మోడీ నిర్ణయం.. పాక్‌ దడపుట్టిస్తోందిగా..!

Update: 2019-08-05 11:36 GMT
అత్యంత ప్రతిష్టాత్మక అడుగుగా, సాహసోపేతమైన నిర్ణయంగా భావిస్తున్న కశ్మీర్‌ రాష్ట్ర విభజన విషయం భారత్‌ లో మోడీకి దాదాపు మెజారిటీ ప్రజల మద్దతు లభిస్తుంటే.. దాయాది దేశం పాకిస్థాన్‌ లో మాత్రం అక్కడి పాలకులకు దడ పుట్టిస్తోంది. కశ్మీర్‌ను విభించి లడఖ్‌ ప్రాంతాన్ని పూర్తి కేంద్రపాలిత ప్రాంతంగా- జమ్ము- శ్రీనగర్‌ తో కూడిన కశ్మీర్‌ ను అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా మోడీ ప్రభుత్వం సాహసోపేతమైన అడుగు వేసింది. పార్లమెంటులో పూర్తిస్థాయి మెజారిటీ ఉండడం, పక్క దేశం పాకిస్థాన్‌ తరచుగా కవ్వింపులకు దిగుతుండడం, మరోపక్క, అమెరికా అధినేత ట్రంప్‌ ఈ విషయంలో పాక్‌-భారత్‌ కు మధ్య వర్తిగాపనిచేస్తానని ప్రకటించిన దరిమిలా.. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం తన సత్తా చాటుతూ.. రాజ్యాంగాన్ని తిరగ రాసింది.

ఫలితంగా ఇప్పుడు జమ్ము కశ్మీర్‌ లో గడిచిన ఏడున్నర దశాబ్దాలుగా ఉన్న వివాదాలకు కొంత మేరకు చెక్‌ పెట్టడంతోపాటు.. పాక్‌ దూకుడును అడ్డుకునే అవకాశం భారత ప్రభుత్వానికి దఖలు పడింది. దీంతో ఇప్పుడు పాక్‌ కవ్వింపులకు, ఉగ్రమూకలను రెచ్చగొట్టి భారత భద్రతకు పొగపెట్టే చర్యలకు దాదాపు గండి పడింది. ముఖ్యంగా నిన్నటి వరకు సాగిన కశ్మీర్‌ చిచ్చుతో చలికాచుకున్న పాక్‌ ఇక తోకముడవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. దీంతో అగ్గిమీద గుగ్గిలమవుతున్న పాకిస్థాన్‌.. దేశ విభజన సమయంలో చేసుకున్న ఒప్పందాలను తవ్వితీయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

కశ్మీర్‌ సమస్యాత్మకమైనందునే నాడు ఒప్పందం ద్వారా ఇక్కడ చెలిమి చేయాలని నిర్ణయించుకున్నామని, కానీ, నేడు మోడీ ఒంటెత్తు పోకడలకు పోతున్నారని తాజాగా కొత్త సూత్రం బయట పెట్టింది. వాస్తవానికి కశ్మీర్‌ లోయ సమస్యను పరిష్కరించుకునేందుకు భారత్‌ అనేక మార్లు రెడ్‌ కార్పెట్‌ పరిచింది. పాక్‌ ను ఆహ్వానించింది. చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు అవకాశం కల్పించింది. కానీ, ఖడ్గ చాలనానికే విలువ ఇచ్చిన పాక్‌.. నిరంతర కవ్వింపులు, సైనిక దాడులతో భారత్‌ కు పక్కలో బల్లెంలా మారింది.

దీనిని ఇప్పటికైనా సాహసోపేత నిర్ణయం ద్వారా వదిలించుకోకపోతే.. ముందు తరాలు నాశనం అయిపోతాయని గుర్తించిన మోడీ ప్రభుత్వం తనకు ప్రజలు ఇచ్చిన పూర్తి మెజారిటీతో కశ్మీర్‌ పై సంచలన అడుగు వేశారనడంలో ఎవరికీ రెండో అభిప్రాయం లేదు. దీనిని గుర్తించిన పాక్‌ ఇప్పుడు గత ఒప్పందాలను ఐక్యరాజ్యసమితిలోనే తేల్చుకుంటామని చెబుతోంది. దీనికి సంబంధించి పాక్‌ అధ్యక్షుడు ఆరిఫ్‌ అన్వర్‌ తాజాగా ఓ ప్రకటన చేశారు. తాము ఐక్యరాజ్యసమితి గడప తొక్కుతామన్నారు. అయితే, అక్కడ కూడా పాక్‌ ఇలానే వాదిస్తే.. ఒంటరి కావడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.
 
    

Tags:    

Similar News