తమ దేశానికి రాకుంటే పాకిస్థాన్ ప్రపంచకప్‌ లో ఆడదట

Update: 2020-01-26 06:42 GMT
పాకిస్థాన్‌ తో ఉగ్రవాద దాడుల భయంతో దాదాపు దశాబ్దం పాటు క్రికెట్ దేశాలేవీ అక్కడ పర్యటించలేదు. 2009లో శ్రీలంక క్రికెటర్లపై నేరుగా ఉగ్రవాదులు దాడులు జరిపిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ స్థాయిలో ఎటాక్ జరిగాక ఇంకెవరు ఆ దేశానికి వెళ్తారు? దాని కంటే ముందే ముంబయి దాడుల్లో పాకిస్థాన్ ప్రమేయాన్ని నిరసిస్తూ ఆ దేశంతో క్రికెట్ సంబంధాలు తెంచుకుంది భారత్. మిగతా దేశాలు కూడా పాకిస్థాన్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో స్వదేశంలో ఆడాల్సిన మ్యాచ్‌ లకు యూఏఈని వేదికగా ఎంచుకుని అక్కడే సిరీస్‌ లకు ఆతిథ్యమిస్తోంది పాక్. ఐతే ఈ మధ్య పాక్‌ లో కొంత పరిస్థితి మెరుగుపడి ఒకదాని తర్వాత ఒకటి క్రికెట్ జట్లు అక్కడ పర్యటిస్తున్నాయి. ముందు శ్రీలంక ధైర్యం చేయగా.. తాజాగా బంగ్లాదేశ్ అక్కడ పర్యటిస్తోంది. వీటి కంటే ముందు జింబాబ్వే - వెస్టిండీస్ కూడా ఒకట్రెండు మ్యాచ్‌ లు ఆడాయి.

ఐతే భారత్ మాత్రం పాకిస్థాన్‌ తో క్రికెట్ సంబంధాలు పునరుద్ధరించుకోవడానికి ఇష్టపడట్లేదు. ఈ ఏడాది ఆసియా కప్‌కు ఆతిథ్యమివ్వాల్సిన పాకిస్థాన్.. ఆ టోర్నీని యూఏఈలో కాకుండా స్వదేశంలో నిర్వహించాలనుకుంటోంది. ఈ టోర్నీకి భారత్ రావాల్సిందే అని పట్టుబడుతోంది. కానీ బీసీసీఐ తలొగ్గేలా లేదు. ఐతే ఆసియా కప్‌ కోసం భారత్ పాకిస్థాన్‌ కు రావాల్సిందే అని.. లేదంటే వచ్చే ఏడాది భారత్ ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్‌ లో తాము పాల్గొనమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు హెచ్చరించడం గమనార్హం. ఈ ఏడాది అక్టోబర్ లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్‌ జరగనుండగా.. ఒక ఏడాది వ్యవధిలోనే భారత్ ఈ మెగా టోర్నీకి ఆతిథ్యమివ్వాల్సి ఉంది. మధ్యలో 2018లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ రద్దవడంతో వరుసగా రెండేళ్లు రెండు ప్రపంచకప్‌ లు నిర్వహించనున్నారు. ఐతే పాకిస్థాన్ రాకుంటే పర్వాలేదని భారత్ వదిలేసేలా ఉందే తప్ప.. వారి డిమాండ్‌ కు తలొగ్గి పాకిస్థాన్‌ కు వెళ్తుందా అన్నది డౌటే.
Tags:    

Similar News