మే త‌మ వ‌ద్ద బందీగా ఉన్నార‌ని స్ప‌ష్టం చేశారు.
Tags:    

Similar News