దాయాది నోట మాట రాని రీతిలో పాక్ ఉగ్రవాది వీడియో సందేశం

Update: 2021-09-30 06:31 GMT
అంతర్జాతీయ వేదికల మీద నీతులు వల్లించే దాయాది పాకిస్థాన్ మాటలకు చేతలకు మధ్య తేడా ఎంతన్న విషయాన్ని తెలియజేసే వైనం తాజాగా పెను సంచలనంగా మారింది. ఇటీవల భారత సైన్యం చేతులకు చిక్కిన పాకిస్థాన్ ఉగ్రవాది ఒకరు ఇచ్చిన వీడియో సందేశాన్ని తాజాగా విడుదల చేశారు. అందులో.. అతను కూర్చున్న టేబుల్ మీద గాజు గ్లాసులో టీ ఉంచారు. సదరు ఉగ్రవాది తన గురించి.. తన నేపథ్యం గురించి.. పాకిస్థాన్ ఆర్మీ తనకు ఇచ్చిన టాస్కు గురించి వివరాలు వెల్లడించారు. పాక్ దుష్టబుద్ధిని బయటపెట్టాడు. తాను పాకిస్థాన్ కు చెందిన వ్యక్తిగా వెల్లడించారు. తాను విన్న మాటలకు.. తాజాగా చూస్తున్న దానికి ఏ మాత్రం సంబంధం లేదన్నఅతడు చెప్పిన మాటలు అంతర్జాతీయంగా సంచలనంగా మారాయి.

కశ్మీర్ లో చొరబాటుకు ప్రయత్నించి.. భారత సైన్యానికి చిక్కిని ఉగ్రవాది తన పేరును అలీ బాబర్ పాత్రాగా పేర్కొన్నారు. అతగాడు కేవలం 19 ఏళ్ల చిన్నకుర్రాడు కావటం గమనార్హం. తాను పాకిస్థాన్ కు చెందిన వాడినని.. తనకు లష్కరే తోయిబా శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. ఈ నెల 26న ఉరి సెక్టార్ వద్ద ఎదురుకాల్పులు జరుగుతున్న వేళ.. భారత సైనికుల్ని తనను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

తనది పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రాంతానికి చెందిన ఒకారా అని.. తమది పేద కుటుంబంగా చెప్పాడు. తండ్రి లేడని.. తాను బట్టల షాపులో పని చేసేవాడినని పేర్కొన్నాడు. ఈ సమయంలోనే తనకు ఐఎస్ఐతో సంబంధం ఉన్న కుర్రాడితో పరిచయం ఏర్పడిందని.. డబ్బుకు ఆశపడి అతడితో కలిసి లష్కరే తోయిబాలో చేరానని చెప్పాడు.

ట్రైనింగ్ సమయంలో తనకు రూ.20వేలు ఇచ్చారని.. ట్రైనింగ్ పూర్తి అయ్యాక మరో రూ.30వేలు ఇస్తామని చెప్పారని.. తనను పాక్ సైన్యం వద్దకు తీసుకెళ్లారన్నారు. వారు చెప్పిన దాని ప్రకారమే తాను.. మరికొందరు కలిసి భారత్ లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు. తమలో ఒకడిని భారత సైన్యం కాల్చి చంపిందని.. మిగిలిన నలుగురు పారిపోగా.. తనను పోలీసులు పట్టుకున్నారన్నారు.

పాక్ లోని సైనికులతో పోలిస్తే.. భారత సైనికుల తీరు కాస్త భిన్నంగా ఉందన్నారు. ఇక్కడి పరిస్థితుల్ని తాను చూసిన తర్వాత.. కశ్మీర్ విషయంలో పాక్ సైన్యం.. ఐఎస్ఐ.. లష్కరే తొయిబా చెప్పేవన్నీ అబద్ధాలేనని స్పష్టమైందన్నారు. తనను భారత్ కు ఎలా పంపారో.. తిరిగి తన తల్లి దగ్గరకు చేర్చాలన్న అతడు.. భారత సైన్యం రక్తపాతం స్రష్టిస్తుందని తనకు చెప్పారని.. కానీ ఇక్కడ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా.. ప్రశాంతంగా ఉందని చెప్పారు. తనను సైనికులు బాగా చూసుకుంటున్నారన్న అతడు.. తన గురించి తన తల్లికి చెప్పాలన్నారు. తాజా ఉదంతం పాకిస్థాన్ కు దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇవ్వటమే కాదు.. అంతర్జాతీయ సమాజంలో తలెత్తుకోలేని విధంగా మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Tags:    

Similar News